.
[[ .. రమణ కొంటికర్ల .. ]] మాధవన్ అంటే తెలియందెవరికి…? సఖి, చెలి అంటూ కుర్రకారును వెర్రెక్కించిన లవర్ బాయ్ గా.. త్రీఇడియట్స్ లో ఓ ఇడియట్ గా ఇలా దక్షిణ, ఉత్తరాదిలో పలు సినిమాలతో పరిచయమైన సుపరిచితుడు.
మణిరత్నం స్కూల్ నుంచి వచ్చి సినిమానే ప్రేమిస్తున్న మాధవన్ జీవితాన్ని ఓ రైతు అమాంతం మార్చేశాడు. ఆ కథ మాధవన్ ఓ నేషనల్ ఛానల్ కు చెప్పాడు. ఏంటా ఇంట్రెస్టింగ్ కథ.. ఇంతకీ ఆ రైతు ఏం చేశాడు.. మాధవన్ లో ఉన్నపళంగా అంత మార్పెలా సాధ్యమైంది…?
Ads
జీవితంలో చోటుచేసుకునే అనుభవాలే మన దారిని నిర్దేశిస్తుంటాయి. ఒక దారిలో ఉన్నాడనుకున్న వ్యక్తిలో ఒక అవ్యక్త భావన ఊహించని కొత్త దారిలోకి మళ్లించవచ్చు. అదే మాధవన్ ను దారి మళ్లించింది. అందుకే, మాధవన్ గత నాలుగేళ్ల నుంచీ సినిమాలకే దూరమయ్యాడు.
ఓనాడు స్విట్జర్లాండ్ లో మాధవన్ తమిళ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. నారింజ రంగు ప్యాంట్, ఆకుపచ్చ చొక్కా ధరించి… రోడ్డు మధ్యలో పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ సందర్భం కూడా పాట చిత్రీకరణ కోసమే వేసిన సెట్టే.
ఆ సమయంలో మాధవన్ పక్కనుంచే ఓ స్విస్ రైతు అటుగా వెళ్లుతూ.. ఏదో తనకు నచ్చనట్టుగా తల ఊపుతూ వెళ్లిపోతున్నాడు. అది కాస్తా మాధవన్ ను డిస్టర్బ్ చేసింది. ఏయ్ ఆగు.. నేనెవరో నీకు తెలుసా.. ఓసారి చెన్నై రా.. నేనంటే ఏంటో తెలుస్తుందంటూ ఆ రైతుతో కాస్తా దబాయిస్తున్నట్టుగా మాట్లాడాడు.
అతనికేమర్థమైందో, ఆ తర్వాతేమైందో తెలియదుగానీ.. ఆ రైతు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ, ఆ ఘటన మాధవన్ లో ఏదో విచారాన్ని రేకెత్తించింది. ఆ విచారం కాస్తా.. తానెవరో తయారు చేసిన బాణీలకు నృత్యం చేస్తున్నాననే భావనను కల్పించింది. అంటే, ఎవరో ఆడించినట్టు ఆడే బతుకా నాది అనే ఒక ఆలోచనతో కూడిన బలమైన అభిప్రాయం మనసులో నాటుకుపోయింది.
కొంతకాలం సినిమాల నుండి తప్పుకోవాలనే నిర్ణయం!
ఆ రైతు ఎందుకలా తల ఊపుతూ వెళ్లిపోయాడు.. ఏమనుకుని ఉంటాడన్న మథనం నుంచి మొదలైన ఆలోచనలు మాధవన్ లో సుడులు సుడులుగా తిరగడం మొదలయ్యాయి. తన జీవితం అర్థవంతంగా సాగడం కంటే కూడా.. ఇతరులు ఆశించేదాని ఆధారంగా మాత్రమే నడుస్తుందా.. అదే తన కెరీర్ గా మారిపోయిందా అనే భావనలు చుట్టుముట్టాయి. దాంతో ఆ భావనతో ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. సినిమాలే కాకుండా, వాణిజ్య ప్రకటనల నుంచీ కొంతకాలం దూరముండాలని ప్రతినబూనాడు.
