బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నిక కోణంలో…. ఇప్పుడప్పుడే బీజేపీ ఉపఎన్నికలపై దృష్టిపెట్టదు అని చాలారోజుల క్రితమే ‘ముచ్చట’లో చెప్పుకున్నాం కదా… అదే జరుగుతోంది… ఇప్పుడంత అర్జెంటుగా హుజూరాబాద్ ఉపఎన్నిక నిర్వహించాల్సిన అవసరం కేంద్రానికి లేదు… ఉండదు… ఇంకా జాప్యం జరుగుతూనే ఉంటుంది… (అబ్బే, కేంద్రానికీ ఎన్నికల సంఘానికీ లింకేమిటి అనడక్కండి, అది చాలా లోతైన సబ్జెక్టు)… ఈ జాప్యం వల్ల జరుగుతున్నదేమిటి..?
- కేసీయార్ తెలంగాణలో అజేయుడు అనే భావన బద్దలవుతోంది… విపక్షాలను తొక్కేశాడు, తిరుగులేని చాణుక్యుడు అనే ప్రచారం పటాపంచలవుతోంది… జాతీయ సర్వేలు కూడా కేసీయార్ జనాదరణ ప్రస్తుత స్థాయి ఏమిటో తేల్చేస్తున్నయ్… హుజూరాబాద్‌లో ఈటల ఓటమి కేసీయార్‌కు ఓ విషమపరీక్షగా మారిపోయింది… అది లేటయ్యేకొద్దీ కేసీయార్ ఇంకా అదుపుతప్పిపోవడం ఖాయంగా కనిపిస్తోంది…
- నిజానికి హుజూరాబాద్ ఉపఎన్నికను కేసీయారే చేజేతులా తనకు నష్టదాయకంగా చేసుకుంటున్నాడు… అది సర్వజనాభిప్రాయం… టీఆర్ఎస్ ముఖ్యుల్లోనే ఈ ఫీలింగ్ ఉంది, బయటపడితే మెడపై కత్తి తెగుతుంది కాబట్టి ఎవరూ బయటికి మాట్లాడరు…
- ఇంకా ఇంకా కేసీయార్ తీసుకోబోయే నిర్ణయాలు, కురిపించబోయే వరాలు తనలోని భయాన్ని మరింతగా ఎక్స్‌పోజ్ చేయబోతున్నాయి…
- విపక్షాలు కూడా కేసీయార్ జేబులో పార్టీలే అనే ఫీలింగ్ ముక్కలైపోతోంది… బీజేపీ కిషన్‌రెడ్డి చేతుల్లో లేదు, బండి సంజయ్ పగ్గాలు పట్టుకుని ఉన్నాడు… నాణ్యమైన నాయకత్వమా కాదా అనేది వేరే సంగతి… పార్టీ కాస్త సబ్జెక్టుపరమైన దాడి చేయగలిగితే, తెలంగాణ బీజేపీలో గ్రూపుల్ని అమిత్ షా గనుక నిర్దాక్షిణ్యంగా అణిచివేయగలిగితే బీజేపీ డెఫినిట్‌గా ఇంకాస్త దూకుడు పెంచగలదు… తాత్కాలికంగా తగ్గినట్టుగా కనిపిస్తున్నా సరే, నాలుగు లోకసభ స్థానాలు గెలిచిన బీజేపీని తక్కువ అంచనా వేస్తే అది తెలియనితనమే అవుతుంది…
- రేవంత్ పీసీసీ అధ్యక్షుడయ్యాక ఖచ్చితంగా కాంగ్రెస్‌లో కొంత కొత్త జోష్ కనిపిస్తోంది… ఏడేళ్లుగా రోజురోజుకూ క్షీణించిన కాంగ్రెస్ రాజకీయకళ మళ్లీ ఊపిరిపోసుకున్నట్టుగా ఉంది… ఆ పాత ఉత్తమ్, ఆ పాత జానా తదితరులను వదిలేయండి ఇక… అవన్నీ ఒడిశిపోయిన కథలు… కేసీయార్ ప్రయోగించిన దళితబంధుకు ప్రతిగా రేవంత్ ప్లాన్ చేసిన ఇంద్రవెల్లి, రావిర్యాల సభలు తెలంగాణలో ఇంకా క్షేత్రస్థాయిలో బలంగానే ఉన్న కాంగ్రెస్ కేడర్‌కు అద్దం పట్టాయి… అర్జెంటుగా ఓ పది మంది మంత్రుల్ని రంగంలోకి దింపి కౌంటర్లు ఇప్పించాడు… కానీ తెలంగాణలో మంత్రుల మాటలకు పెద్ద సీన్ ఏముంది, ఇప్పుడు రేవంత్ ఏకంగా సీఎం దత్తత గ్రామం మూడుచింతలపల్లెలోనే దీక్షకు దిగాడు… కేసీయార్ జన్మస్థలి చింతమడక, దత్త గ్రామాలు ఎర్రవల్లి, వాసాలమర్రిలతో పోలిస్తే మూడుచింతలపల్లె గతేమిటో సహజంగానే చర్చకు వస్తోంది…
