.
ఘంటసాల… గానదిగ్గజం… తెలుగు పాట కలకాలమూ గుర్తుంచుకునే గళం… వేల పాటల గాయకుడు, వందల పాటల కంపోజర్… తను ఆలపించిన భగవద్గీత శ్లోకాల ఉచ్ఛారణ, సారం వివరణ నభూతో… తను అమర గాయకుడైంది గీతాగానంతోనే… పాట పాతపడొచ్చునేమో కాలగతిలో, కానీ గీత… నెవ్వర్, అది ఫరెవర్…
అలాంటి శిఖరం బయోపిక్ అంటే ఎలా ఉండాలి.,.? తన జీవితంలోని చీకటివెలుగుల్ని ఒడిసిపట్టాలి… ప్రేక్షకుడు ఓ తాదాత్మ్యంలోకి వెళ్లిపోవాలి… మంచి చేయితిరిగిన సీనియర్ దర్శకుడు అయితేనే అది సాధ్యం అయి ఉండేదేమో… ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ఘంటసాల బయోపిక్ ఈ కోణంలో కాస్త నిరాశను కలిగించేదే…
Ads
ఘంటసాల జీవితంలో ఓ సినిమాకు కావల్సినంత డ్రామా ఉంది… చిన్నతనంలో భిక్షాటన చేసి పొట్ట నింపుకోవడం దగ్గర నుంచి… దేశమే గర్వపడే స్థాయికి ఎదగడం మాత్రమే కాదు… స్వాతంత్ర్య సమరంలో జైలుకు పోవడం, చివరి క్షణాల్లో గొంతు పోగొట్టుకుని చింతించడం మాత్రమే కాదు…
అమరజీవి పొట్టి శ్రీరాములును తమ రాజకీయాల్లో బలిపెట్టిన క్షుద్ర నాయకులు, మరణం తరువాత వదిలేస్తే… తనను గౌరవంగా ఈ లోకం నుంచి పంపించే దిశలో ఘంటసాల తీసుకున్న చొరవ సూపర్… ఈ ఒక్క ఎపిసోడ్ చాలు ఘంటసాల మనస్తత్వాన్ని, మంచితనాన్ని ఘనంగా ఆవిష్కరించడానికి..!

ఇక తెలుగు సినిమా తొలితరాల్లో ఘంటసాల అంటే ఘంటసాలే… అగ్ర కథానాయకులతో సంబంధాలు గట్రా ఇంట్రస్టింగే… ఇవన్నీ ఒక రెండున్నర గంటల్లో చూపించలేం, అందుకే ఓ మంచి ఓటీటీ ప్లాట్‌ఫారంతో మాట్లాడుకుని అయిదారు భాగాల సీరీస్ ప్లాన్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది…
ఎందుకంటే..? లోబడ్జెట్ ఛాయలు నిర్మాణ విలువలను దెబ్బతీశాయి… తారాగణం కూడా ముఖ్యమే… అంటే గాయకుడు కేసీ (కృష్ణ చైతన్య) బాగా చేయలేదని కాదు… బాగానే చేశాడు, కానీ ఓ పాపులర్, సీనియర్ నటుడు అయిఉంటే సినిమా రీచ్ ఇంకా పెరిగి ఉండేది… కథలో, స్క్రిప్టులో డ్రామా ఎక్కువ లేదు… అవే ఘంటసాల పాటలు వాడుకోవడం బాగుంది కానీ… పలు సీన్లు ఇంకా హై ప్రజెంటేషన్‌లో ఉంటే బాగుండేది…
ఒక్క సుమన్ తప్ప తెలిసిన మొహాలు తక్కువ… ఐనా స్మగ్లర్లు, గ్యాంగ్‌స్టర్ల పాత్రల మీదే ధ్యాస, టేస్టున్న మన హీరోల్లో ఒక ఘంటసాలను ఆవహింపజేసుకునే ఆసక్తి, ఆ శక్తి ఎవరికున్నాయి అనేదీ పెద్ద ప్రశ్నే… పైగా మహానటి సినిమా నిర్మాణంలాగే దీనికీ ముందుకొచ్చే టేస్టు ఏ నిర్మాతకు, ఏ దర్శకుడికి ఉన్నాయి ఇప్పుడు..?
ఇది ఏ థియేటర్లలో నడుస్తున్నదో కూడా ఎవరికీ తెలియనంత పూర్ పబ్లిసిటీ… బహుశా దానికీ డబ్బులు మిగల్లేదేమో సినిమా రిలీజ్ సమయంలో..! అక్కడక్కడా ఒకటీరెండు షోలు మాత్రమే నడుస్తున్నట్టున్నయ్… సినిమాలో పెద్దగా క్రియేటివ్ లిబర్టీ కూడా తీసుకోలేదు… దాంతో డాక్యుమెంటరీ పోకడ కనిపిస్తుంది…
సినిమా బాగా లేదని కాదు... ఈ టీమ్ ఏదో ఘంటసాల కథకు అన్యాయం చేసిందనీ కాదు... కానీ వీళ్లు సరిపోలేదు... అదే బాధ..!! ఏదో ఓటీటీలో వచ్చేవరకో లేక టీవీలో వచ్చేవరకే వెయిట్ చేయాలి సగటు ప్రేక్షకుడు... ఎందుకంటే... దీనికి థియేటర్లు దొరకడమే గగనం అయిపోయినట్టుంది... ఎక్కడెక్కడో దూరదూరంగా ఆడ్ టైమ్ షోలు తప్ప..!!
Share this Article