అల్టిమేట్ ఫోటో… నిజానికి ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు… ఒక దేశప్రధానిని కలిసిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యాదగా నమస్కారం పెట్టాడు… ప్రధాని కూడా అలాగే పద్దతిగా ప్రతినమస్కారం చేశాడు… బస్, ఇందులో ఇక ఈకలు పీకడానికి ఏముంది అంటారా..? కాదు… ఉంటుంది… రాజకీయాల్లో ప్రతి శాలువాకు, ప్రతి నమస్కారానికీ, ప్రతి పర్యటనకూ, ప్రతి దండకూ, ప్రతి దండానికీ, ప్రతి లేఖకూ కారణం ఉంటుంది… పంచిపెట్టే తిరుపతి ప్రసాదాలతో సహా ప్రతి దానికీ ఓ లెక్క ఉంటుంది…
ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం చేసి, ఢిల్లీకి పోయి గాయిగత్తర లేపుతానన్న కేసీయార్… జాతీయ రాజకీయాల్లో దుమ్మురేపుతానన్న కేసీయార్… డిసెంబరులోనే హైదరాబాదులో జాతీయ నాయకులతో భేటీ పెడతానన్న కేసీయార్… బీజేపీతో ఇక తాడోపేడో అని గాండ్రించిన కేసీయార్… అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్లి అందరికీ దండాలు పెట్టేస్తున్న తీరు చర్చనీయాంశం కాకుండా ఎలా ఉంటుంది..? కేసుల భయంతోనే కేసీయార్ సంధి ప్రయత్నాలకు వెళ్లాడనీ, ఫెడరల్ ఫ్రంటులు, టెంటులు ఉత్తమాటేననీ అప్పుడే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో… మీడియా ఎలా స్పందిస్తోంది..?
Ads
నిజానికి జగన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షా లేదా మోడీని కలిస్తే… తను అక్కడే ఉన్నట్టు, విన్నట్టు, ఎడాపెడా ఏదేదో రాసే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ… మరి కేసీయార్ ఢిల్లీ వెళ్లి, ఆ నేతలతో భేటీలు వేస్తున్న తీరుపైనా అదే స్థాయిలో వెటకారాన్ని, విమర్శను దట్టిస్తాడా అనే డౌట్ చాలామంది పాఠకుల్లో ఉంది… మరీ జగన్‌ను వెక్కిరించి, తీసిపారేసినట్టు కాదు గానీ కేసీయార్ ఢిల్లీ పర్యటనపై రాధాకృష్ణ నిర్మొహమాటంగా ఫైరింగ్ ఓపెన్ చేశాడు… ధన్ ధన్… నెవ్వర్… ఇక ఏ పత్రికలోనూ, ఏ జర్నలిస్టూ ఈ కాల్పులు, ఈ పేలుళ్లకు సాహసించడు…
తన వీకెండ్ కామెంట్ లేదా కొత్త పలుకు సారాంశం ఏమిటంటే..? ‘‘కేసుల భయం పట్టుకుంది కేసీయార్‌కు… అందుకే కాళ్ల బేరానికి దిగాడు… తను ధీరుడేమీ కాదు, భీరువే… అనువు గాని వేళ్లలో పదడుగులు వెనక్కి వేస్తాడు… హరీష్‌రావును పొగడటం కూడా అదే… అసలు తనను జాతీయ నేతలు ఎవరూ నమ్మరు…’’ అని విశ్లేషిస్తూనే…. కొన్ని కొత్త అంశాలు కూడా షేర్ చేసుకున్నాడు… అవేమిటంటే..?
