.
ఈ కేసీయార్ వాయిస్‌తో ఇదే సమస్య… తను అధికారంలో ఉన్నప్పుడు చేస్తేనేమో సరస శృంగారం… ఎదుటోడు చేస్తేనేమో వ్యభిచారం… నిన్నటి నమస్తే తెలంగాణ వార్త అచ్చంగా అదే… ఈ వాయిస్ మారదు, నైతికంగా ఎంత దిగజారిపోతున్నా సరే…
తను ఏం రాశాడంటే..? ‘తెలంగాణ సొమ్ము- బీహార్‌లో దుబారా’ అట… అదే హెడింగ్… ఏమిటయ్యా సారాంశం అంటే..? బీహార్ పత్రికల్లో తెలంగాణ సర్కారు యాడ్స్ ఇస్తున్నారు… ప్రకటనల కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు… అక్కడి ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణ ప్రభుత్వ డబ్బు ఖర్చు…
Ads
ఇక్కడేమో పైసల్లేవని ఏడుపు… రేవంత్ సర్కారుపై విమర్శల వెల్లువ… ఇదీ తను రాసుకొచ్చింది… నిజంగానే ఎవడైనా పత్రికల్లో వచ్చేదే నిజమని నమ్మితే… రేవంత్ సర్కారు మీద వ్యతిరేకత పెరగాలని ఈ కథనం అవుడియా… మరి జనం చదవడం మానేసి, అదో పత్రిక ఉందని కూడా మరిచిపోయిన పత్రిక భ్రమ అది… ఎందుకంటే..?
జస్ట్ రీసెంట్ కాలమే కదా… కేసీయార్ పాలన తీరూతెన్నూ జనం ఇంకా మరిచిపోనేలేదు కదా… సారు గారు కూడా ఫామ్ హౌజ్ కదలనే లేదు కదా… ఇదే పత్రికల్లో యాడ్స్ అంశానికొద్దాం… ఇదే కేసీయార్ 2018 లో ఎడాపెడా ప్రకటనలు ఇచ్చాడు… ఏపీలో, తెలంగాణలో మాత్రమే కాదు… దేశంలో ఉన్న అనేకానేక భాషాపత్రికలకు ఇష్టారాజ్యం ప్రకటనలు… తరువాత కూడా ఇచ్చాడు అనేకసార్లు…
అప్పటికప్పుడు పీఆర్వోలు యాడ్ ఏజెన్సీలు స్టార్ట్ చేసి ఎడాపెడా కమీషన్లు కుమ్ముకున్నారు… ఇప్పుడు వాళ్లంతా నీతి ప్రవచనకర్తలు అయిపోయారు, అది వేరే సంగతి… అసలు వాటి సర్క్యులేషన్ ఎంతనేదీ చూడలేదు… వందల కోట్లను ధారబోశారు… ఇదే నమస్తే తెలంగాణ సర్క్యులేషన్ భారీగా చూపి, అడ్డగోలు టారిఫ్‌తో వందల కోట్లను కొల్లగొట్టిన కాలం అది…
అదేమీ కేసీయార్ సంపాదించిన సొమ్ము కాదు… ప్రభుత్వం సొమ్ము, తెలంగాణ జనం సొమ్ము… మరెందుకు ఆ పని చేశాడు..?

propaganda
అప్పట్లో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని, కత్తిపట్టి సిపాయిని నేను, తోపును నేను అని ఉరుకులాడాడు కదా… చైనా అంతు చూద్దాం, పాకిస్థాన్ తాటతీద్దాం, అవసరమైతే ప్రధాని పోస్టూ నాదే, మస్తు డబ్బులున్నయ్, యాంటీ బీజేపీ పార్టీల ప్రచార ఖర్చు మొత్తం భరిస్తా, నేనెందుకు ప్రధానిని కావద్దు, నాకేం తక్కువ..? అని ఉరుకులాడిన రోజులవి…
ఎక్కడెక్కడో చరిత్ర మరిచిన మాజీ ముఖ్యమంత్రులనూ పిలిచి, బీఆర్ఎస్ తీర్థం పోసి, పార్టీలో తెలంగాణ పదాన్ని, అనగా ఆత్మను కత్తిరించుకుంటున్న రోజులవి…
ఎహె, ఇవేం ప్రకటనలు అని అడిగినవారికి… ఇవన్నీ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ బిల్డింగ్ అని అందరి చెవుల్లో రఫ్లీషియా పూలను టోకున పెట్టిన రోజులు అవి… వర్తమానానికి వద్దాం… బీహార్‌లో ఇచ్చినవి కాంగ్రెస్ పార్టీ యాడ్స్ కావు కదా… అవీ తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలే కదా… ప్రభుత్వ పథకాల ప్రచారమే కదా…
మరి అప్పుడు తెలంగాణ బ్రాండ్ ఇమేజీ బిల్డింగో బిల్డప్పో అన్నప్పుడు… ఇప్పుడూ అదే కదా… అది సరసం ఎలా అయ్యింది..? ఇది వ్యభిచారం ఎలా అయ్యింది..? అవి డాక్టర్ సమరం జ్ఞానగుళికలు, ఇవి ఓటీటీల్లోని వెబ్ సీరీస్ అశ్లీలం సీన్లా..? అదెలా..?! ఇదీ తెలంగాణ బ్రాండ్ ఇమేజీ బిల్డింగే కదా…
నో నో… ఇది తప్పా కదా, కేసీయార్ చేశాడు కాబట్టి ఇది తప్పుకాకుండా పోతుందానే ప్రశ్న వస్తుందని తెలుసు… కేసీయార్ తెలిసీ తప్పు చేసి.., ఆ తప్పు ఎదుటోడు చేస్తే మాత్రం తప్పు తప్పు అనడం నైతికంగా తప్పా కాదా అనేదే ఇక్కడ ప్రశ్న..!!
Share this Article