అదే సమయంలో తన మనసులో మాటల్ని భార్యతోనూ షేర్ చేసుకున్నాడట మాధవన్. ఓ ఫైన్ మార్నింగ్.. నువ్వు ఏదైతే చేస్తున్నావో.. దాన్నుంచి అంతకన్నా ఎక్కువే తిరిగి రావాలని కోరుకుంటున్నావ్.. అందుకు తగ్గట్టుగానే పని చేస్తున్నావందట మాధవన్ భార్య. భార్య మాటల తర్వాత ఇక విరామం తీసుకోవాల్సిందేనని గట్టి పట్టుబట్టిన మాధవన్.. ప్రపంచాన్ని కాస్త చదవాలని నిర్ణయించుకున్నాడు.
ప్రజలు ఏం కోరుకుంటున్నారు.. వేటిని అభినందిస్తున్నారు.. అసలీ దేశం, ప్రపంచం అనుసరిస్తున్న మార్గాలేంటి.. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలనుకుని దేశదిమ్మరి అవతారమెత్తాడు మాధవన్. మొత్తంగా ఒక వైరాగ్య భావన కూడా మెదడులోకెక్కిన మాధవన్ ఫిజికల్ గా కూడా నెరిసిన తెల్లటి గడ్డంతో.. ఒక సూపర్ స్టార్ కు పూర్తి భిన్నంగా మారిపోయాడు.
అలాగే, భారతదేశంలోని వివిధ ప్రాంతాలనూ పర్యటించాడు. ఒక రిక్షాపుల్లర్ ఏం చర్చిస్తున్నాడు.. ఒక కుండలమ్ముకునే వ్యక్తి ఆలోచనలెలా సాగుతున్నాయి.. ఇలా భిన్నరకాల వారిని కలిసి మాట్లాడుతూ ఓ బహుదూరపు బాటసారి అవతారమెత్తాడు హీరో మాధవన్.
ఆత్మపరిశీలనకు దోహదపడిన ప్రయాణం!
మాధవన్ నిర్ణయం మామూలుదేం కాదు. చేతిలో సినిమాలు, హీరోగా, వెర్సటైల్ నటుడిగా తనకున్న ఇమేజ్ ఇవన్నీ కాదనుకుని పరిశ్రమ నుంచి విరామం తీసుకోవడమంటే అంత సంకల్పబలముండాల్సిందే. అలా వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూ, నిశితంగా పరిశీలిస్తూ, వారేం కోరుకుంటున్నారో తెలుసుకుంటూ.. ఆ అనుభవాలను నటనలో తన విధానాన్ని తిరిగి రూపొందించుకోవడంలోనూ, ఎలాంటి పాత్రలు పోషించాలో తెలుసుకోవడంలోనూ మరింత స్పహకు కారణమైందంటాడు.
తన ప్రయాణం మాధవన్ కు కొత్త నట జీవితాన్నిస్తుందన్న నమ్మకంతో ఉన్నానంటున్నాడు. తిరిగి ప్రేక్షకులతో కనెక్టయ్యేందుకు మరింత సాయపడుతుందన్న మెండైన విశ్వాసంతో ఉన్న మాధవన్.. సిద్ధార్థ్, నయనతార ప్రధాన పాత్రధారులుగా నటించిన టెస్ట్ అనే చిత్రంలో నటించాడు. ఇది నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. అలాగే, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన కేసరి: చాప్టర్ 2లోనూ కనిపించనున్నాడు. అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి దేదే ప్యార్ దే సినిమా కోసం కూడా సంతకం చేశాడు.
ఎందరో దర్శకులతో పనిచేసినవాడు. మణిరత్నం, రాజూ హిరానీ వంటివారితో పనిచేసిన అనుభవజ్ఞుడైన నటుడు. తానే స్వయంగా నంబి నారాయణన్ సినిమా కథను రాసుకుని రాకెట్రీ పేరుతో దర్శకత్వం వహించి వార్తల్లోకెక్కినవాడు, చాలాకాలం కుర్రకారుకు యూత్ అంటే ఇలా ఉంటుందనే విభ్రమకు గురిచేసినవాడు…
కానీ, ఓ రైతు అదోరకంగా చూసిన చూపులతో పూర్తిగా తీవ్రమైన ఆలోచనలో పడిపోయాడు. ఏకంగా దాదాపుగా నాల్గేళ్లుగా సినిమాలు, వాణిజ్య ప్రకటనలన్నీ వదిలేసి దేశదిమ్మరి అవతారమెత్తాడు. మరి ఇప్పుడు ఆత్మపరిశీలన తర్వాత మాధవన్ నటించే పాత్రలు, ఆయన నటనలో మార్పులెలా ఉంటాయన్నది ఆసక్తికరం…
Share this Article