Prabhakar Jaini….. అసలు ఈ సినిమా గురించి నేను నా స్పందన తెలియచేయాల్సి వస్తుందనీ, అసలు నేను ఈ సినిమా చూడాల్సి వస్తుందని కూడా అనుకోలేదు.
కానీ, ఏదో పొద్దుపోకనో, IPL చూడడం ఇష్టం లేకనో, ఈ సినిమా చూసాను. ఎందుకంటే, ఈ ప్రధాన పాత్రధారి హర్ష చేసే బూతు కామెడీ, వెకిలి మాటలు నాకు చిరాకు పుట్టిస్తాయి. ఇతన్ని పెట్టి సినిమా తీయడం కూడా ఈ సినిమా చూడకపోవడానికి ఒక కారణం. కానీ, సినిమా చూసిన తర్వాత నా స్పందన రాయకుండా ఉండలేక పోతున్నాను.
ఇందులో హీరో హర్ష కాదు. ఒక అడవి తెగలో నివసించే వారంతా హీరోలు. ఏదో బూతు కామెడీ అనుకుని చూడడం మొదలు పెట్టిన నాకు తర్వాత బుర్ర తిరిగి పోయింది. ప్రపంచం వెలివేసినట్టు ఉండే ఆ గూడెంలో ప్రతీ ఒక్కరూ, అనర్గళంగా బ్రిటిష్ ఇంగ్లీషు మాట్లాడుతుంటారు. వాళ్ళకు ఏబీసీడీలు నేర్పడానికి హర్ష ఆ గూడేనికి వస్తాడు. ఆ రావడం వెనుక రెండు పిచ్చి కారణాలు ఉంటాయి. ఆ యమ్మెల్యేకు, ఆ గూడెంలో ఏదో విలువైన వస్తువు ఉందని, అదేంటో తెలుసుకుని రమ్మని సోషల్ స్టడీస్ టీచరుగా పనిచేసే హర్షను పంపిస్తాడు. ‘హర్ష’నే ఎందుకంటే, ఆ తెగ వారు నల్లగా, లావుగా, బండగా ఉన్నవాళ్ళనే అందగాళ్ళుగా భావిస్తారంట, వాళ్ళే నచ్చుతారంట. ‘హర్ష’ను అక్కడికి వెళ్ళడానికి ఒప్పించడానికి, ఆరునెలల్లో అతనికి DEO ప్రమోషన్ ఇప్పిస్తామని చెప్తాడు. ఇదంతా నేపథ్యం.
Ads
ఆ గూడెంకు చేరుకున్న తర్వాత జరిగినదంతా ఈ సినిమాకు ప్రాణం. గొప్ప జీవన వేదాంతం తెలుసుకుంటాడు హర్ష. కన్నీళ్ళు కారుస్తాడు. తన మనసులో ఉన్న బరువునంతా దించుకుని, పసిపిల్లాడిలా నాట్యం చేస్తాడు. ఈ సందర్భంగా అనేక సంఘటనల ద్వారా జీవితపు లోతులను దర్శింపచేస్తాడు దర్శకుడు.
క్లైమాక్స్ కు ముందు, గాంధీ గారిని చూడాలని ఉందంటే, హర్ష తన పర్సులోని ఐదు వందల రూపాయల నోటు ఇస్తాడు. దాని మీద ఉన్న బొమ్మ గాంధీగారిది అని తెలుసుకుని, ఆ బొమ్మ వరకు చింపుకుని, మిగిలిన నోటును పడేసి, మహానందపడి పోతాడు ఆ గూడెం పెద్ద. అతన్ని చూసి మిగతా వాళ్ళు కూడా అడుగుతారు. హర్ష ఇచ్చిన ఐదువందల నోట్ల రూపాయల నోట్లనన్నింటిని, గాంధీ గారి బొమ్మ కోసం చింపేస్తుటారు. ఆ గూడెంలో డబ్బు అంటే తెలియదు. వారి గుండెల్లో అంతులేని మానవతా నదులు ప్రవహిస్తుంటాయి.
మధ్యలో శ్రీపాద అనే అమ్మాయి, హర్ష మీద ఒక రకమైన ప్రేమను ప్రదర్శిస్తుంది. ఆ గూడెంలో అతి ముఖ్యమైన, విలువైన వస్తువు మాయం కావడంలో హర్ష పాత్ర ఏమిటి? అతనికి గూడెం విధించిన మరణ శిక్ష నుండి ఎలా తప్పించుకున్నాడో, మీరే చూసి ఆనందించండి.
నాకు మొదటి నుండీ రొడ్డకొట్టుడు కమర్షియల్, స్మగ్లర్ల సినిమాలు, చరిత్రను వక్రీకరించే సినిమాలు నచ్చవు. అవి కూడా సరిగ్గా తీయడం చేతకాదు మనవాళ్ళకు. హీరోను ఒక దైవాంశ సంభూతుడిగా చూపిస్తారు. వందల కోట్లు ఖర్చు చేసి, వేల కోట్లు సంపాదిస్తారు. అంతేనా, జీవితానికి అదేనా పరమార్థం? మీరు ఎన్ని సినిమాలు తీసినా ఒక అంబానీ కాగలరా? ఈ టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, హాలీవుడ్ హీరోహీరోయిన్లంతా అంబానీ ఇంట్లో పెళ్ళిళ్ళకి, పబ్బాలకు వెళ్ళి డ్యాన్సులు వేసి, వంటలు సర్వ్ చేసిన విదూషకులే కదా? ఆత్మ సమ్మాన్ ఎక్కడుంది? సంపాదనకు అంతు ఎక్కడ?
ఆ గూడానికి పోతే మీ వేల కోట్లు చెత్త కాగితాలతో సమానం. ఒక మంచి విషయమేమిటంటే చెత్త, రొడ్డకొట్టుడు సినిమాలలో నటించే, ‘రవితేజ’ ఈ సినిమాను నిర్మించడం. దర్శకుడు కళ్యాణ్ సంతోషుకి నమస్కరించాలనిపిస్తుంది, సినిమా పూర్తయిన తర్వాత. నేను చాలా విషయాలు చెప్పలేదు. మీరే చూడాలని. కాబట్టి, వీలైతే చూడండి. ‘ఆహా’లో ఉంది. మై రేటింగ్ ఈజ్ 10/5.
Share this Article