Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఔనా..? మోడీతో జగన్‌కు నిజంగానే బెడిసిందా..? ఐతే ఎక్కడబ్బా..?!

August 9, 2021 by M S R

ఒకే ఒక చిన్న ప్రశ్న… కాదు, పెద్ద ప్రశ్నే…. వైసీపీ మంత్రులు బీజేపీ మీద తొలిసారిగా విరుచుకుపడుతున్నారు కదా… ఇన్నాళ్లూ మోడీ అడుగులకు మడుగులొత్తిన జగన్ అకస్మాత్తుగా తిరగబడుతున్నట్టుగా వ్యవహరిస్తున్నాడెందుకు అనే చర్చల నేపథ్యంలో… జగన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రులు ప్లస్ పార్టీ అధికార ప్రతినిధి సజ్జల ఆరోపిస్తున్నారు కదా… అందుకే ఈ ప్రశ్న… ఇప్పటికిప్పుడు జగన్ ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశాలున్నాయా..? కూల్చేస్తే బీజేపీకి ఫాయిదా ఏమిటి.,.? ఫాయిదా లేనప్పుడు, బీజేపీ ఆ ప్రయత్నాలు చేయనప్పుడు జగన్ హఠాత్తుగా బీజేపీపై ఎందుకు పడినట్టు..? అసలు ఏమిటీ తన వ్యూహం..? తరచి ఆలోచిస్తే జగన్ ఆంతర్యం అంతుపట్టక అయోమయానికి లోనుకావల్సిందే… నిన్న కొత్తపలుకులో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా కాస్త జుత్తు పీక్కున్నా తనూ ఓ నిర్దారణకో, ఓ అంచనాకో రాలేకపోయాడు… నిజమే, జగన్ పొలిటికల్ స్ట్రాటజీలు, నిర్ణయాలు, అడుగులు వేరేవాళ్లకు అంతత్వరగా అంతుపట్టవు… తన చుట్టూ ఉన్నవాళ్లు కూడా తను చెప్పింది చేయాల్సిందే తప్ప, తనెవరికీ ఏదీ వివరించి చెప్పడు… మనకు తోచిన విశ్లేషణలు మనం రాసుకోవాలి, అంతే… నిగూఢంగా సాగే కొన్ని వ్యూహాలు ఉంటయ్… తెరపైకి ఒకరకంగా, తెరవెనుక మరోరకంగా కనిపిస్తుంటయ్…

jagan modi

  1. రాష్ట్రాలన్నీ తిరుగుతూ మోడీ వ్యతిరేక కూటమి కోసం బలంగా ప్రయత్నించే ప్రశాంత్ కిషోర్ జగన్‌కు పొలిటికల్ స్ట్రాటజిస్టు… జగన్‌తో గట్టి సంబంధాలున్నయ్… ఇన్నాళ్లూ మోడీకి అనుకూలంగా ఉన్న జగన్ ప్రశాంత్ కిషోర‌్ దోస్తీని కంటిన్యూ చేయడం దేనికి..? తెలియదు…
  2. తన వ్యతిరేక శక్తుల కూటమితో జగన్ సంబంధాలు పెరుగుతున్నట్టుగా మోడీ భావిస్తున్నాడా..? మొన్నటి ఎన్నికల్లోలాగే ‘‘తెలుగు అక్రమ డబ్బు’’ రాబోయే ఎన్నికల్లోనూ తనకు వ్యతిరేకంగా పనిచేస్తుందేమో అని మోడీ సందేహిస్తున్నాడా..? తెలియదు…
  3. అకస్మాత్తుగా ఆయన సోదరి షర్మిల తెలంగాణ రాజకీయ చిత్రపటంపై ప్రత్యక్షం కావడం ఏమిటి..? ఏ రాజకీయ ప్రయోజనాల కోసం..? ఎవరి లబ్ధి కోసం..? పొరుగు రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెట్టను అంటున్న జగన్ తెలంగాణ రాజకీయాల్ని ఏరకంగా ప్రభావితం చేయాలని అనుకుంటున్నాడు..? తెలియదు…
  4. పైపైన జలాలపై వాగ్బాణాలు విసురుకుంటున్నా జగన్, కేసీయార్ సంబంధాలు ఇప్పటికీ గట్టివే… మరి షర్మిల చేసే ఆరోపణల్ని, దీక్షల్ని టీఆర్ఎస్ ఎందుకు ఉపేక్షిస్తోంది… ఎవరు ఒక్క మాటన్నా సరే గాయిగాయి చేసే అలవాటుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది దేనికి..? ఇదీ స్ట్రాటజీయేనా..? తెలియదు…
  5. తనపై ఉన్న కేసులు, బెయిల్ రద్దు ప్రమాదాల నేపథ్యంలో… జగన్ కేంద్రంలోని బీజేపీకి అన్ని విషయాల్లోనూ సహకరిస్తున్నాడు… ఇప్పుడు సడెన్‌గా పార్లమెంటులో గొంతులు విప్పుతున్నారు వైసీపీ ఎంపీలు, మంత్రులు బీజేపీని తిట్టిపోస్తున్నారు… మరి ఎక్కడ దూరం పెరిగింది..? నిజంగానే పెరిగిందా..? రాధాకృష్ణ సందేహిస్తున్నట్టు కొత్త జగన్నాటకమా..? అదే నిజమైతే ఈ పరస్పర నిందల ప్రహసనాల ఫాయిదా ఏమిటి..? తెలియదు… అందుకే జాతీయ మీడియా కూడా ఏం రాయాలో తెలియక మూసుక్కూర్చుండిపోయింది…

