సినిమా కథ, కథనం, ప్రజెంటేషన్ ఎట్సెట్రా వేరు… అసలు సినిమాకు టైటిల్ పెట్టడం ఓ పరీక్ష… అది నిర్మాత, దర్శకుల టేస్టు, అవగాహన, అధ్యయనానికి అద్దం పట్టేలా ఉండాలి… ఉండేది గతంలో… సారీ, ఇప్పుడు హీరోల పైత్యమే అంతిమనిర్ణయం కదా… ఇప్పటి ట్రెండ్ ఏమిటంటే..? ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, చార్లి555… లేదంటే వలిమై, బీస్ట్, విజిల్, లైగర్, ఈటీ… ఏదో ఒకటి… నోటికొచ్చింది… ఆ టైమ్‌కు ఏది తోస్తే అది… నేములోనేముంది అనుకుని ఏదో పెట్టేయడం…
అఫ్‌కోర్స్, ఎప్పట్నుంచో ఉన్నదే… ఎన్టీయార్ సినిమా అయితే చాలు, ఏదో ఒక రాముడు అని తగిలించేవారు… అసలు టైటిల్ చూడగానే ఆ జానర్ ఏమిటో, ఆ కథేమిటో రఫ్‌గా చెప్పగలిగేలా ఉండాలి… ఉదాహరణకు మాతృదేవోభవ… సరే, ఇవన్నీ పక్కన పెడితే ఆమధ్య సాయిపల్లవి ప్రధానపాత్రలో నటించిన గార్గి అనే సినిమా వచ్చింది కదా… థియేటర్లలో పెద్దగా నడవలేదు… దానికి కారణాలు బోలెడు ఉండవచ్చుగాక, ఆ సమీక్షలోకి మనం వెళ్లడం లేదు…
ఆ టైటిల్ ఆసక్తికరంగా అనిపించింది… (సోనీ లివ్ ఓటీటీలో ఉంది సినిమా, తెలుగు ప్రేక్షకులు దాన్ని పెద్దగా సబ్‌స్క్రయిబ్ చేసుకోరు)… అసలు గార్గి అంటే ఎవరు..? ఆ పేరును దర్శకుడు ఎందుకు ఎంచుకున్నాడు..? అని కాస్త వెతికితే కొన్ని ఇంట్రస్టింగు వివరాలు తెలిశాయి… ధర్శకుడు గౌతమ్ రామచంద్రన్ కాస్త బుర్ర ఉపయోగించేవాడే… గార్గి అనే పేరు మనకు పురాణాల్లో కనిపిస్తుంది… వలిమై, బిగిలు టైప్ టైటిల్ కాదు ఇది… గార్గా మహర్షి వంశీయుల్లో వాచక్ను అని ఓ రుషి… ఆయన బిడ్డ గార్గి… అందుకే ఆమెను గార్గి వాచక్నవి అని పిలుస్తారు…
Ads
మహిళలకు వేదపఠనం నిషిద్ధమైన రోజుల్లోనూ ఆమె చిన్నప్పటి నుంచే మతగ్రంథాలను, పురాణాలను, వేదాలను, ఉపనిషత్తులను ఔపోసన పట్టేది… నిరంతర జ్ఞానాన్వేషి… సింపుల్‌గా చెప్పాలంటే విదుషీమణి… ఆధ్యాత్మిక, తాత్విక మార్గదర్శకురాలు… బృహదారణ్యక ఉపనిషత్తులో ఈమె పేరు వినిపిస్తుంది… పెద్ద పెద్ద పండితులతో చర్చలకు దిగి, ఓడించేది… అప్పట్లో రుషి, ప్రముఖ వేద పండితుడు యాజ్ఞవల్క్యుడిని జనక మహారాజు సమక్షంలో, పండితసభలో ఓడిస్తుంది ఆమె…
అసలు రుగ్వేదంలో కొన్ని ఘట్టాలను ఈమే రాసిందని చెబుతారు… పెళ్లి చేసుకోలేదు… జీవితపర్యంతం జ్ఞానసముపార్జనే లక్ష్యంగా బతికింది… ఈ సినిమాలో ఓ స్త్రీది ప్రధాన పాత్ర… జీవిత సారాన్ని అర్థం చేసుకుంటూ, తనను తాను నిరంతరం మథించుకుంటూ, నిజం వైపు ప్రయాణిస్తూ, అబద్ధాల్ని గుర్తిస్తూ, అందరితో కలిసే ఉంటూ, అందరినీ కలిపే ఉంచుతూ, తాను అన్నింటికీ దూరంగా ఉంటూ, ఓడిపోతూ, గెలుస్తూ… దుర్మార్గం మన చుట్టూ ఎలా కమ్మేసి ఉందో గుర్తిస్తూ, న్యాయం వైపు నిలబడే పాత్ర…
అందుకే గార్గి పేరు అచ్చంగా ఆప్ట్ అనిపించవచ్చుగాక… కానీ ఓ విశిష్ట స్త్రీ పేరును ఇలాంటి ప్రధానపాత్ర ఉన్న సినిమాకు ఎంపిక చేసుకోవడం దర్శకుడి అభిరుచికి తార్కాణమే… ఇదేకాదు, జడ్జి స్థానంలో సుధ అనే ఓ ట్రాన్స్‌వుమన్‌ను చూపించడం కూడా బాగుంది… దేశంలో మొదటి ట్రాన్స్ వుమన్ లోక్ అదాలత్ జడ్జిగా ‘జోయితా మోండల్’ వెస్ట్ బెంగాల్‌లో సేవలు అందిస్తోంది… ఈ సినిమాలో జడ్జి పాత్రకు ఆమే స్పూర్తి… ఇండియన్ సినిమాలో ఓ ట్రాన్స్ వుమన్‌ను అధికారిక హోదా ఉన్న పాత్రలో చూపించడం తొలిసారి… తోటి లాయర్ల వంకర ప్రశ్నలకు దీటుగా జవాబులిస్తూ, బాధితురాలికి న్యాయం చేయాలనీ.., చట్టాన్ని అతిక్రమించకుండా, మానవత్వాన్ని కాపాడాలని ప్రయత్నించే మానవతావాది ఈ పాత్ర లక్షణం…
ఈ పాత్ర, ఈ కథ సీరియస్‌గా సాగుతూ… ప్రేక్షకుల్ని థియేటర్ల వద్దకు రప్పించలేదు… కానీ టేస్టున్న ప్రేక్షకులు, అంటే ఇలాంటివి చూడాలనుకునే ప్రేక్షకులు ఓటీటీలో చూస్తూనే ఉన్నారు… సోనీ గాకుండా వేరే ఓటీటీ అయి ఉంటే ఇంకా ఎక్కువ తెలుగు ప్రేక్షకుల రీచ్ ఉండేదేమో… ఈ పాత్ర, ఈ కథ బలంగా కనెక్ట్ కావడంలో నటి ఐశ్వర్య లక్ష్మి తను ఓ చిన్న పాత్ర వేసి, సాయిపల్లవికి లీడ్ రోల్ ఇచ్చి, నిర్మాతల్లో ఒకరిగా డబ్బులు కూడా పెట్టింది… గుడ్… సినిమా తారలంటే అందాల్ని తెరపై పరిచి, అన్నీ చంపేసుకునేవాళ్లే కాదు… కొందరు తారలు, ప్రత్యేకించి తమిళ, మలయాళ తారలు డిఫరెంట్ టెంపర్ చూపిస్తున్నారు… అది వివరంగా మరోసారి చెప్పుకుందాం…
Share this Article