నిఝంగా టికెట్ల ధరల తగ్గింపు మీద నాగార్జునకు అసంతృప్తి లేదా..? ఉంది… ఉండక ఎలా ఉంటుంది..? ఇండస్ట్రీ పట్ల జగన్ ధోరణి మార్చుకోవాలని అడగడానికి, సంప్రదింపులు జరపడానికి వెళ్లిన బృందంలో తను కూడా ఉన్నాడు కదా… ఆ నలుగురు హీరోలేనా అని మోహన్‌బాబు శోకాలు పెట్టిన టీంలో నాగార్జున కూడా ఉన్నాడు కదా…! నిజానికి పాన్ ఇండియా సినిమాలైతే ఏపీలో కాకపోతే ఇంకెక్కడో క్లిక్కయితే డబ్బులొచ్చేస్తాయి… కానీ నాగార్జున బంగార్రాజు ప్యూర్ తెలుగువాళ్లకు మాత్రమే కనెక్టయ్యే సినిమా… అందులోనూ ఏపీ ప్రజలకు… మరి ఏపీలో టికెట్ల ధరలు తగ్గించడం మీద తనకేమీ అసంతృప్తి లేదంటాడేంటి..? నిన్న బంగార్రాజు ప్రిరిలీజ్ ఈవెంట్‌లో ‘సినిమా వేదిక మీద పాలిటిక్స్ మాట్లాడను’ అంటూనే ‘నా సినిమాకైతే ఇబ్బంది లేదు’ అన్నాడు ఎందుకు మరి..?
నిజానికి ప్రిరిలీజ్ ఈవెంట్‌లోనే ప్రెస్‌మీట్ కలిపేసి లాగించడం కాస్త కొత్తగా అనిపించింది… మొన్నామధ్య ఓ జర్నలిస్టుగా చెప్పుకునే వ్యక్తి ప్రెస్‌మీట్‌లోనే రాజమౌళిని రాముడు, దేవుడు అనే స్థాయిలో ప్రెయిజ్ చేయడం పట్ల సోషల్ మీడియాలో బూతులు కనిపించాయి కదా… కానీ ఈసారి అలా లేదు… అందరూ పద్దతిగా ప్రశ్నలడిగారు… టికెట్ల ధరల మీద ప్రశ్నను నాగార్జున కూడా ఎక్స్‌పెక్ట్ చేశాడు ముందే… తెలివైనోడు కదా… మరెందుకు అలా చెప్పాడు..? అదీ ప్రశ్న…
- తనకు జగన్ ధోరణి ఏమిటో తెలుసు, ఆల్‌రెడీ ఒకసారి తన వద్దకు వెళ్లొచ్చాడు కాబట్టి క్లారిటీ ఉంది…
- జగన్ యూటర్న్ తీసుకోవద్దని ఏమీలేదు, కొన్నాళ్లుగా బోలెడు నిర్ణయాల మీద వెనక్కి తగ్గాడు… కానీ తనకు నష్టదాయకం అనిపించినవీ లేదా తనతో సరిగ్గా డీల్ చేయగలిగినవీ అయి ఉండాలి…
- ఇండస్ట్రీ మొత్తాన్ని ప్రభావితం చేసే ప్రభుత్వ నిర్ణయం విషయంలో జగన్‌ను వెనక్కి తగ్గేలా మేనేజ్ చేయడం అంత వీజీ కాదు… పైగా ఎవరూ వ్యక్తిగతంగా డీల్ చేయగల ఇష్యూ కూడా కాదు…
- అందుకే మోహన్‌బాబు వంటి చుట్టం సైతం జగన్ వద్దకు పోలేదు… అందరమూ కలిసి వెళ్దామంటున్నాడే తప్ప నేను వెళ్లొస్తాను చూడండి అని మాట్లాడటం లేదు…
- జగన్ లెక్కలు వేరే ఉంటయ్… కులం, రాజకీయం, ప్రతిపక్షం, పార్టీ, విధేయత, అవసరం, లబ్ధి, గత అనుభవాలు వంటి చాలా ఈక్వేషన్లు ఆలోచించుకుంటాడు తను…
- శ్యామ్ సింగరాజ్ విడుదలకు ముందు నాని మాట్లాడిన బేకార్ మాటలు సినిమాకు ఏం నష్టం చేశాయో నాగార్జునకు తెలుసు…
అన్నింటికీ మించి నాగార్జున లెక్కలు వేరు… తనకేదో ఈ బంగార్రాజుకు మించిన పెద్ద ఇష్యూ ఉంది… బహుశా ఏదో ప్రాపర్టీ ఇష్యూ… దానికోసం జగన్‌ను ఒక్కడే కలిశాడు… అది బహుశా సంతోష్, తలసాని వంటి సెకండ్ లేయర్ నేతలతో సెటిలయ్యేది కానట్టుంది… కానీ కేసీయార్ స్వయంగా రంగంలోకి దిగి, ఈ ఇష్యూ ఏమిటో సెటిల్ చేసేయండి అని చెప్పాలంటే నాగార్జునకు అంత యాక్సెస్ ఎక్కడిది..? అందుకే జగన్ ద్వారా ఓ మాట చెప్పించుకున్నాడని వెళ్లాడంటారు… నిజానిజాలు పెరుమాళ్లకెరుక…
Ads
నిజానికి జగన్ దగ్గర అపాయింట్‌మెంట్ కూడా నాగార్జునకు అంత వీజీ కాదు… బహుశా ఇక్కడా తన సినిమా బంధాల్నే యూజ్ చేసుకుని ఉంటాడు… బంగార్రాజు సినిమా దర్శకుడు కల్యాణ్ కృష్ణ మంత్రి కురసాల కన్నబాబుకు స్వయానా తమ్ముడు… సోగ్గాడే చిన్నినాయనా సినిమా తరువాత అదేదే నేలటికెట్ అని తీసి, పూర్తిగా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న కల్యాణ్‌కు సోగ్గాడు సీక్వెల్ బంగార్రాజు రూపంలో మళ్లీ లైఫ్ ఇచ్చింది నాగార్జునే… వర్తమాన ప్రాపంచిక జ్ఞానం, సబ్జెక్టు నాలెడ్జి, మాటలో క్లారిటీ ఉన్న కొద్దిమంది మంత్రుల్లో కన్నబాబు కూడా ఉంటాడు… సో, కన్నబాబు మీద జగన్‌కు గురి ఉంది… ఒకవైపు తన సొంత సమస్య మీద జగన్ వద్దకు వెళ్లొస్తూ, ఇప్పట్లో ఏమీ తేలని టికెట్ల ధరలపై జగన్ ధోరణిని నాగార్జున ఎందుకు విమర్శిస్తాడు..? నెవ్వర్… ఇండస్ట్రీ మొత్తం సమస్య కోసం తన ప్రయోజనాన్ని, అవసరాన్ని పణంగా పెడుతూ ఎందుకు వైసీపీతో గోక్కుంటాడు ఇప్పుడు..? అదే… అందుకే… టికెట్ల ధరలతో నాకేమీ ఇబ్బంది లేదు అనేశాడు… అనక తప్పలేదు..!! జగన్ దగ్గర మార్కులు పడ్డట్టేనా బంగార్రాజూ…!?
Share this Article