- కేసీయార్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది… తను కార్మిక మంత్రిగా ఉన్నప్పటి ఏదో ఇష్యూ అది… ఇన్నేళ్లూ మోడీతో బాగున్నాడు కాబట్టి ఆ కేసులో కదలిక లేదు…
- గ్రేటర్ ఎన్నికల్లో ప్రతి కార్పొరేటర్ అభ్యర్థికీ కోటి రూపాయల చొప్పున ఓ కంట్రాక్టర్ డబ్బులు సమకూర్చాడు… ఆ వివరాలన్నీ మోడీ టేబుల్ మీదకు చేరాయి.,. అన్నీ తవ్వి ఫైల్ ప్రిపేర్ చేశారు…
- బీహార్ ఎన్నికల కోసం ఆర్జేడీ బాస్ తేజస్వి యాదవ్‌కు కేసీయార్ ఇటీవల డబ్బుసాయం చేశాడు… (గత లోకసభ ఎన్నికల సమయంలో కూడా కొన్ని పార్టీలకు కేసీయార్ ఆర్థికసాయం చేశాడనేది బీజేపీ డౌటనుమానం)
- శరద్ పవార్ కంపెనీ తెలంగాణలో కొన్ని పనులు చేసింది… ఆ బిల్లుల కోసం స్వయంగా వచ్చి ఆయన భంగపడ్డాడు… ఆయన బిడ్డ సుప్రియా సూలే స్వయంగా ఈ విషయాన్ని బోలెడుమందికి చెప్పింది…
- జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పిన అనుభవం ఉన్న చంద్రబాబే అన్నీ మానేసుకున్నాడు… సొంత రాష్ట్రంలోనే ఎదురుగాలి వీస్తున్న కేసీయార్ జాతీయ రాజకీయాల్లో చేసేది ఏముంటుంది..? కేసుల్లో ఉన్న జగన్‌కు ఆ సీన్ లేదు… సో, ఢిల్లీలో తెలుగు నేతలకు వాయిస్ లేదు…
……. ఇలా సాగిపోయింది ఆర్కే వ్యాసం… వేరే పత్రికల్లో ఈ పరుష విశ్లేషణ మనకు కనిపించదు… నిజమో, అబద్ధమో రాధాకృష్ణ సూటిగా రాసేస్తాడు… ఈరోజు తన వ్యాసంలో మరీ ఎక్కువ పదును ఉంది… నో, నో, కాళ్ల బేరం లేదు, శాంతి మంత్రం లేదు, సంధి ప్రయత్నం లేదు… బీజేపీతో డిష్యూం డిష్యూమే… దాని అంతుచూడటమే… కేసీయార్ స్థిరంగా అదే ఆలోచనతో ఉన్నాడు… రాజీలేదు, భయపడే ప్రసక్తే లేదు అని టీఆర్ఎస్ వర్గాలు ఈ వ్యాసాన్ని ఖండఖండాలుగా ఖండిస్తాయా..? నమస్తే తెలంగాణ ఓ పేజీ కౌంటర్ వ్యాసాన్ని రాధాకృష్ణను తిడుతూ గబగబా వండేస్తుందా..? లేక క్యాంపు మొత్తం నిశ్శబ్దాన్ని ఆశ్రయిస్తుందా..? చూడాలి…!
అవును, ఆర్కే గారూ…. ఆర్జేడీకి డబ్బులిచ్చిన విషయం బీజేపీకి ఎలాగోలా తెలుస్తుందనే సంగతి కేసీయార్‌కు కూడా తెలుసు… గతంలో కొన్ని పార్టీలకు కూడా ఇచ్చాడని బీజేపీకి తెలుసు… (దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలుగు డబ్బులే కదా ఇప్పుడు…) కోపంతో బీజేపీ తనపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుందని కేసీయార్ ఊహించలేడా..? అంటే అన్నీ తెలిసే, సిద్ధపడే డబ్బుసాయానికి పూనుకున్నట్టే కదా… మరిక బీజేపీతో సంధి ప్రయత్నాలు, బేరాలు ఏముంటయ్ అకస్మాత్తుగా..? పోనీ, ఆర్జేడీకి డబ్బులిస్తే ఇప్పటికిప్పుడు తనకు వచ్చే ఫాయిదా ఏమిటి..? ఏదో లాజిక్ మిస్సయినట్టుగా ఉంది కదూ… అలాగే జాతీయ రాజకీయాల్ని పక్కన పెట్టినా సరే… కేసీయార్ వెళ్లి కలవగానే రాష్ట్రంలో బీజేపీ చల్లబడిపోదు కదా… వచ్చేసారి అధికారం తమదే అనుకునే బీజేపీ తన దూకుడు తగ్గించదు కదా… ఏదో చిదంబర రహస్యం ఉంది కదూ…!!
ఒకే వ్యాసం… అందులో కొంత జగన్ మీద సహజంగానే ఏడుపు… మరికొంత సందర్భానుసారం కేసీయార్‌పై… బొమ్మ ఒకటే… కానీ తెలంగాణ ఎడిషన్‌కు ‘అందితే జుత్తు- లేదంటే పొత్తు’ అనే హెడింగ్తో కేసీయార్‌పై రాసింది లీడ్… ఆంధ్రా ఎడిషన్‌కు ‘భజనపరుల దేవుడు’ అని జగన్‌పై రాసింది లీడ్… ఈ దిక్కుమాలినతనం దేనికి..? ఒక పత్రిక ఓనర్ వంటను కూడా ప్రాంతాలకు అనుగుణంగా వేర్వేరుగా వడ్డించడం అవసరమా అధ్యక్షా..? పోనీ, జగన్, కేసీయార్‌ల నడుమ గీత గీసి, వేర్వురుగా ప్రజెంట్ చేస్తే సరిపోయేదిగా… ఒకేరోజు రెండు కొత్త పలుకులు ఉండకూడదని కొత్తరకం గాగ్ ఆర్డర్స్ ఏమీ లేవుగా…!!
Share this Article