హైదరాబాద్- బెంగుళూరు నడుమ ఎక్కువగా విమాన ప్రయాణాలు చేసేవాళ్లకు తెలుసు… ఎప్పుడూ ఎవరో ఒక సీరియల్ టీవీ నటి బిజినెస్ క్లాసు కుర్చీలో కనిపిస్తుంది… మరీ శని, సోమవారాల్లో ఎక్కువగా… ఎందుకు..? టీవీ సీరియళ్లలో నటించడానికి బెంగుళూరు- హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తుంటారు చాలామంది…
నిజం… ఈరోజు ఏ చానెల్‌లో ఏ సీరియల్ చూసినా సరే, ప్రధాన పాత్రలన్నీ కన్నడ తారలే… ప్రధాన పాత్రలే కాదు, ఓ మోస్తరు పాత్రల్లోనూ వాళ్లే… మన తెలుగువాళ్లు లేరా..? ప్రోత్సహించరా…? అంటూ మనం గింజుకుంటాం గానీ, సీరియళ్ల నిర్మాతలకూ కారణాలుంటయ్… అవి చదివితే కరెక్టే కదా అనుకుంటాం…
Ads
నిన్నో మొన్నో ఆంధ్రజ్యోతిలో అనుకుంటా… విష్ణుప్రియ పే-ద్ద ఇంటర్వ్యూ వచ్చింది… నిజానికి ఇంత పెద్ద ఇంటర్వ్యూకు సందర్భం ఏమీ లేదు… ఎవరో ఓ సెలబ్రిటీ దొరికింది, రాసేశారు… మరి ఏదో ఒకటి నింపాలి కదా… అయితే సహజంగానే సోది విషయాలు నింపేశారు, కానీ ఒక్క విషయం మాత్రం బాగా చెప్పింది… నిజం కూడా…
విష్ణుప్రియ అంటే గుర్తుకురావడం లేదా..? కొన్ని సినిమాల్లో వేషాలు వేసింది… త్రినయని సీరియల్‌లో హాసిని పాత్ర వేస్తోంది కదా… చిత్రమైన డ్రెస్సింగులతో, హీరోయిన్‌కు సపోర్టివ్ అమాయకపు పాత్ర… ఆ పాత్ర ఆమెకు కరెక్టుగా సూటైంది… విషయంలోకి వస్తే… మన సీరియల్స్‌లో లీడ్ రోల్స్ కన్నడ తారలే ఎందుకు చేస్తున్నారు..? ఈ ప్రశ్నకు ఆమె జవాబు ఏమిటంటే..?
‘‘తెలుగు అమ్మాయిలు ఎందుకు రారు, వచ్చినా ఎందుకు నిలబడరు, వాళ్లకు మెయిన్ రోల్స్ ఎందుకు ఇవ్వరు అనేది చాలా మందిలో ఉన్న సందేహం… కానీ టాలెంట్ ఎవరైనా, ఎక్కడి వారైనా ఒక్కటే… అన్ని చానెల్స్‌లో కలిపి దాదాపు యాభై దాకా సీరియల్స్ నిర్మితం అవుతున్నయ్… అందరూ తెలుగువారే కావాలంటే ఐదారొందల మంది కావాలి, కానీ..?
మనవాళ్లు ఒకటి చేయగానే రెమ్యునరేషన్ పెంచేస్తారు… లీడ్ రోల్ అయితేనే చేస్తామంటారు… అదే కన్నడ అమ్మాయిలైతే ప్రాజెక్టు మొత్తానికి సైన్ చేస్తారు… అదయ్యేదాకా వేరే ప్రాజెక్టులు చేయరు… కండిషన్లు పెట్టరు… ఎప్పుడంటే అప్పుడు షూటింగులకు వస్తారు… పైగా కొత్తవారిని తీసుకొచ్చే కొద్దీ ఫ్రెష్ లుక్ వస్తుంది…’’ ఇలా చెప్పుకొచ్చింది…
అక్షరాలా నిజం… తెలుగమ్మాయి అయిఉండీ రియాలిటీ ఏమిటో తన అవగాహనను చెప్పింది… (హనుమాన్ జంక్షన్ అమ్మాయి)… నిర్మాతలు సౌలభ్యాన్ని, ప్రొఫెషనల్‌గా కష్టపడే వాళ్లను ఎంకరేజ్ చేస్తారు… మనవాళ్లు తమ టెక్కు, తమ గీరతో అవకాశాల్ని చెడగొట్టుకుంటున్నారు… ఈ విమర్శ చాన్నాళ్లుగా ఉంది… సినిమాల్లో ఎలాగూ తీసుకోరు, సీరియళ్లలోకీ రానివ్వడం లేదు… అంతెందుకు..? సౌమ్యా రావు వంటి ఆర్టిస్టులు యాంకరింగులోకి కూడా వచ్చేస్తున్నారు… మారాల్సింది ఎవరు..?
Share this Article