దూరం నుంచి చూస్తే గులాబీ, కాషాయం రంగులు ఒకేలా కనిపిస్తాయి… తెలంగాణ రాజకీయ చిత్రపటం మీద వాటిని దగ్గర నుంచి చూసినా ఒకే తీరులో కనిపిస్తున్నయ్… కారణం సింపుల్… కాషాయ శిబిరంలో గాయిగత్తర లేపుతానన్న కేసీయార్ కాడికింద పడేశాడు… కాదు, కత్తే కింద పడేసిండు… అంతేకాదు, అచ్చు బీజేపీ ప్రభుత్వంలోలాగే అడుగులు వేస్తున్నాడు… చివరకు కొన్ని బీజేపీ శ్రేణులు కూడా ఊహించనంత..! ఎటొచ్చీ మా సారు కత్తులుకారాలు నూరి, మోడీకి ముచ్చెమటలు పట్టించి, అమిత్ షాను అడవుల్లోకి తరిమేస్తాడనుకుని… రెచ్చిపోయిన కలాలు, గళాలు అర్జెంటుగా యూటర్న్ తీసుకోలేక, బాసు తిరిగినంత వేగంగా వెనక్కి తిరగలేక ఆపసోపాలు పడిపోతున్నాయి… కొత్తగా యూటర్న్ కీర్తన సాధన చేస్తున్నాయి…
దుబ్బాకలో దెబ్బ, గ్రేటర్లో షాక్… సారు నేలమీదకు దిగివచ్చాడు… తన మీద జనంలో పెరిగిన వ్యతిరేకతకు కారణాలు ఒక్కొక్కటే స్టడీ చేస్తూ, రాకెట్ స్పీడులో దిద్దుబాటు చర్యలకు దిగాడు అని స్థూలంగా పైకి కనిపిస్తున్న చిత్రం… ధరణి స్టాప్… ఎల్ఆర్ఎస్ స్టాప్… నియంత్రిత సాగు స్టాప్… కొనుగోలు కేంద్రాలు స్టాప్… నేడో రేపో పీఆర్సీ, పదవీ విరమణ వయస్సు పెంపు… ఇంకేమైనా ఉంటే అవీ చకచకా రోజుకొకటి సెటిలైపోతుంటయ్ ఇక… సరే, ఆ నిర్ణయాల్లోనూ బోలెడంత తప్పుదనం చోటుచేసుకుంటోంది, అది వేరే సంగతి…
Ads
మొన్నమొన్ననే కదా, మోడీ రైతుచట్టాలు దుర్మార్గం అని కేసీయార్ రాష్ట్ర బంద్ చేయించాడు… ఢిల్లీ వెళ్లిరాగానే మొత్తం గప్‌చుప్… సేమ్, మోడీ చెప్పినట్టే… మీరు మీ పంటను ఎక్కడైనా అమ్ముకొండి అంటున్నాడు కేసీయార్… త్వరలో కొత్త విద్యుత్తు చట్టానికీ జై అంటాడు… నిన్న ఆయుష్మాన్భారత్కూ జై అన్నాడు…
నిజానికి మా ఆరోగ్యశ్రీయే సూపర్ పథకం, మీ ఆయుష్మాన్ భారత్ మాకెందుకు అన్నాడు మొదట్లో… అడిగీ అడిగీ బీజేపీ వాళ్లు కూడా ఇక ఆ పథకం గురించి అడగడం మానేశారు… ఇప్పుడు తనంతటతనే ఆయుష్మాన్ భారత్‌లో చేరనున్నట్టు చెబుతున్నాడు… ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్భారత్ కలిపి అమలు చేస్తారట… మళ్లీ అందులో ఇంకేం యాంబిక్విటీ రానుందో… ఏమో… ఇదే ఊపులో అగ్రవర్ణ పేదలు కోరుతున్న EWS రిజర్వేషన్లు కూడా అమలు చేస్తాడేమో… చేసెయ్యండి సార్…
ఏమిటీ హఠాత్పరిణామం..? అసలు ఢిల్లీకి పిలిపించి కేసీయార్‌కు ఏం చెప్పారు బీజేపీవాళ్లు..? కొన్ని పత్రికలు అనుమానిస్తున్నట్టుగా… నీ అవినీతిని తవ్వి, జైలులో పెడతాం అని బెదిరిస్తే ఇలా మారిపోయాడా..? ఐనా ఇప్పటికిప్పుడు కేసీయార్‌ను తమ దారిలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది..? యాంటీ-మోడీ శక్తులకు కేసీయార్ డబ్బులిచ్చాడనే ఆధారాలు దొరికితే దొరకవచ్చుగాక… సోవాట్..? రాజకీయాల్లో కామనే కదా…
కేసీయార్ చెప్పగానే యాంటీ-మోడీ శక్తులు, ప్రాంతీయ పార్టీలు ఓ సమాఖ్యగా ఏర్పడి, ఏదో సంచలనం సృష్టించేంత సీన్ ఏమీ లేదు… కేసీయార్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చినా బీజేపీకి వచ్చే నష్టమేమీ లేదు… కానీ ఏం చెప్పి కేసీయార్‌ను ఇలా లొంగదీశారు అనే చర్చే ప్రబలంగా సాగుతోంది రాష్ట్రంలో..? కేటీయార్‌ను సీఎంగా చేసి, మేం చెప్పినట్టు చేయి అన్నారూ అనుకుందాం… మరి దీనివల్ల తెలంగాణలో అధికారంలోకి రావాలి అనుకునే బీజేపీకి ఏం ఫాయిదా..? కేసీయార్ బలంగా, పదిలంగా ఉంటే బీజేపీకి చాన్స్ ఎలా దొరుకుతుంది..?
బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఇష్యూ బేస్డ్గా మద్దతు, వ్యతిరేకత… అప్పుడే వెనక్కి, అప్పుడే ముందుకు అన్నట్టుగా కేసీయార్ చాకచక్యంగా బండి నడిపిస్తూ వస్తున్నాడు ఇన్నిరోజులూ… కానీ మరీ ఇప్పుడు చూపిస్తున్న విధేయత గతంలో ఎన్నడూ లేదు… మరీ అన్నాడీఎంకే సీఎం పళనిస్వామి కూడా ఇంత బేలగా చేతులెత్తేయలేదు… జగన్ కూడా మరీ దాసోహం అనడం లేదు… బండి సంజయ్, డీకేఅరుణ, వివేక్, అర్వింద్ గట్రా ఏమంటున్నారనేది ముఖ్యం కాదు… ఢిల్లీ బ్యాచ్ ఏం ఆలోచిస్తున్నదనేదే ప్రధానం… అది అంత వీజీగా బయటపడదు… కొంపదీసి… 2022… జమిలి ఎన్నికలు… మరింత బలమైన అధికారం కోసం… కాంగ్రెస్ ముక్తభారత్… దక్షిణాదిన జగన్, కేసీయార్ వంటి నేతలతో ‘‘రాజకీయ అవగాహన’’ గట్రా సమీకరణాలు ఏమైనా తెరమీదకు రాబోతున్నాయా..? కానీ అవి సాధ్యమేనా..?
Share this Article