నిన్నటి నుంచీ ఎంత ఆలోచించుకున్నా సరే, అసలు మన గ్రేట్ స్టార్ మోహన్‌బాబు అలా ఎందుకు స్పందించాడా అని అంతుపట్టడం లేదు… నిన్న ఫిలిమ్ నగర్ దైవసన్నిధానంలో రామమందిర ప్రాణప్రతిష్ట సందర్భంగానే ఓ హోమం నిర్వహించి, తరువాత మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే..?
“ఫిలిం ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసింది. ఫిలీం నగర్‌లోని దైవ సన్నిదానం, చిత్రపురి కాలనీ వంటివి ఇచ్చింది. ఇక్కడ అన్ని దేవతా మూర్తులున్నాయి… ఈ మధ్య పాలక మండలి చైర్మన్ పదవి స్వీకరించాను… ఈ సన్నిధానంలో కోరిన కోరికలన్నీ తీరుతున్నాయని భక్తులు చెబుతున్నారు… ఇదీ రామ జన్మ భూమి అని ప్రపంచానికి చాటి చెప్పేలా చేశారు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఆయనకు కృతజ్ఞతలు… రామ మందిర ప్రారంభోత్సవానికి ఊరూరా తరలి వెళ్తున్నారు… నాకు కూడా అహ్వానం అందింది… సెక్యూరిటీ ఇస్తాం అన్నారు… అయినా భయపడి వెళ్లట్లేదు..”
Ads
ఈయన సినిమాలు, మాటలు, చేతలు, పాత్రలు, సందర్భాలు ఏవీ అర్థం కావు… అసలు ఏం చెప్పాలనుకున్నాడో తెలియదు… అయోధ్యకు ఆహ్వానం అందిందీ అని చెప్పుకోవాలంటే నీ ఇష్టం… కానీ ఆ ఆహ్వానం అందిస్తున్న ఫోటో ఏమైనా చూపించి ఉంటే బాగుండేది… మాటలకు క్రెడిబులిటీ ఉండేది… ఓసోస్, చిరంజీవి, ప్రభాస్‌లకే కాదు, నాకూ అందింది, నేనూ ఈ దేశంలోని విశిష్ట వ్యక్తినే అని చెప్పుకోవడానికి మాంచి బేస్ ఉండేది…
ఫిలిమ్ ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఇచ్చింది అనే ప్రస్తావన ఎందుకొచ్చినట్టు ఈ సందర్భంలో..? బాబూ, రేవంత్, నువ్వు సీఎం అయ్యావు, మేం హేపీ అని చెప్పడమా..? జగన్‌తో మాకు బంధుత్వం ఉంది గానీ అదేమీ మనసులో పెట్టుకోకు అని చెప్పదలిచాడా..? పోనీ, ఆ దైవసన్నిధానం విశిష్టత గురించి వివరించడం తన ఉద్దేశమా..? అక్కడ ఎన్ని విగ్రహాలున్నయ్, ఎందరు పూజారులున్నారు, భక్తులకు కోరికలన్నీ తీరతాయి అని చెబుతూనే, నేను పాలకమండలి ఛైర్మన్‌ను అయ్యాను అని ప్రకటించుకోవడం కోసమా..?
సరే, అవన్నీ వదిలేస్తే… సెక్యూరిటీ ఇస్తామన్నారు గానీ వెళ్లడానికి భయమేసింది అట… ప్రత్యేకంగా సెక్యూరిటీ ఇస్తామన్నారంటే నిజంగానే మోహన్‌బాబు చాలా విశిష్ట వ్యక్తే… ఆహ్వానం అందే ఉంటుందనీ నమ్ముదాం… కానీ భయం దేనికి..? ఈమధ్య సిక్స్ ఫర్ జస్టిస్ ఉగ్రవాది పన్నూ అయోధ్యలో విధ్వంసం తప్పదని బెదిరిస్తున్నాడు… వెరీ పాపులర్ పర్సనాలిటీని కాబట్టి ప్రత్యేకించి తనను టార్గెట్ చేస్తారని మోహన్‌బాబు భయమా..?
జైషే ఉగ్రవాద సంస్థ కూడా అయోధ్య మీద దాడులంటూ బెదిరిస్తోంది… అందుకని మోహన్‌బాబు భయపడుతున్నాడా..? ప్చ్, వేలాది మంది కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో యోగి అనుక్షణం సెక్యూరిటీ ఏర్పాట్లు చూస్తున్నాడు… పాపం, తనకు ఈ వ్యాఖ్యలతో ఎంత నామోషీ..? యోగీ ఇజ్జత్ పోయింది… ఇప్పటికిప్పుడు మోడీ ఎస్పీజీ సెక్యూరిటీని మోహన్‌బాబుకు మళ్లించడం కూడా కష్టమే… అమితాబ్‌లూ, అంబానీల దగ్గర్నుంచి వేల మంది సాధువులు, మఠాధిపతులు, బోలెడంత మంది సెలబ్రిటీలు, నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు ఎట్సెట్రా వేలాది మందికి లేని భయం మోహన్‌బాబుకే ఎందుకు..?
కొంపదీసి ఖలిస్థానీ ఉగ్రవాదులు, జౌషే ఉగ్రవాదులకు మించి ఇంకేదైనా థ్రెట్, ప్రమాదాన్ని మోహన్‌బాబు సందేహిస్తున్నాడా..? ఇంకేమైనా ఉప్పు అందిందా..? అయితే ఎక్కడి నుంచి…? ఏమో… ఎన్ఐఏ ఏమైనా రంగప్రవేశం చేసి, మోహన్‌బాబుకు నిజంగానే ఆహ్వానపత్రిక అందించి, పనిలోపనిగా ఆ భయ కారణాలను కూడా దర్యాప్తు చేయడం బెటరేమో…! ఎందుకంటే, వేలాదిమంది దేశవ్యాప్త ఆహ్వానితుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఇలా భయపడుతున్నట్టు బహిరంగంగా ప్రకటించలేదు మరి..!! కొంపదీసి పాకిస్థాన్ తన షహీన్ బాలిస్టిక్ క్షిపణులకు పదును పెడుతోందా..!?
Share this Article