.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే |
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిశ్యతే ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
Ads
దేవుడూ అతని సృష్టీ పరిపూర్ణాలు, పరస్పర పూరకాలు. కావున పూర్ణంతో ఇంకో పూర్ణాన్ని కలిపినా, వేరుచేసినా, గుణించినా, పూర్ణమే మిగులుతుంది. అలా ఈ ప్రపంచమంతా భగవంతుడి స్వరూపమే అని ఈశావాన్యోపనిషత్తు లోని ఆ శ్లోకం అర్ధం.
“దైవం మానుష రూపేణ” అని చెప్పడానికి తీయాలనుకున్న కథ ఖలేజా. ఉద్దేశ్యం ఉదాత్తమైనదే..!
పాతిక మంది కేంద్ర మంత్రులూ, వందకు పైగా ఎంపీలూ, ఓ బిజినెస్ మాగ్నెట్టూ కలిసి “పాలి” అనే గ్రామంలో ఉన్న ఇరీడియం నిక్షేపాలను కొల్లగొట్టడం కోసం ఆ ఊరి జనాభాను ఖాళీ చేయించాలనుకుని ఆ ప్రాంతాన్నంతా విషపూరితం చేస్తారు. ఆ ఊరి ప్రజలు దిక్కు తోచక దేవుణ్ని వెదుకుతుంటే హీరో దొరికి, వాళ్ల పాలిటి దేవుడై ఆ ఊరినీ, జనాన్నీ రక్షిస్తాడు. ఇదీ కథ..!
కథ ఎత్తుగడ పాలి గ్రామంలో సుగ్రీవుడు హనుమంతుడిని రాముణ్ణి వెదకడం కోసం పంపుతున్నట్టుగా గొప్పగా మొదలై, పదినిమిషాల్లో నీరసపడిపోతుంది. డిజైనర్ బట్టలు మాత్రమే వేసుకునే హీరో ఓ క్యాబ్ డ్రైవర్. కథ శ్రీకాకుళం జిల్లా “పాలి”లో మొదలై, ఒరిస్సానో, బెంగాలో వెళ్లకుండా రాజస్థాన్ లో తేలుతుంది.
నీళ్ల సీసా కోసం పేద్ధ యుద్ధమైన మరుక్షణం కామెడీ మొదలౌతుంది. విద్యావంతురాలు, ఐశ్వర్యవంతురాలైన కథానాయిక కాలిగోటికి పనికిరానివాళ్లు ఆమెని దరిద్రం, శనీ అంటుంటారు. హీరోని సాక్ష్యం లేకుండా చంపడానికి విలన్లు ఎత్తుగడ వేసి రాజస్థాన్ పంపారని ఇంటర్వెల్ ముందు తెలుస్తుంది.
తర్వాత హీరో దేవుడని నమ్మించే ప్రయత్నం; హీరో తాను దేవుణ్నే అని నిర్ధారణకు రావడం అయ్యేసరికి రెండు గంటల స్క్రీన్ టైం పడుతుంది. మిగిలిన నిమిషాల్లో హీరో దుష్ట సంహారం చేసి పాలి గ్రామాన్ని విలన్ల పాలి నుండి రక్షిస్తాడు.
సినిమా కథ నిడివి సాధారణంగా రెండున్నర గంటలు. మొదటి పదినిమిషాల్లో కథావస్తువు తెలియకపోతే చూసేవాడికి బుర్రకెక్కదు. దృశ్యప్రధాన మాధ్యమమైన సినిమాని కేవలం మాటలతో గట్టెక్కించాలనుకుంటే కుదరదు. అంతర్జాలపు హాస్యాన్ని యథాతథంగా కుమ్మరిస్తామంటే చూడడానికి ప్రజలు వెర్రి వెంగళప్పలు కాదు. హాస్యనటులను బఫూన్లుగా చూయిస్తే రాణించదు.
బిలియనీరు, శుద్ధవ్యాపారి ఐన ప్రతినాయకుడు, హింస లేకుండా ఊరిని ఆక్రమిద్దామనుకున్న వాడు, చివర్లో గన్నులూ, గూండాలనేసుకుని మీదడిపోవడం అసలైన కామెడీ.
****
సినిమా మొదలైన అరగంటలో హీరో దేవుడిలా ఊరిని రక్షించడానికి రంగప్రవేశం చేసి, రాముడిలా కష్టాలకోర్చి, ఒక్కొక్క ఆటంకాన్ని దాటుతూ (శివలో లాగా) చివరికి కార్యసాధన చేస్తే ఫలితం ఇంకోలా ఉండేదేమో..!
చిరుగుల పంచెకి ఎంత డాబు ఉన్న అంచు ఉంటే మాత్రం ఏం లాభం..?
శ్రేష్టమైన ములక్కాడలూ, కూర ముక్కలూ, చింతపండూ, పప్పూ, ఇంగువా, దినుసులూ తీసుకుని కలిపినా రుచిలేని పప్పుచారిది…! అందుకే సినిమా యూట్యూబ్, టీవీల్లో బిట్లుబిట్లుగా హిట్టై థియేటర్లలో ఫట్టుమంది….. [[ గొట్టిముక్కల కమలాకర్ ]]
Share this Article