ట్విట్టర్ తలవంచింది… కాదు, కేంద్ర ప్రభుత్వమే దాని తలవంచింది… స్థూలంగా చూస్తే కనిపించేది ఇదే… అంతటి పెద్ద సోషల్ మీడియా సంస్థ, ఇక దశలో ‘మా కంపెనీ రూల్సే తప్ప మీ రూల్స్ మేం వినబోం’ అని అమెరికన్ కార్పొరేట్ మార్క్ బలుపు ప్రదర్శించిన సంస్థ… ఇప్పుడు హఠాత్తుగా తమ ఇండియా విభాగపు హెడ్ మనీష్ మహేశ్వరి పోస్టు ఊడబీకింది… ఇక చాల్లే ఉద్దరించింది అంటూ అమెరికాలో ఏదో ఓ రెవిన్యూ స్ట్రాటజీ అనే నాన్-ఫోకల్ పోస్టులోకి బదిలీ చేసింది… అంతేకాదు, కేంద్రంలోని బీజేపీ కోరుకున్నట్టే రాహల్ గాంధీ ట్విట్టర్ ఖాతాతోపాటు కాంగ్రెస్ ఖాతా, మరికొందరు ముఖ్యుల ఖాతాలనూ బ్యాన్ చేసింది… ఎందుకిలా ట్విట్టర్ అకస్మాత్తుగా తన ధోరణిలో మార్పు చూపిస్తోంది..? ఇన్నాళ్లు కేంద్రంతో ఘర్షణకు ఇండియా హెడ్ మనీషే కారణమా..? కాదు, తనను ట్విట్టర్ యాజమాన్యం బకరాను చేసింది, అంతే, అసలు తప్పంతా ట్విట్టర్‌దే… ఓసారి వివరాల్లోకి వెళ్దాం…
బీజేపీలో కొందరు ఆరోపిస్తున్నట్టుగా మనీష్ మహేశ్వరి ‘యాంటీ బీజేపీ’ కాదు… తను ప్రొఫెషనల్… ఇంతకుముందు అంబానీకి చెందిన న్యూస్18 సహా ఫ్లిప్‌కార్ట్, మెకిన్సే, పీఅండ్‌జీ వంటి పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో మంచి పోస్టుల్లో పనిచేశాడు… హైలీ పెయిడ్… తనకు కంపెనీ లైన్‌ను బట్టి వ్యవహరించడమే తెలుసు తప్ప వ్యక్తిగత రాగద్వేషాల్ని కంపెనీ మీద రుద్దడు… మరి అలాంటి వ్యక్తి బీజేపికి ఎందుకు శత్రువు అయ్యాడు..? ఉత్తరప్రదేశ్‌లో కేసు ఎందుకు నమోదైంది..? కారణం ట్విట్టరే..! దానికి అమెరికా తప్ప మిగతా అన్ని దేశాలూ చీప్‌గానే కనిపిస్తాయి… తమవంటి జెయింట్ కంపెనీల జోలికి, అదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారం జోలికి ఏ ప్రభుత్వమూ రాదని ఓ భ్రమ… ఆమధ్య నైజీరియా వంటి చిన్న కంట్రీ కూడా ట్విట్టర్‌ను బ్యాన్ చేసేసింది… అంటే ఒక పరిమితి దాటితే… ఏ చిన్న దేశమైనా, ఏ ప్రభుత్వమైనా ఎందుకు ఊరుకుంటుంది..? మరి ఇండియా వంటి దేశం ఎందుకు ఉపేక్షిస్తుంది..?
Ads
కేంద్రం సోషల్ మీడియా మీద గ్రిప్ కోసం కొత్తగా ఐటీ చట్టం ఒకటి తీసుకొచ్చింది… దాని ప్రకారం ట్విట్టరే కాదు, ఎవరైనా సరే, ప్రభుత్వం చెప్పిన చర్యలు కొన్ని చేపట్టాలి… Chief Compliance Officer (CCO), Resident Grievance Officer (RGO), Nodal Contact Person నియామకం వంటివి… కానీ ట్విట్టర్ మొరాయించింది… ‘మా రూల్సే తప్ప మీ రూల్స్ మాకెందుకు’ అన్నట్టుగా వ్యవహరించింది… ఝలక్ ఇవ్వడానికి బీజేపీ ముఖ్యుల ఖాతాల్ని బ్యాన్ చేయడం, వాళ్ల అఫీషియల్ ఖాతా అనే ట్యాగ్ తీసేయడం వంటి చర్యలు తీసుకుంటూ పోయింది… కేంద్రం నట్లు బిగించడం స్టార్ట్ చేసింది… ఒక దేశం చట్టాన్ని గౌరవించకపోవడం అంటే ఆ దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేయడమే… మరి 1.75 కోట్ల ట్విట్టర్ ఖాతాలున్న దేశం ఇండియా… బేసిక్‌గా ట్విట్టర్ చేసేది కూడా దందాయే కదా… మొదట కాలర్ ఎగరేసినా, తన వ్యాపారానికి నష్టం వాటిల్లబోతోంది, పాలకులు ఊరుకునేట్టు లేరు అని తెలిసొచ్చిన క్షణం అకస్మాత్తుగా కళ్లు తెరిచింది… మొత్తం వ్యవహారం కంపు కంపు కావడానికి ఎండీయే కారణమని ఓ ముద్రేసి, బదిలీ చేసింది… అంతేకాదు, ఇకపై ఇండియాకు ఎండీ ఉండడట… ఓ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇండియాలో వ్యవహారాలు చూసుకుంటుందట… కొన్ని అంతే… వెనుక వైపు వాతలు పడితే తప్ప తొవ్వకు రావు… ట్విట్టరే తాజా ఉదాహరణ…!! కుర్చీలో రాహుల్ గాంధీ ఉన్నా సరే, ఇలాగే వ్యవహరించేవాడు..!!
Share this Article