అమీర్‌ఖాన్ ఎందుకు భయపడుతున్నాడు..? తన సినిమాను బహిష్కరించకూడదని ఎందుకు బతిమిలాడుతున్నాడు..? నేను ఈ దేశభక్తుడినే అని పదే పదే ఎందుకు ప్రాధేయపడుతున్నాడు..? కరీనా ఖాన్ మస్తు అమాయకంగా ‘‘మనం కొన్ని విషయాల్ని మరిచిపోవడం నేర్చుకోవాలి’’ అని జాతికే నీతులు ఎందుకు బోధిస్తోంది తాజాగా..? సినిమా కోసం… అవును, కేవలం లాల్ సింగ్ చద్దా సినిమా కోసం మాత్రమే…
తొలిసారి తెలుగులో సినిమాను మార్కెటింగ్ చేస్తున్న చిరంజీవికి, సినిమాలో ప్రధానపాత్ర పోషించాడు కాబట్టి నాగచైతన్యకు, తండ్రి నాగార్జునకు కూడా అమీర్‌ఖాన్ మాటలు నచ్చవచ్చు… అమీర్‌ఖాన్ మీద ఓ సెక్షన్ వ్యతిరేకత ఈ నటుల మీదకు కూడా కొంతమేరకు వ్యాపించవచ్చు… అయితే నిజంగా ఒక సెక్షన్ ‘బ్యాన్’ అని సోషల్ మీడియాలో ఓ సినిమా మీద వ్యతిరేకతను వైరల్ చేయగానే, జనం చూడటం మానేస్తారా..? లేదు…
ఇదే అమీర్‌ఖాన్ 2015లో దేశవ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు… ఓ రేంజ్ హీరో చేయాల్సినవి కావు… ‘‘ఇంటికెళ్తే నా పెళ్లాం అడుగుతోంది, ఇండియా నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందా అని…’’ ప్రపంచంలో అనేక దేశాలు అంతర్గత జాతివైరాలతో కొట్టుకుచస్తున్నాయి… లక్షల మంది ఎటుతోస్తే అటు వలస పోతున్నారు… అది మరిచిపోయి ఇండియాలో వీథుల్లో జనం ఒకరినొకరు నరుక్కుంటున్నట్టుగా ఓ విపరీత చిత్రణకు ఎందుకు దిగాల్సి వచ్చింది..? దానిపై సరైన వివరణ కూడా ఇచ్చినట్టు లేదు… ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి ప్రేక్షకుల్ని బాబ్బాబు, ప్లీజ్, నేనలాంటివాడిని కాను, నా సినిమాలు బహిష్కరించకండి ప్లీజ్ అని వేడుకుంటున్నాడు…
Ads
అయితే ప్రేక్షకుడు నిజంగా వాటిని మనస్సుల్లో పెట్టుకుంటాడా..? లేదు… ఆ వ్యాఖ్యల తరువాత దంగల్ బంపర్, సూపర్‌హిట్… ఏమాటకామాట అమీర్‌ఖాన్ నటుడిగా పర్‌ఫెక్ట్… చివరకు ఆ ఖాన్ త్రయంలో సైతం షారూక్, సల్మాన్‌కన్నా అమీర్ ఓ మెట్టుపైనే… అప్పట్లో జేఎన్‌యూకు వెళ్లి విద్యార్థులకు సంఘీభావం ప్రకటించిందనే కారణంతో దీపిక పడుకోన్ ఛపాక్ సినిమాను బహిష్కరించాలని ఇదే హిందూ సెక్షన్ పిలుపునిచ్చింది… ఆ సినిమాలో దమ్ము లేక, ట్రీట్‌మెంట్ సరిగ్గా లేక సినిమా ఫ్లాపయింది తప్ప ఈ పిలుపుల వల్ల కాదు…
అంతెందుకు..? విరాటపర్వం బహిష్కరించాలని పిలుపునిచ్చారు… ఆ సినిమాలో ప్రేమ-విప్లవం భావనలు సింక్ కాకపోవడం, అసలు బేసిక్ థీమ్‌లోనే అత్యంత గందరగోళం కారణంగా సినిమా అట్టర్ ఫ్లాప్… అంతే తప్ప సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలతో కాదు… మరి అమీర్‌ఖాన్ ఎందుకు ‘‘నేను దేశభక్తుడినే, ప్లీజ్ బహిష్కరించకండి’’ అని ఎందుకు అంటున్నాడు…?
