జగన్ మళ్లీ అర్జెంటుగా ఢిల్లీ వెళ్తున్నాడు దేనికి..? అటు కేసీయార్‌ను పిలిపించి మాట్లాడిన మోడీషా వెంటనే జగన్‌ను ఎందుకు పిలుస్తున్నారు..? దానికీ దీనికీ లింకుందా..? వేర్వేరు అంశాలేనా..? కాళేశ్వరం, వరద సాయం గురించి కేసీయార్ వెళ్లాడు… పోలవరం, రెవిన్యూలోటు గురించి జగన్ వెళ్తున్నాడు అనే వార్తల్ని చిన్నపిల్లాడు కూడా నమ్మడు… అవి మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో ఫస్ట్ పేజీల్లో రాసుకునే కొత్తతరహా జోకులు… అయితే ఈ భేటీల పరమార్థం ఏమిటో ఢిల్లీ జర్నలిస్టు సర్కిళ్లు, ఆయా పార్టీల్లోని ముఖ్య నేతలకూ ఏమీ తెలియడం లేదు… తెలియనివ్వడం లేదు… ఢిల్లీ వెళ్లాలి, కలవాలి, ఏదో ఒక ఫోటో మీడియాకు ఇచ్చేయాలి, మాటామంతీ కాగానే నేరుగా స్వరాష్ట్రం వెళ్లిపోవాలి… అంతే… నో ప్రెస్ మీట్స్, నో నోట్స్, నో లీక్స్…
కేసీయార్ భేటీలు అయితే మరీ విశేషం… మొన్నమొన్నటిదాకా యుద్ధం చేస్తానని కత్తులు కారాలు నూరిన కేసీయార్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లి, వంగి వంగి దండాలు పెట్టి, వాళ్లు చెప్పింది విని, తను చెప్పుకునేదేదో చెప్పుకుని చక్కా వెళ్లిపోయాడు… జగన్ కథ వేరు… తనపై ఉన్న కేసుల భయమో, ఇప్పటికిప్పుడు కేంద్రంతో ఢిష్యూం ఢిష్యూం అవసరం లేదనో గానీ తను బీజేపీతో బాగానే సంబంధాలు మెయింటెయిన్ చేస్తున్నాడు…
Ads
అమిత్ షాతో మళ్లీ ఆంతరంగిక భేటీ అంటేనే దానికి విశేష ప్రాధాన్యం ఉంటుంది… ఆల్రెడీ ఒక సుప్రీం న్యాయమూర్తి ద్వారా ప్రభావితం అవుతూ హైకోర్టు లక్ష్మణరేఖలు దాటి మరీ తనను ఇబ్బంది పెడుతున్నట్టుగా ఆయన కేంద్రానికి మొరపెట్టుకున్నాడనే వార్తలు వచ్చాయి గతంలోనే… ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కే లేఖ రాశాడు… ఆ వ్యవహారం ఎక్కడికక్కడ ఆగిపోయింది… కేంద్రం కదల్లేదు, సుప్రీం కూడా మెదల్లేదు…
ఇప్పుడు సుప్రీంకోర్టు కొలీజియం పలు రాష్ట్రాల హైకోర్టుల చీఫ్ జస్టిస్లను బదిలీ చేయబోతోందని సమాచారం… హైదరాబాద్, అమరావతి హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కూడా మార్చే అవకాశాలున్నట్టుగా ఆంధ్రజ్యోతి కథనం… జగన్ ఆరోపణ, ఫిర్యాదు చేసిన వెంటనే ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను మార్చితే అది తప్పుడు సంకేతాల్ని ఇచ్చినట్టు అవుతుందని ఇన్నాళ్లూ ఆగారా..? నలుగురైదుగురి బదిలీలు చేసినప్పుడే ఇదీ చేయడం బెటర్ అనుకున్నారా..? లేక ఇవి రొటీన్ బదిలీలే తప్ప వీటికి రాజకీయ ప్రాధాన్యమో, సందర్భ ప్రాధాన్యమో ఏమీ లేదా..? అన్నీ వి‘శేష’ ప్రశ్నలే…
ఆఫ్టరాల్ ఒక ముఖ్యమంత్రి ఏదో చెప్పగానే… దాన్ని సీరియస్‌గా తీసుకోవాలా..? రాజ్యాంగ ఉల్లంఘనలు జరగకుండా, రాజకీయ, బ్యూరోక్రటిక్ వ్యవస్థలు దారితప్పకుండా కోర్టులు… ఈ ప్రభావాలకు అతీతంగా, బలంగా నిలబడాల్సిందే అనేది ఆదర్శ నీతిసూత్రమే… కానీ జగన్ ప్రభుత్వం తీర్పులు, విచారణలకు కూడా రకరకాల ఉద్దేశాలను ఆపాదిస్తోంది…
న్యాయమూర్తుల బదిలీ అధికారం రాష్ట్రపతిదే అయినా సుప్రీం చీఫ్ జస్టిస్‌తో సంప్రదింపుల అనంతరమే చేయాలి… ఈ స్థితిలో జగన్ కేంద్రం నుంచి ఏం కోరాడు..? కేంద్రం దీన్ని ఎలా పరిష్కరించబోతోంది… ఓ చిక్కు ప్రశ్న…
తనకు రిలీఫ్ దొరక్కపోతే తను ఇప్పటిలాగే కేంద్రంతో సయోధ్యతో ఉంటాడనీ అనుకోలేం… ఎంతగా తనకు కేసుల భయం ఉన్నా సరే, ఏదో ఒక దశలో ఓపిక విరిగిపోతే… తను బీజేపీతో తెగదెంపులు చేసుకుని, యాంటీ-మోడీ శక్తుల శిబిరంలోకి చేరిపోయే ప్రమాదమూ ఉంది… అసలు జగన్‌తో బీజేపీ అవసరం ఎంత..? గతంలోలాగే చంద్రబాబును దగ్గరకు తీసి, కాంగ్రెస్- అనుకూల శక్తుల కూటమిని బలహీనపరచడం బెటరా..? అసలు చంద్రబాబును మళ్లీ నమ్మడం కొరివితో తలగోక్కున్నట్టేనా…?
నిజానికి సోనియాపై తిరగబడి, ఏదేమైనా సరే, ఎదుర్కుంటాను అనే ఆ టెంపర్మెంటే జగన్‌లో ఇప్పటికీ ఉందా..? ఇన్ని ప్రశ్నల నడుమ… ఏదీ తేల్చుకోలేని బీజేపీ హైకమాండ్ ప్రస్తుతానికి జగన్‌ను చల్లబరిచే ఏదో కార్యాచరణను తన ముందు ఉంచబోతోందా..? అదే నిజమైతే ఏమిటది..? వేచి చూడాల్సిందే…
Share this Article