.
Paresh Turlapati….. చావా చూసాను, సింహం కడుపున సింహం పుడుతుంది, ఛత్రపతి శివాజీ మహారాజ్ కడుపున శంభాజీ పుట్టాడు, అదే చావా టైటిల్ వెనకున్న అర్థం.. పరమార్థం… శంభాజీ సింహం పిల్ల…
ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణంతో మొత్తం హిందూస్తాన్ ను ఏ అడ్డంకులు లేకుండా ఆక్రమించుకోవచ్చని దర్బార్ లో సింహాసనం మీద కూర్చుని ఆనందంగా ఎంబ్రాయిడరీ చేసుకుంటున్న ఔరంగజేబుకు జేబులు చిరిగిపోయే వార్త చెప్తాడు బిళ్ల భటుడు
Ads
మొఘల్ చక్రవర్తులు ప్రజల నుంచి దోచుకున్న ధన రాశులు.. బంగారం దాచి ఉంచిన కోశాగారం మీద ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మెరుపు దాడి చేసి సంపదను స్వాధీనం చేసుకుని ప్రజలకు
తిరిగి పంచేసాడని చెప్తాడు. దాంతో ఔరంగజేబు పక్కలొ బాంబు పడ్డట్టు ఉలిక్కి పడతాడు. ఇదీ కథ ప్రారంభం
అసలు మన భరత దేశం మీద మొదట్లో పతోడూ కన్నేసింది ఈ అపార ధన ధాన్య బంగారు రాశులను చూసే కదా, కాకపోతే మొఘల్ చక్రవర్తులతో పోలిస్తే ఆ తెల్లోల్లకు దొరికింది దొరికినట్టు దోచుకోవడం తప్ప ఈ మత గొడవలు పెద్దగా లేవు
ఎంతసేపూ మా చరిత్ర పాఠాల్లో దేవాలయాలు.. మసీదుల కోసమే యుద్ధాలు జరిగాయని పుస్తకాల మీద పుస్తకాలు రాసి మా ముఖాన కొట్టారు. అసలు చరిత్ర ఏంటో ఇంతవరకు చాలామందికి తెలీదు
అసలు ఈ సినిమా చూసేంతవరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ తెలుసు కానీ ఆయన కొడుకు వీరుడు శంభాజీకి ఇంత వీర చరిత్ర ఉందని తెలీదు
నేటి రోజుల్లో మనలో చరిత్ర తెలిసినవాళ్ళు చాలా తక్కువమంది
వాట్సాప్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెప్పినదాన్నే చరిత్ర అనుకునేవాళ్లు ఎక్కువమంది
అసలు చరిత్ర ఎలా ఉన్నా వాట్సాప్ యూనివర్సిటీ సంగతి ముందుగానే తెలుసుకున్నాడో ఏమో దర్శకుడు సినిమా చిత్రీకరణలో కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు
ఇది రెండు రాజ్యాల మధ్య జరిగిన పోరాటమే కానీ రెండు మతాల మధ్య జరిగిన యుద్ధాలు కాదు అనే అర్ధంలో మొదట్లోనే ఓ డిస్క్లైమర్ పడేసాడు
అలాగే సినిమాలో సాధ్యమైనంత వరకు హిందూ ముస్లిమ్ గొడవలు అనే కోణం కాకుండా మొఘలులు ఆక్రమించిన స్వరాజ్యాన్ని సాధించుకునే మరాఠా పోరాటంగా ఎలివేట్ చేసుకుంటూ వచ్చాడు.
ఓ పోరాట సన్నివేశంలో శంభాజీ యుద్ధ రంగంలోకి వచ్చి గుక్కపట్టి ఏడుస్తున్న ఓ ముస్లిమ్ బాలుడ్ని ఎత్తుకుని క్షేమంగా తల్లి ఒడికి అప్పగిస్తాడు
ఆఖర్లో శంబాజీని గొలుసులతో బంధించి నానా చిత్ర హింసలు పెడుతూ మా మతంలోకి మారితే నిన్ను విడిచి పెడతా అని ఔరంగజేబు ఆఫర్ ఇచ్చినా కావాలంటే నువ్వే మావైపు రా.. ఇక్కడ ఉన్నది ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు చావా అని సింహంలా గర్జిస్తాడు. ఈ ఒక్క సన్నివేశంలో మాత్రం మతం కోణంలోనే డైలాగ్ ఉంటుంది
సరే, సినిమా గురించి చెప్పాలంటే , శంభాజీ పాత్రను మొదటి నుంచీ వీరత్వానికి ధీరత్వానికి ప్రతీకగా తీర్చి దిద్దడంలో దర్శకుడు విజయం సాధించాడు. సినిమాలో నాకు ఎక్కడా విక్కీ కౌశల్ కనిపించలేదు. శంభాజీ మాత్రమే కనిపించాడు
సినిమాలో రెండు రకాల పోరాట దృశ్యాలు ఉంటాయి
ఒకటి తన సైన్యంతో సహచరుల సహకారంతో మొఘల్ సామ్రాజ్యం మీద శంభాజీ చేసే పోరాటం మొదటి ఘట్టం
ఈ పోరాట దృశ్యాల్లో రాజమౌళి మార్క్ కనిపిస్తుంది
బాహుబలిలో ప్రభాస్ యుద్ధాల్లో వాడే టెక్నిక్కులు ఇందులోనూ వాడినట్టు కనిపిస్తుంది
నీళ్లలో నుంచి.. నేలలో నుంచి బయటికొచ్చి శత్రు సైనికులను చంపటం కొంత సినిమాటిక్ లిబర్టీ కింద దర్శకుడు క్రియేట్ చేసిన సన్నివేశాలు, అయినా బానే తీశాడు
ఈ పోరాట దృశ్యాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో బాగా కుదిరాయి
ఇక శంభాజీ ఔరంగజేబు చేతికి బందీగా చిక్కిన తర్వాత కూడా పోరాటం కొనసాగిస్తాడు
నిజానికి రెండో భాగంలో వచ్చిన ఈ సన్నివేశాలే సినిమాకు ప్రాణం పెట్టాయి
శంబాజీ చేతికీ కాళ్లకూ గొలుసులు సంకెళ్లు వేసి ఔరంగజేబు సైనికులు ఈడ్చుకెళ్తున్న సందర్భంలోనూ.. శంభాజీని రక్తమోడేలా కొట్టి చేతి గోర్లు పెకిలించి కళ్ళు.. నాలుక పెరికివేసిన సన్నివేశాల్లో శంభాజీ పరాక్రమం ఎంతటివారైనా రోమాలు నిక్కబొడుచుకొనేలా చేస్తాయి
శంభాజీ పరాక్రమం చూసి ఆఖర్లో ఔరంగజేబు ఒక మాట అంటాడు…
ఇలాంటి పరాక్రమవంతుడు నాకు కొడుకు అయ్యుంటే హిందూస్తాన్ మొత్తం ఆక్రమించుకునే వాడిని అని… శివాజీ మరణం తర్వాత కూడా ఔరంగజేబు దేవుడిని ‘అత్యంత పరాక్రమ వంతుడు అయినటువంటి ఓ వీరుడు స్వర్గానికి వస్తున్నాడు.. వానికి స్వర్గ ద్వారములు తెరిచి సాదర స్వాగతం పలకమని ప్రార్థిస్తాడు
శత్రువు చేత సైతం ప్రార్థనలు చేయించుకున్న వీరులు మన ఛత్రపతి శివాజీ మహారాజ్.. శంభాజీ మహారాజ్ లు. అటువంటి వీరుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన చావా సినిమా ప్రేక్షకులకు ఖచ్ఛితంగా నచ్చుతుంది….
Share this Article