దంగల్ తరువాత 2017లో జస్ట్, 15 కోట్లతో నిర్మించిన సీక్రెట్ సూపర్‌స్టార్ బాగా వసూళ్లు తెచ్చింది… కానీ 2018లో థగ్స్ ఆఫ్ హిందుస్థానీకి భారీ ఖర్చు పెట్టారు… ఢమాల్… ఆ తరువాత మళ్లీ సినిమా లేదు… పెళ్లాం కిరణ్‌రావుతో విడిపోయాడు… ఈలోపు కరోనాతో చిత్రపరిశ్రమ తీరే మారిపోయింది… ప్రేక్షకుడి అభిరుచీ మారిపోయింది… పెద్ద పెద్ద సినిమాలు గాలిబుడగల్లాగా పేలిపోతున్నాయి… కొన్ని సినిమాలకైతే కొన్నిరోజుల్లో దేశవ్యాప్తంగా కేవలం వేలల్లో మాత్రమే కలెక్షన్లు రావడం నిజంగా ఓ విపత్తు సూచిక ఇండస్ట్రీకి…
కేజీఎఫ్-2; కశ్మీర్ ఫైల్స్; ఆర్ఆర్ఆర్; పుష్ప తప్ప హిందీలో ఏ సినిమా నడవలేదు… అజయ్ దేవగణ్, కంగనా రనౌత్, అక్షయకుమార్ ఎట్సెట్రా ఏడుపులే… ఇదుగో ఈ స్థితిలో ఇక ఈ బాయ్‌కాట్ పిలుపు ప్రభావం కూడా పడితే నష్టం తప్పదనేది అమీర్‌ఖాన్ భయం… సొంత సినిమా… విడిపోయిన పెళ్లాం కూడా సహనిర్మాత… అందుకే వీలైనంతవరకూ సినిమా మీద నెెగెటివిటీని తగ్గించుకునే ప్రయత్నాల్లో పడ్డాడు… ‘‘నేనూ దేశభక్తుడినే’’ అనే ట్వీట్ సారాంశం అదే…
పెరుగుతున్న వయస్సు కారణంగా ఈ సినిమా దెబ్బతింటే, అది మొత్తం తన కెరీర్‌నే దెబ్బతీస్తుందనే భయం అమీర్‌ఖాన్‌ను వెంటాడుతోంది… అని కొందరు చెబుతున్నారు… కానీ అదీ కరెక్ట్ కాదు… తన వయస్సు 57 ఏళ్లు… మమ్ముట్టి, మోహన్‌లాల్‌ల దగ్గర నుంచి… రజినీకాంత్, చిరంజీవి తదితరుల మీదుగా షారూక్, సల్మాన్ వరకు… అసలు హీరోలకు వయస్సేమిటి..? మన ప్రేక్షకుడు అవేమీ పట్టించుకోడు… ముసలితనాన్ని ప్రేమించేవాడే…
నిజంగా హిందూ సెక్షన్ వ్యతిరేకతకు కారణం ఏమిటి..? సోషల్ మీడియాల్లో కనిపించేవే పరిగణనలోకి తీసుకుంటే… 1) పీకే సినిమాలో యాంటీ హిందూ ధోరణిని కనబరిచాడు… 2) 2015లో దేశవ్యతిరేక అసహనం వ్యాఖ్యలు చేశాడు… 3) హీరోయిన్ కరీనాఖాన్ లక్షల హిందువుల ఊచకోతలకు కారకులైనవారి పేర్లను కొడుకులకు పెట్టుకుంది… వీటిపై లోతు విశ్లేషణ ఇక్కడ అవసరం లేదు… కానీ ‘‘పాతవి మరిచిపోవడం నేర్చుకోవాలి’’ అంటోంది కరీనా ఇప్పుడు… ఎందుకు..? ఈ సినిమా సక్సెస్ కావాలి కాబట్టి… అది తమ అవసరం కాబట్టి…! ఇదే నటి ఒకప్పుడు “చూడటం మానేయండి, ఎవడు బతిమిలాడాడు” అని ఎకసక్కెలు ఆడింది… మరి ఇప్పుడు ఈ సన్నాయి నొక్కులు, దేబిరింపులు ఏమిటో మరి..!?
Share this Article