బ్రాండ్ అంబాసిడర్ అంటే ఎవరు..? తెలంగాణ నెటిజనంలో భలే చర్చ సాగుతోంది… పాకిస్థానీ క్రికెటర్‌ను పెళ్లిచేసుకున్న వీరజాతీయవాది సానియా మీర్జాను తెలంగాణకే బ్రాండ్ అంబాసిడర్‌గా చేసి కోట్లకుకోట్లు హారతికర్పూరం చేశారు… ఆమె ఏం చేస్తుందో, ఆమెతో ఏం ప్రయోజనమో ఆమెను ఎంపిక చేసి, కోట్లాది తెలంగాణ ప్రజాధనాన్ని ధారబోసిన పెద్దలు చెప్పాలి… చెప్పడానికి మొహం చెల్లదు… అప్పట్లో ఏదో చేనేతకు అక్కినేని నాగ సమంతను ఎంపిక చేశారు… ఎందుకో, ఎవరిని శాటిస్ఫై చేయడానికో మళ్లీ తెలంగాణ పెద్దలే చెప్పాలి… చెప్పడానికి మొహం చెల్లదు మళ్లీ… అసలు మన ఎంపికలే ఇలాంటివి కదా… ఓ రీతీరివాజు ఉండవు… ఎవరో తెర వెనుక చక్రం గిరగిరా తిప్పుతారు… ఉత్తర్వులు జారీ అవుతాయి… తెలంగాణ జనం ఎడ్డిమొహాలు వేస్తారు… ఇదే రివాజు అయిపోయింది… తాజాగా దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక అలియాస్ బిగ్‌బాస్ హారిక తెలంగాణ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ అట… నవ్విపోదురు గాక…
ఒక రాష్ట్రానికో, రాష్ట్ర అనుబంధ వ్యవస్థలకో బ్రాండ్ అంబాాసిడర్ అంటే ఓ రేంజ్ ఉండాలి… ఆ బొమ్మ, ఆ పేరు వాడుతుంటే జనం చప్పట్లు కొట్టాలి… కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఆ సోయి అస్సలు ఉండదు… ఉండదు… ఎవరీ హారిక..? ఏమిటీమె గొప్పదనం..? నో డౌట్… ఓ యూట్యూబ్ స్టార్… బిగ్‌బాస్ స్టార్… సో వాట్..? ఆమెను కించపరచాల్సిన అవసరం లేదు… కానీ ఏకంగా ఆమె తెలంగాణ పర్యాటకానికే బ్రాండ్ అంబాసిడరా..? ఫాఫం, టూరిజం కార్పొరేషన్ చైన్మన్ వుప్పల శ్రీనివాస గుప్తుడు ఏం చేస్తాడులే… పైనుంచి ఎవరో ఆదేశించి ఉంటారు… తప్పేదేముంది..? అలాగే సార్, అని సంతకం చేసేసి ఉంటాడు… ఆమెను పిలిచి లెటర్ ఇచ్చి ఫోటో దిగి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని ఉంటాడు… తెలంగాణ ప్రభుత్వంలో చాలామంది లీడర్ల దుర్గతి అదే కదా ఫాఫం…
Ads
ఒక్కసారి పైన ఫోటో చూడండి… జస్ట్, ఊరికే విమర్శ గాకుండా రెండు ఉదాహరణలు చెబుదాం… చిన్న వయస్సులోనే ఎవరెస్ట్ అధిరోహించి తెలంగాణ పతాకాన్ని ఎగరేసిన ఘనత… అంతేకాదు, ఓ నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, తెలంగాణ ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఎదిగి, ప్రపంచంలోని అత్యున్నత ఆరు శిఖరాల్నీ అధిరోహించింది… ఓ రికార్డు… ఓ పేదింటి గర్వపతాక… ఓ గిరిజన ప్రతిభాపతాక… ఏం..? ఆమె ఎందుకు కనిపించలేదు..? పోనీ, గ్లామర్ మాత్రమే కావాలీ అంటారా..? మొన్నమొన్ననే కదా వారణాసి మానస మిస్ ఇండియా కిరీటాన్ని తల మీద ధరించి సగర్వంగా తలెత్తుకుని హైదరాబాదులో అడుగుపెట్టింది… అంతకుమించిన బ్రాండ్ అంబాసిడర్ ఎవరుంటారు..? ఆమెకు ఎందుకు దక్కదు ఈ గుర్తింపు..? జస్ట్, ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే… తెలంగాణ సమాజం ఓన్ చేసుకున్న నిజమైన ప్రతిభామూర్తులు ఎందరో ఉన్నారు… వాళ్లెవరూ గుర్తుకురాలేదు గానీ ఈ హారిక అకస్మాత్తుగా తెర మీదకు వచ్చిందా..? అసలు ఏమిటి ప్రాతిపదిక..? ఏమైనా ఓ లెక్కాపత్రం ఉన్నాయా..? అంటే ఓ రీతీరివాజు ఉన్నాయా అని…!!
తాజాకలం :: సోషల్ మీడియా విమర్శలతో సీఎంవో కళ్లు తెరిచిందట… కళ్లు ఉరిమిందట… ఏయ్, ఎవడ్రా హారికను బ్రాండింగ్ చేసిందీ అని తీవ్ర మిక్కిలి ఎక్కువ కోపంతో తిట్టిందట… శ్రీనివాస గుప్తుడిపై గుస్సా అయిపోయిందట… సంబంధిత మంత్రీ ఫైర్ అయ్యాడట… ఇప్పుడు చెప్పు బ్రదర్, ఎవరు చెబితే హారికను నెత్తి మీద ఎక్కించుకున్నవ్..? పెడితే గిడితే ఆ పెద్దోళ్లు పెట్టాలి గానీ, ఆమెను నువ్వెలా బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టినవ్..? సీఎంవోను కాదని నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన పెద్దలు ఎవరబ్బా..?! ఒకవేళ హారిక నియామకాన్ని గనుక రద్దు చేస్తే, ఆమెను అవమానించినట్టే… తెలంగాణ సర్కారు తనను తాను అవమానించుకున్నట్టే…. తప్పు జరగనే వద్దు, జరిగితే జాగ్రత్తగా నిష్కృతి వెతకాలి… అంతేతప్ప.., ఎహెపోవమ్మా, నీ మొహానికి బ్రాండ్ అంబాసిడర్వా..? అని మొహం మీద చెప్పి తీసేయడం కాదు..!!
.
.
మరింత తాజా కలం :: హారిక కొనసాగుతుందని శ్రీనివాస్ గుప్త చెబుతున్నాడు… హారిక కూడా మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి విషయాల్లో ఆటుపోట్లు సహజమే అని చెప్పింది…
Share this Article