.
… ‘ఆప్’ ఓటమి చాలామంది ఊహించిందే! ముందే అటువంటి సంకేతాలు అందాయి. అయితే కారణాలు మాత్రం చాలా విస్తారమైనవి. చదువుకున్న వ్యక్తి, మాజీ ఐఆర్ఎస్ అధికారి అయిన అరవింద్ కేజ్రీవాల్ కూడా తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోవడం మాత్రం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.
విచిత్రమేమిటంటే, ఢిల్లీలో కమలదళం గెలవడానికి పరోక్షంగా తోడ్పడ్డది ఆప్ & కాంగ్రెస్ పార్టీలే. అదెలాగో ఈ కింది కారణాలు చూడండి…
* 2015 నుంచి అరవింద్ కేజ్రీవాల్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇన్నేళ్ల అధికారం తర్వాత ఒక నేతపై విసుగెత్తడం, కొత్తవారిని గెలిపించాలన్న ఆలోచన రావడం సహజం. ఇదే ప్రధాన కారణం కాకపోయినా, ఇదొక కారణం కావొచ్చు.
Ads
* ఇండియా కూటమిలో కాంగ్రెస్- ఆప్ సంబంధాల మీద నేటికీ స్పష్టత లేదు. అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లినప్పుడు నిరసన దీక్ష చేపట్టిన రాహుల్, ఆ తర్వాత, ఆప్ మీద విరుచుకుపడ్డారు. లిక్కర్ స్కామ్‌ని బయటపెట్టాలన్నారు. సిసోడియాను తీవ్రంగా విమర్శించారు.
ఈ ఎన్నికల్లో ఆప్‌కి రావాల్సిన ఓట్లలో చాలా భాగం కాంగ్రెస్‌కి చేరాయి. కాంగ్రెస్ పోటీలో లేకపోతే ఆప్ తప్పకుండా 36 స్థానాలు (తక్కువ ఆధిక్యంతోనైనా) పొందేదని అంచనా. కాబట్టి ఆప్ పరాజయం వెనకాల కాంగ్రెస్ తప్పిదం ఉంది…
* ఆప్ నేతల్లో అరవింద్ కేజ్రీవాల్ మినహా మరే ఇతర నేత కూడా అంత గొప్ప పేరు తెచ్చుకోలేదు. నేతల మీద విశ్వసనీయత పెంచుకోవడంలో ఆప్ విఫలమైంది. జనాలు విశ్వసించే ఒకే ఒక్క నేత కేజ్రీవాల్ కాగా, ఆయన కూడా జైలుకు వెళ్లడం వారిలో పార్టీ మీద వ్యతిరేకతను పెంచింది.
* ఆప్ ప్రభుత్వం పథకాల మీద పెట్టిన శ్రద్ధ, మౌలిక వసతుల మీద పెట్టలేదనే విమర్శ ఉంది. పథకాలను అమలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకున్న ఆప్ నేతలు, ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారు.
(ఈ విషయం ఢిల్లీలో ఉండే చాలామందికి తెలుసు). ముఖ్యంగా వర్షాల సమయంలో ఆప్ నేతల నిర్లక్ష్య వైఖరితో చాలామంది విసుగెత్తిపోయారు. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఆ పార్టీకి వ్యతిరేకంగా మారారు.
* కమలదళాన్ని గెలిపిస్తే హరియాణాలో యమునా నదిని విషంతో నింపినట్టు, ఢిల్లీకి సరఫరా అయ్యే నీటిలో కూడా విషం నింపేస్తుందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇక్కడే ఆయన పెద్ద తప్పు చేశారు. ఆ కామెంట్లతో హరియాణాలోని ప్రజలంతా భగ్గుమన్నారు.
ఢిల్లీలోని అనేకమంది హరియాణావాసులు ఆప్‌కు వ్యతిరేకంగా మారారు. పైగా ఆ కామెంట్ల కారణంగా ప్రజల్లో భయాన్ని పెంచారంటూ బీజేపీ ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. రాహుల్ గాంధీ సైతం కేజ్రీవాల్ మాటల్ని ఖండించారు.
* 2023లో ప్రతి మహిళకు రూ.వెయ్యి ఇస్తామని ఆప్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే మర్చిపోయింది. అటు పంజాబ్‌లో సైతం అటువంటి హామీ ఇచ్చినా అమలు చేయలేదు. దీంతో నోటి మాటలే తప్ప, డబ్బులివ్వరనే చెడ్డపేరు మూటగట్టుకుంది. దీంతో ఓటర్లు ఆ పార్టీపై వ్యతిరేకత పెంచుకున్నారు.
* కమలదళం మాత్రం తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ పథకాలు అమలు చేస్తున్నామో, ఇక్కడా అదే పథకాలు అందిస్తామని ప్రచారం చేసింది. కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన పథకాలను సైతం కొనసాగిస్తామని తెలిపింది. దీంతో సహజంగానే ఢిల్లీ ప్రజలకు వారి పట్ల నమ్మకం కలిగింది. పైగా కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండాలన్న ‘డబుల్ ఇంజిన్’ ప్రచారం సైతం అక్కడ పనిచేసింది. పైగా కీలక నేతల్ని ప్రచారానికి వాడింది.
* లిక్కర్ స్కామ్ అనేది కేంద్రం కుట్ర అని ఎంత ప్రచారం చేసినా, ఢిల్లీ ప్రజలు దాన్ని నమ్మలేదని ఓట్లను చూస్తేనే తెలిసిపోతోంది. తాను జైల్లో ఉండటం (చంద్రబాబు తరహాలో) సింపతీకి కారణమవుతుందని కేజ్రీవాల్ భావించినా, తమ సీఎం జైల్లో ఉండటాన్ని ఢిల్లీ ప్రజలు అవమానంగానే భావించినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన్ని సైతం ఎన్నికల్లో ఓడించారు.
PS: దేశమంతా ముస్లింలను, వారి మతాచారాలను వ్యతిరేకించే విశ్వహిందూ పరిషత్ ఈ ఎన్నికల కోసం ముస్లిం సంస్థలతో, వారి నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఓట్లు అభ్యర్థించడం విశేషం. ఎనీవే! ఢిల్లీ ఓటర్లు మతానికో, ప్రలోభాలకో లొంగలేదనేది స్పష్టం. అధికార ఆప్, కాంగ్రెస్ చేసిన తప్పిదాలే వారిని కమలదళం వైపు మళ్లేలా చేశాయి. ఇదంతా స్వయంకృతాపరాధం. … – విశీ (వి.సాయివంశీ)
Share this Article