ఒక సినిమా చూసే విషయంలో గానీ… ఒక టీవీ ప్రోగ్రాం చూడటంలో గానీ… ఏదైనా కళారూపాన్ని ఆస్వాదించడంలో గానీ… హైదరాబాద్ జనం టేస్టుకూ, చుట్టుపక్కల ఉండే గ్రామీణ ప్రాంతాల ప్రజల టేస్టుకూ భారీగా తేడా ఉంటుందా…? మరీ ఆశ్చర్యపోయేంతగా..! అవును… హైదరాబాద్ టేస్ట్ వేరు… సగటు హైదరాబాదీ ఎంజాయ్ చేసేది డిఫరెంట్… ప్రత్యేకించి టీవీ షోలను ఉదాహరణగా తీసుకుందాం… నమ్మలేని తేడా కనిపిస్తుంది మనకు… అన్ని టీవీ చానెళ్ల మార్కెటింగ్, క్రియేటివ్ ముఖ్యులూ కొంతకాలంగా దీన్ని గమనిస్తున్నారు… కానీ వాళ్ల హైలెవల్ మీటింగుల్లో డిస్కషన్స్ సాగుతున్నయో లేదో తెలియదు గానీ… మనం ఓసారి చెప్పుకుందాం… అల్లాటప్పాగా దేనికి..? గణాంకాలతోనే మాట్లాడుకుందాం… న్యూస్ చానెళ్లు, భక్తి చానెళ్లు, సినిమా చానెళ్లను పక్కన పెడితే, మనకు తెలుగులో ప్రధానమైన వినోద చానెళ్లు నాలుగు… స్టార్ మాటీవీ, జీ తెలుగు, ఈటీవీ తెలుగు, జెమిని టీవీ…
వీటిలో జెమిని టీవీ వాడు అసలు పోటీలో లేనట్టే లెక్క… లిటరల్‌గా సన్ నెట్వర్క్ వాడు జెమినిని వదిలేశాడు… నాలుగో స్థానానికి పడిపోయాడు… ఉండీలేనట్టుగా…! అడ్డగోలు రేట్లకు సినిమాలు కొంటాడు, ప్రసారం చేస్తాడు… అప్పుడొచ్చే రేటింగ్స్ మాత్రమే అప్పుడప్పుడూ ఆ టీవీ లెక్కలోకి వస్తుంటయ్… ఇప్పుడు జూనియర్ ఎన్టీయార్‌తో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రాం ప్లాన్ చేశారు కదా… దాంతో ఏమైనా రేటింగ్స్ కాస్త పికప్ అవుతాయేమో చూడాలి… ఐనా దాని రీచ్, మార్కెటింగ్ టెక్నిక్స్ మరీ పూర్ ఇప్పుడు… అందుకని ఆ ప్రోగ్రాం ఎంతమేరకు క్లిక్ అవుతుందనేదీ వేచి చూడాల్సిందే… ఇక మిగతా మూడు చానెళ్లు బాగానే పోటీపడుతుంటయ్… కాకపోతే ప్రధానపోటీ మాటీవీ, జీటీవీ నడుమ ఉంటుంది… స్టార్ వాడికి రేటింగ్స్ మాయామర్మాలు బాగా తెలుసు కాబట్టి ఎప్పుడూ నంబర్ వన్‌లో ఉంటున్నాడు… అయితే..? ఒక్కసారి ఇది చూడండి…
Ads
ఇది తాజా బార్క్ గణాంక పట్టిక… హైదరాబాద్ కేటగిరీకి సంబంధించినవీ ప్లస్ అందులోని సబ్ కేటగిరీల వారీ రేటింగ్స్… అన్ని సబ్ కేటగిరీల్లోనూ జీ టీవీ చాలా చాలా ముందంజలో ఉంది… స్థూలంగా ఏపీ, తెలంగాణ మార్కెట్లకు సంబంధించి మాటీవీయే నంబర్ వన్… కానీ హైదరాబాద్ విషయానికొస్తే జీటీవీ టాప్… మాటీవీకన్నా చాలా మెరుగైన రేటింగ్స్… అనూహ్యంగా… అంతేకాదు, ఈటీవీ కూడా మాటీవీతో పోటీపడుతుంది… ఇది ఖచ్చితంగా మాటీవీ వాడికి తలవంపులే… కానీ ఎంత చేసినా, ఏం తన్నుకున్నా సరే… హైదరాబాద్ ప్రేక్షకులు మాటీవీని ఇష్టపడటం లేదు… ఎహెపోరా అనేస్తున్నారు… (జెమిని గురించి చెప్పాల్సిన పనేలేదు)… మార్కెటింగ్ స్ట్రాటజీలు, యాడ్స్ సమీకరణాల్లో అర్బన్ 15+ కేటగిరీని ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు… కానీ కమర్షియల్ కోణంలో హైదరాబాద్ రేటింగ్స్ కూడా చాలా ముఖ్యమే… మరి మాటీవీని హైదరాబాద్ ప్రేక్షకుడు ఎందుకు లైట్ తీసుకుంటాడు..?
ఇతర అర్బన్, రూరల్ ప్రేక్షకులతో పోలిస్తే హైదరాబాద్ ప్రేక్షకుడు మరీ టూమచ్ మెలోడ్రామాను ఇష్టపడడు… ప్రత్యేకించి టీవీ సీరియళ్లలో కనిపించే అతి, అడ్డగోలుతనాన్ని చీదరించుకుంటాడు… అందుకే కార్తీకదీపం, గృహలక్ష్మి, దేవత, గుప్పెడంత మనసు వంటి ఓవరాక్షన్ సీరియళ్లను ఇతర ప్రాంతాల ప్రేక్షకులు ఆదరించినా హైదరాబాదీ మాత్రం పెద్దగా పట్టించుకోడు… జీటీవీలో వచ్చే త్రినయని, ప్రేమ ఎంత మధురం, రాధమ్మకూతురు, నంబర్ వన్ కోడలు సీరియళ్ల స్థాయి కూడా సేమ్… కాకపోతే మాటీవీ సీరియళ్లతో పోలిస్తే వీటిని హైదరాబాద్ వ్యూయర్ కాస్త ఆదరిస్తున్నాడు… ప్రధానంగా మాటీవీకి ఎక్కడ కష్టం వస్తున్నదంటే… మరీ ఈటీవీ కూడా దాంతో ఎక్కడ పోటీపడుతున్నదీ అంటే… నాన్-ఫిక్షన్… అనగా రియాలిటీ షోలు… ఈటీవీలో సీరియళ్లు పెద్దగా ఎవడూ చూడడు… అవి మరీ సబ్‌స్టాండర్డ్… కానీ వావ్, జబర్దస్త్, క్యాష్, ఆలీతో సరదాగా వంటి షోలతో నెట్టుకొస్తుంటుంది ఈటీవీ… రాత్రి 9 గంటల న్యూస్ బులెటిన్ సరేసరి… మాటీవీ వాడు వీటిల్లో పూర్… ఎలాగైనా రియాలిటీ కేటగిరీలో పుంజుకోవాలని స్టార్ మ్యూజిక్, డాన్స్ ప్లస్, కామెడీ స్టార్స్ గట్రా స్టార్ట్ చేసినా పెద్ద ఫలితం లేదు… సో, వెంటనే బిగ్‌బాస్ తదుపరి సీజన్ స్టార్ట్ చేసేయడమే ఇక..!!
Share this Article