- రేవంత్ ప్రభావానికి సహజంగానే… ఎవరో ప్రయోగించిన షర్మిలబాణం విఫలమైపోతోంది… ఈరోజుకూ ఆ పార్టీకి, ఆమెకు నామమాత్రం యాక్సెప్టెన్సీ లేదు, రాలేదు… వెంట ఉన్న ఒకరిద్దరు కూడా ఆమెను వదిలేసి పారిపోయారు… తెలంగాణ వాళ్లు ఎడ్డోళ్లు అనుకున్న తెరవెనుక వ్యూహకర్తలు అడ్డంగా బోల్తాకొట్టేస్తున్నారు… సంప్రదాయికంగా కాంగ్రెస్ వెంట నిలిచిన సెక్షన్లలో కాస్త కదలిక కనిపిస్తోంది… రేవంత్ ‘‘దళిత, గిరిజన దండోరా’’ల వ్యూహమూ అదే… రాహుల్ గనుక టీపీసీసీలో ఇప్పటికీ మొరాయించే నేతల పట్ల కఠినంగా ఉండగలిగితే కథ ఇంకాస్త వేరేగా ఉండబోతున్నది… దెబ్బతిని నాయకత్వలేమితో మిగిలిన పాత తెలుగుదేశం అభిమానగణం కూడా రేవంత్ వైపే చూస్తోంది ఇప్పుడు…
Ads
ఇంతకుముందయితే ఉపఎన్నిక ఏదైనా వస్తే, కేసీయార్ ఫామ్ హౌజ్ కూడా కదిలేవాడు కాదు… ఏ హరీష్‌రావో ముందుండి కథ నడిపించేవాడు… కేసీయార్ మడత నలిగేది కాదు… అలా అలా అలవోకగా గెలుపును తన ఖాతాలో వేసుకునేవాడు… కానీ ఇప్పుడు హుజూరాబాద్ విషయంలో ఆపసోపాలు, పరుగులు, చెమటలు, ఆయాసం కనిపిస్తున్నయ్… ఏడున్నరేళ్ల పాలన అద్భుతంగా ఉందని చెప్పుకుంటారు కదా, మరి అది హుజూరాబాద్‌లో గెలిపించలేదా పార్టీని..? ఎందుకీ అవస్థ..? అదుపు తప్పుతున్నయ్ ఆలోచనలు… దళితబంధు ఆ పార్టీ సీనియర్ నాయకుడు కడియం చెప్పినట్టు పులిమీదస్వారీ కాబోతోంది… మిగతా సెక్షన్లు దూరమవుతున్నయ్… బూమరాంగ్ అయిపోతోంది… ‘‘మరి మా సంగతేమిటి..?’’ అనే ప్రశ్న ఎంబీసీల్లో, బీసీల్లో, గిరిజనంలో, మైనారిటీల్లో ప్రబలంగా వ్యాపిస్తోంది… వందల కోట్ల ఫైళ్లు క్లియర్ అయిపోతున్నయ్ హూజారాబాద్‌లో… కమిషన్ల చైర్మన్లు, ఎమ్మెల్సీలు… ఏదంటే అది… కేసీయార్ చేజేతులా తనకు నష్టదాయకమైన సంకేతాల్ని తెలంగాణ సమాజంలోకి పంపిస్తున్నాడు… ‘‘ఈటల ఇప్పటికే నైతికంగా గెలిచాడు… కేసీయార్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు’’ అని… ఇప్పటికిప్పుడు కేసీయార్ హుజూరాబాద్‌లో గెలిచినా సరే, ఆ గెలుపుకి ఓ విలువ లేకుండా చేసుకుంటున్నది సాక్షాత్తూ కేసీయారే… అసలు ఇప్పుడు మనం చూస్తున్నది కేసీయార్‌నేనా…!! కేసీయార్‌లో మరీ ఇంత బేలతనం దాగుందా..!? హుజూరాబాద్‌లో ఓడిపోతే కిరీటం పడిపోతుందా..? లేదు కదా…! మరెందుకు ఈ అగచాట్లు..? ప్రజావ్యతిరేకత మరింత వ్యాప్తి చెందుతుందనే ఆందోళనా..?! అదే నిజమైనా సరే, మరీ పోరాటం ఇంతగా జనం విస్తుబోయి, కేసీయార్ వైపు సగటు తెలంగాణవాసి విస్మయంగా చూసే స్థాయికి దిగిపోవాలా..?! ఎక్కడో ఏదో తేడా కొడుతోంది…!
అప్ డేట్ ::::: ఇతర కులాల నుంచి సెగ గట్టిగానే తగుల్తున్నది… నో, నో, అందరీకీ బంధు పథకం ఉంటుందీ అంటున్నాడు… ఈరోజు టీఆర్ఎస్ రాష్ట్ర భేటీలో అదే చెప్పాడు… ఓసీ పేదలు, బీసీలు, మైనారిటీలకు కూడా ఇస్తాడట… కాకపోతే ప్రాధాన్యాలవారీగా అట… ఎంబీసీకన్నా ప్రయారిటీ ఏముంది..? కమాన్, కనీసం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్ నియోజకవర్గాల్లో స్టార్ట్ చేయి నాయకా… అదే, పైలట్ ప్రాజెక్టుగానే…. మొత్తం ఇవ్వాలంటే తెలంగాణను అమ్మేసినా నిధులు సరిపోవు… అది నీకూ తెలుసు…!! ఏదో హుజూరాబాద్ గండం గట్టెక్కితే చాలు అంటావా… అయితే వాకే…
Share this Article