.
ముందుగా ఓ వార్త చదవండి… మురళీ మోహన్ చైర్మన్ గా గద్దర్ ఫిల్మ్ స్పెషల్ అవార్డ్స్ కమిటీ…
ఒకవైపు సహజ నటి జయసుధ అధ్యక్షతన ఏర్పడిన జ్యూరి కమిటీ సభ్యులు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఎంపిక కోసం వరసగా సినిమాలు చూస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీలును బట్టి రెండు లేదా మూడు సినిమాలు తిలకిస్తున్నారు.
తాజాగా గద్దర్ ఫిల్మ్ స్పెషల్ అవార్డుల ఎంపిక కోసం సీనియర్ నటుడు మురళీ మోహన్ అధ్యక్షులుగా మరో కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి టి. వినయ్ కృష్ణారెడ్డి ఉత్తర్వ్యులు జారీ చేశారు. ఈ కమిటీలో దర్శకులు కె.దశరథ్, కూచిపూడి వెంకట్, నిర్మాతలు డి.వి.కె.రాజు, కె.శ్రీధర్ రెడ్డి, ప్రముఖ కూచిపూడి నాట్య గురు డా.వనజా ఉదయ్, నటి ఊహ, సీనియర్ జర్నలిస్ట్ కె.ఉమా మహేశ్వరరావు ఉన్నారు.
Ads
గత పదేళ్లుగా నంది అవార్డ్స్ ఇవ్వలేదు కాబట్టి, గత పదేళ్లలో ఒక్కో సంవత్సరానికి ఒక ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ ను ఈ అవార్డ్స్ కమిటీ ఎంపిక చేస్తుంది. అలాగే ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య, పైడి జయరాజ్, ప్రభాకర్ రెడ్డి తదితరుల పేరిట ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎంపిక చేస్తారు.
ఉత్తమ సినిమా పుస్తకం ఎంపిక కోసం సీనియర్ జర్నలిస్ట్ భగీరథ, వడ్లమాని కనకదుర్గ, వి. మధుసూదన్ లను నియమించారు. గత ఏడాది ప్రచురించిన పుస్తకాల్లోంచి అత్యుత్తమ సినిమా పుస్తకాన్ని ఎంపిక చేస్తారు. ఈసారి గతంలో కన్నా భిన్నంగా అత్యంత భారీ నగదు పురస్కారాలు ఏర్పాటు చేయడంతో సినీ వర్గాల్లో గద్దర్ అవార్డ్స్ పై ఆసక్తి నెలకొంది.
సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని చూడకుండా గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ను పారదర్శకంగా నిర్వహించే ప్రయత్నం అభినందనీయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించాలి. జూన్ 14న హైటెక్స్ లో గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం కని విని ఎరుగని రీతిలో నిర్వహించనున్నారు..
.
అసలు ఎవరు వీళ్లంతా..? అసలు తెలంగాణ వాళ్లు దొరకడం లేదా..? లేక ఈ మురళీమోహన్‌లు, ఈ జయసుధలు ఎట్సెట్రా తప్ప ఇంకెవరూ పనికి రారా..? ఇందులో రేవంత్ రెడ్డిని అభినందించడానికి ఏముంది..? మురళీమోహన్‌కు పెత్తనాలు ఇస్తున్నందుకా..? తన గురువు చంద్రబాబు మెప్పు కోసమా..?
ఐనా సినిమా అవార్డులు ఇవ్వడానికి అర్హుల ఎంపికకు సినిమా వాళ్లే కావాలా..? అసలు న్యూట్రల్ ప్రేక్షకుడు, సమాజహితం కోరుకునేవాడు, కాస్త విజ్ఞత, కాస్త విచక్షణ జ్ఞానం ఉన్నవాళ్లు కదా కావల్సింది… మరెందుకు ఈ దిక్కుమాలిన సినిమా పెద్దరికాలు..? అసలు గద్దర్ పేరిట అవార్డులు అంటేనే కొంత వ్యతిరేకత ఉంది…
ఈ స్వార్థ, వాణిజ్య సినిమాల తీరును వ్యతిరేకించిన సినిమాయేతరుడు గద్దర్ పేరు ఎందుకనే అభిప్రాయం వినిపిస్తూనే ఉంది… సరే, పాలకుడి దయ, ప్రజల ప్రాప్తం అన్నట్టు… దిల్ రాజు కదా, ఇప్పుడు పెద్దమనిషి… తనేది చెబితే అదే… దీనికితోడు పెబ్బలు, న్యాయమూర్తులందరూ వాళ్లేనా..? రేవంత్ రెడ్డి మరీ రోజురోజుకూ తెలంగాణ జనానికి చిరాకు తెప్పిస్తున్నాడు కదా… ఫాఫం తెలంగాణ..!!
Share this Article