.
నిన్న బబ్బన్ సింగ్ రఘు వంశీ అనే 70 ఏళ్ల ఉత్తరప్రదేశ్ నాయకుడిని బీజేపీ తన పార్టీ నుంచి బహిష్కరించింది,.. కారణం, తను ఓ డాన్సర్‌తో ఓ వీడియోలో వల్గర్‌గా డాన్స్ చేస్తూ కనిపించాడు… అది వైరల్ అయ్యింది… గుడ్…
కానీ అదొక వ్యక్తిగత అవలక్షణం… ఏదో కక్కుర్తి యవ్వారం… కానీ విజయ్ షా సంగతి..? తను చేసిన నీచమైన వ్యాఖ్యలు ఈ దేశ మహిళల్ని, సైనికుల్ని కించపరిచేవి కాదా… ప్రధాని మోడీ స్పందిస్తాడని అనుకోలేం గానీ… మధ్యప్రదేశ్ బీజేపీ శాఖ తనను ఎందుకు టాలరేట్ చేస్తోంది…
Ads
మంత్రి కాబట్టా..? మంత్రి అయితే నోటికి అడ్డూఅదుపూ లేకుండా వ్యాఖ్యలు చేయడమేనా..? కల్నల్ సోఫియా ఖురేషిని దేశమంతా అభినందిస్తోంది… చప్పట్లు కొట్టి ఈ దేశపు నిజమైన బిడ్డ అని ప్రశంసిస్తోంది… ఏ ట్రూ పాట్రియాటిక్ సోల్జర్ అంటోంది…
మరి ఈ మంత్రి టెర్రరిస్టు సోదరి అనే దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సమర్థనీయమేనా..? పోనీ, బీజేపీ హైకమాండ్ ఎందుకు స్పందించడం లేదు..? నడ్డా అనే ఓ జాతీయ అధ్యక్షుడున్నాడు, యాక్టింగ్ ప్రెసిడెంట్ అమిత్ షా ఉన్నాడు, ఓ ప్రధానిగా మోడీ కూడా స్పందించవచ్చు… ఏదీ..? ఎందుకీ మౌనం..? ఈ నిశ్శబ్దం ద్వారా ఏం సంకేతాలు ఇస్తున్నట్టు.,.?
ఇది సరైన ధోరణి కాదు, సమర్థించలేం… మధ్యప్రదేశ్ హైకోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశిస్తే పోలీసులు ఓ నాసిరకం, పేలవమైన, తూతూమంత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు… దాన్నీ హైకోర్టు తప్పుపట్టింది… ఈ ప్రబుద్ధుడు సుప్రీంకోర్టుకు వెళ్లాడు…
సుప్రీం కోర్టు కూడా ముక్క చీవాట్లు పెట్టింది… పో, వెంటనే వెళ్లి ఆ ఖురేషికి క్షమాపణ చెప్పు ముందు అని చెప్పింది… న్యాయస్థానాలు, న్యాయమూర్తులు అంత సీరియస్‌గా పరిగణిస్తుంటే బీజేపీ మాత్రం ఎందుకు వెనకేసుకొస్తుంది..? బహిష్కరించకపోతే ఖచ్చితంగా వెనకేసుకొస్తున్నట్టే లెక్క… బాధ్యతాయుత పోస్టుల్లో ఉన్న వాళ్ల మాటల్లో ఎంత సంయమనం, ఎంత సంస్కారం ఉండాలి..? సుప్రీం కూడా అదే అంటోంది…
ఆపరేషన్ సిందూర్ తాత్కాలిక నిలిపివేత తరువాత ఎస్-400 వద్దకు వెళ్లి, సైనికులతో ఫోటోలు దిగి, వాళ్ల త్యాగాల్ని, సాహసాల్ని అభినందించిన మోడీ మరి ఈ ఖురేషీ మీద తిక్క వ్యాఖ్యల మీద ఎందుకు స్పందించకూడదు..?
దేశం కోసం ప్రాణాలొడ్డి పనిచేసే సాయుధ బలగాలు, ముఖ్యంగా మహిళా సైనికుల ఆత్మగౌరవం, స్థైర్యం విషయంలో కూడా ప్రధాని రాజీ పడాలా..? తను జాతికి ఏం సంకేతాలు ఇస్తున్నట్టు..? అసలు పాకిస్థాన్ మీద పోరాటంకన్నా ముందు ఈ అంతర్గత వైరసుల నియంత్రణకు కదా ప్రాధాన్యం ఇవ్వాల్సింది…
ప్రధానిగా మోడీకి అది బాధ్యత… దాన్ని విడిచి ఎన్ని చెప్పినా, దేశభక్తి, సైనికుల సాహసం వంటి ఎన్ని పడికట్టు పదాల్ని వల్లించినా ఖురేషీ ఆత్మగౌరవానికి విలువ ఇవ్వకపోతే అవి శుష్క ప్రసంగాలే అవుతాయి… నిష్ఠురంగా ఉన్నా సరే, నిజం మాత్రం ఇదే…
Share this Article