jagan

Ads

  • బీజేపీ సీఎం అనగానే కాషాయం కట్టాలి, బాబా అయి ఉండాలనే తరహాలో నాని చేసిన విమర్శ నవ్వుపుట్టించేదిగా ఉంది… ఏ కాలంలో ఉన్నారు సార్ తమరు..? ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది అనే ఆరోపణ కూడా అంతే… అసెంబ్లీలో వైసీపీ బలం అసాధారణ స్థాయిలో ఉంది… భయమో, భక్తో జగన్ మీద తిరుగుబాటు చేసేంత సీన్ ఇప్పటికైతే ఎవరికీ లేదు… బలమైన కూటములు కట్టి, సర్కారును హైజాక్ చేసే స్థాయి కూడా ఆ పార్టీలో ప్రస్తుతం ఎవరికీ లేదు… మరి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర బీజేపీకి ఎలా సాధ్యం..?
  • పోనీ, నిజమే అనుకుందాం… దాంతో బీజేపీకి వచ్చే ఫాయిదా ఏమిటి..? ఓ పెద్ద గ్రూపు చీల్చి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించడమా..? అసలు ఏపీలో బీజేపీ ఉనికే అంతంతమాత్రం… ఉందాలేదా అన్నట్టుగా… మరిప్పుడు జగన్‌ను కెలకడం వల్ల వచ్చే రాజకీయ ప్రయోజనం ఏమిటి..? మూడింట రెండొంతులను చీల్చి, బీజేపీలో విలీనం చేసుకుంటే తప్ప ఈ కుట్ర సాధ్యం కాదు… పొలిటికల్‌గా… ఆ సీన్ లేదిప్పుడు..?
  • ఆర్థిక క్రమశిక్షణ, అప్పులు గట్రా చూపించేసి, అర్జెంటుగా ఆర్టికల్ 360 ప్రయోగిస్తారనేది మరో సందేహం… అదంత వీజీ కాదు… కొత్త రుణాలకు అనుమతి ఇవ్వకుండా, బ్యాంకుల్ని వెనక్కి తగ్గేలా చేస్తే, జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేని దురవస్థలోకి పడితే చూస్తారు తప్ప… ఆర్టికల్ 360తో జగన్‌కు పొలిటికల్ అడ్వాంటేజీ ఎందుకిస్తారు..?
  • పోనీ, చేస్తారూ అనుకుందాం… సంక్షోభం, శూన్యత ఏర్పడితే వాడుకోవడానికి చంద్రబాబు రెడీగా ఉన్నాడు… తన కెరీర్ అయిపోలేదు, ఈరోజుకూ తను యాక్టివ్‌గానే ఉన్నాడు… మరి చంద్రబాబుకు ఉపయోగపడే పని మోడీ ఎందుకు చేస్తాడు..? అసలు బాబు మొహం చూడటానికి కూడా మోడీ విముఖంగానే ఉన్నాడు కదా… మరి మోడీ ఏం కుట్ర పన్నుతున్నాడు..? ఎందుకు..? సో, ఇవన్నీ తెర మీద ప్రహసనాలేనా..?
  • తెలంగాణలో కేసీయార్ కూడా అంతే… మోడీ ఎదుట సైలెన్స్.., స్టేట్‌లో మాత్రం డిష్యూం డిష్యూం… ఓ మార్మిక అవగాహన నడుస్తూ ఉంటుంది… జగన్ కూడా అదే బాటలో ఉన్నాడా..? పొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం మీద బీజేపీ ఆందోళన, విగ్రహానికి కలెక్టర్ అనుమతి నిరాకరణ… ఇదీ ఓ స్ట్రాటజీయేనా..?

జగన్ నిజంగానే మోడీ మీద కోపంగా ఉన్నాడు అనుకుందాం కాసేపు..? దేనికి..? అప్పుల విషయంలో సహకరించడం లేదనా..? భవిష్యత్ రాష్ట్ర ఆదాయాన్ని చూపి అప్పులు తీసుకురావడం మీద దర్యాప్తు చేయిస్తున్నందుకా..? రాష్ట్ర ఆస్తుల్ని తాకట్టు పెడుతున్న తీరుతో కేంద్రం కొరడా పట్టుకుని రంగంలోకి దిగినందుకా..? ఆర్టికల్ 360 ప్రయోగిస్తారనే సందేహమా..? ఇవేవీ కావు… జగన్‌కు తెలియదా, ఈ అప్పులు, పర్యవసానాలు..? రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయనందుకా..? అదీ కాదు, తనను తీసేస్తే అర్జెంటుగా జగన్‌కు ఫాయిదా లేదు, తీసేయకపోతే నష్టమూ లేదు… రాజకీయాల్లో ఇలాంటివి వస్తుంటయ్, పోతుంటయ్… బెయిల్ రద్దయ్యే ప్రమాదం ఉన్నా, కేంద్రం కోఆపరేట్ చేయడం లేదనా..? సీబీఐ మరీ దూకుడుగా జగన్ బెయిల్‌ వ్యతిరేక వాదనతో అఫిడవిట్లు ఏమీ వేయడం లేదు కదా…! ఈ ఏడేళ్లలోనూ జగన్‌ను ఈడీ, సీబీఐ ఏమీ కెలకలేదు కదా…! పైగా మోడీ రాజకీయంగా తెలుగుదేశానికి ఏమీ దగ్గర కావడం లేదు… మరి జగన్‌కు మోడీ మీద కోపం వచ్చేందుకు సరైన కారణాలేమున్నట్టు..? జాతీయం గానీ, రాష్ట్రీయం గానీ… రాజకీయాలు ఇంతకుముందులా స్ట్రెయిట్‌గా లేవు… అందుకే అంత త్వరగా అంతుపట్టవు… ఇది మోషా శకం.., అంతా మార్మికంగా, గుంభనంగా, మిస్టీరియస్‌గా నడుస్తుంటయ్…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions