ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ సమాజంలో చర్చ జరగాలి… అది అవసరం… ఆ చర్చాంశాల్లో ముఖ్యమైనవి… 1) కేటీయార్‌కు సీఎం కుర్చీ ఇవ్వడం… ఆ అవసరం ఎందుకొచ్చింది..? 2) కేటీయార్‌కే ఎందుకు ఇవ్వాలి..? వారసత్వమే దిక్కా..? 3) కేటీయార్ అర్హత, సామర్థ్యం…. ఈ చర్చ ఎందుకు అవసరం అంటే..? కేసీయార్ రాజకీయ సన్యాసం స్వీకరించి వానప్రస్థానికి వెళ్లనున్నాడు కాబట్టి… కొడుక్కి అధికార పీఠం అప్పగించే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి… అది క్రమేపీ తెలంగాణ రాజకీయ చిత్రపటంలో మార్పులకు కారణం కాబోతున్నది కాబట్టి… ఏమాత్రం అవకాశం దొరికినా సందు చూసుకుని, గెలికి, మీదపడేందుకు జగన్లూ, చంద్రబాబులూ, పవన్ కల్యాణ్లూ వెనుకాడరు కాబట్టి… ఇంకాస్త లోతుల్లోకి వెళ్దాం…
ముందుగా…. అసలు కేటీయార్‌కు పట్టాభిషేకం నిజమేనా..? కేసీయార్ ఆలోచనల్ని, అడుగుల్ని సరిగ్గా అంచనా వేసేవాడు దొరకడు… తను బయటికి జాగ్రత్తగా వదిలేది వేరు, ఫీడ్ బ్యాక్‌ను బట్టి అంతిమంగా చేసేది వేరు… పైగా ఒక మాట తన నోట పదే పదే వస్తున్నదీ అంటే దానికి భిన్నంగా వెళ్తాడు చాలాసార్లు… అఫ్ కోర్స్, కేటీయార్‌కు సీఎం పీఠం అని బహిరంగంగా చెప్పకపోయినా తన ఆంతరంగికులతో షేర్ చేసుకుంటూనే ఉన్నాడు… ఇప్పుడది తెలంగాణ సమాజంలో బహిరంగ రహస్యం… అయితే జరుగుతుందా..? ఎవరూ చెప్పలేరు… చెప్పడం కుదరదు… అంతెందుకు, ఆ కేసీయారే చెప్పలేడు… ఎందుకంటే… తన అనారోగ్యం, వయస్సు రీత్యా ఇక రాజకీయాల నుంచి విరమించుకుంటాను అనేది తను చెప్పే కారణం… మూడునాలుగేళ్లుగా కేసీయార్ అనారోగ్యం గురించి ప్రచారాలు జరుగుతూనే ఉంటయ్, తను నవ్వుతూ అవన్నీ వింటాడు, చదువుతాడు… అంతే… మరి ఇప్పుడు..?
Ads
నో, నో, నిజంగానే తనకు వయోభారం, అనారోగ్యం సహకరించడం లేదు అనేవాళ్లూ ఉన్నారు… నిజమే కావచ్చుగాక… ఇప్పుడు ఎలాగూ చాలా అంశాల్లో కేటీయారే అనధికార సీఎంగా ఉన్నాడు, ఉంటాడు, ఇలాగే నడిపిస్తే అయిపోతుంది కదా అనేవాళ్లూ ఉన్నారు… లేదు, లేదు, ఈ నెలాఖరుకే కేటీయార్ కుర్చీ అధిరోహణం అని కొందరు… నో, నో, ఫిబ్రవరి 18 అని కొందరు ముహూర్తమే పెట్టేశారు… కేటీయార్ జాతకరీత్యా అదే సరైన తేదీ అని అర్జెంటుగా కొందరు పంచాంగాల్ని గబగబా తిరగేసి మరీ, బల్లలు గుద్దేస్తున్నారు… అబ్బే, ఏప్రిల్‌లోపు యాదాద్రి పూర్తిచేసి, భారీ ఎత్తున యాగం నిర్వహించి, ఆ సందర్భంలోనే కేటీయార్‌కు రాజదండం ఇస్తాడని ఇంకొందరు… రాసుకునేవాళ్ల ఊహాచాతుర్యం బట్టి రకరకాలు… బట్, అంతకుముందు కేసీయార్ ఏం చెప్పినా, ఏం చేసినా… మొన్న ఢిల్లీకి వెళ్లొచ్చిన తరువాత మాత్రం వారసుడికి పగ్గాలు అనే విషయంలో స్థిరనిర్ణయానికి వచ్చాడని అంటున్నారు…
మరి కేటీయారే తదుపరి సీఎం ఎందుకు కావాలి..? తన అర్హతలేమిటి..? అనేవి కూడా కీలకప్రశ్నలే… 1) ఇదేమైనా రాజరికమా..? వారసుడికి పగ్గాలు అప్పగించేందుకు అనేవాళ్లు ఉంటారు, ఉన్నారు, ఉండాలి… ఎవరేమన్నా సరే, కేసీయార్ ఆలోచనలు, అడుగుల తీరును బట్టి ఆయన ఇన్నాళ్లూ ఓ కుటుంబపార్టీగా నడిపించిన తన రాజకీయ వ్యవస్థను తన వారసుడికే అప్పగిస్తాడు… ఇక్కడ హరీషులు, కవితలు, సంతోషులకు చాన్స్ లేదు… అలాగే ఆ కుటుంబేతరులకూ చాన్స్ లేదు… ఈటల వంటి నేతలు మేమూ గులాబీ జెండా ఓనర్లమే అని చెప్పినా సరే, అసలు ఓనర్ కేసీయారే… దాన్ని తన కుటుంబం నుంచి బయటికి వెళ్లనిచ్చే అవకాశమే లేదు… మరి కేటీయార్ అర్హతలు..? (రెండో భాగంలోకి వెళ్దాం పదండి…)
Share this Article