Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఛార్జ్‌షీట్లు తెలుగులో రాయరు… రాసిందేంటో బాధితుడికి తెలియదు…

January 28, 2025 by M S R

.

-పమిడికాల్వ మధుసూదన్…. 9989090018  …      … ఛార్జ్ షీట్ తెలుగులో రాయక బాధితులకు అన్యాయం

అంటరానితనం మహానేరం. శిక్షార్హం కూడా. కానీ అంటరానితనం పోయిందా? పోలేదు. స్వరూపం, స్వభావం మార్చుకుని ఏదో ఒక రూపంలో ఉంది. సామాజిక అస్పృశ్యత ఎలాంటిదో అలాంటిదే ఈ భాషావిషాదగాథ.

Ads

ప్రపంచంలో ఎన్ని దేశాలు ఇంగ్లిష్ మాట్లాడతాయి? మొత్తం ప్రపంచంలో మనుగడలో ఉన్న భాషల్లో ఇంగ్లిష్ మాట్లాడేవారి శాతం ఎంత? అన్న లెక్కలు ఇక్కడ అనవసరం. భారతదేశంలో మాత్రం చదువుకున్నవారు, సంపన్నులు, ఉన్నతాధికారులు ఇంగ్లిష్ లోనే మాట్లాడతారు. వారి మాతృభాష ఏదైనా ఇంగ్లిష్ లో మాట్లాడ్డమే హోదా, మర్యాద, ఆధునికత, నాగరికత అనుకుంటారు.

విషయం మరీ సాధారణీకరించకుండా పోలీసు ఉన్నతాధికారుల ఇంగ్లిష్ ప్రేమ వల్ల తెలుగు ఫిర్యాదుదారులు అన్యాయమైపోతున్న ఒకానొక దయనీయగాథ ఏమిటో చూద్దాం. ఐఏఎస్, ఐపిఎస్ లాంటి ఉన్నతోద్యోగాలకు కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్- యుపిఎస్సి అభ్యర్థులకు రాత, మౌఖిక పరీక్షలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తుంది.

తరువాత శిక్షణ ఇచ్చి రాష్ట్రాలకు కేంద్రమే వారిని కేటాయిస్తుంది. ఏ రాష్ట్రంలో నియమిస్తారో అక్కడి ప్రాంతీయ భాష నేర్చుకోవడం కూడా శిక్షణలో భాగం. కానీ… శిక్షణలో నేర్చుకునే భాషాజ్ఞానం చాలా ప్రాథమికమైనది. తరువాత ఏ క్యాడర్ రాష్ట్రానికి వెళ్తారో అక్కడ స్థానిక భాషలో విధిగా పరీక్ష కూడా పాస్ కావాల్సి ఉంటుంది. ఈ నిబంధనలో ఉద్దేశాలు, ఆదర్శాలు కాగితాల మీద చాలా గొప్పవే. కానీ ఆచరణలో అది ఇంగువకట్టిన గుడ్డగా అయినా ఉందా అంటే? ఉందనుకుంటే ఉంది… లేదనుకుంటే లేదు.

ఇతర రాష్ట్రాలనుండి ప్రత్యేకించి ఉత్తర భారతం నుండి తెలంగాణకు వచ్చిన ఐఏఎస్, ఐపిఎస్ ఇతర అధికారులకు ఇక్కడ హిందీ ఒక అనుకూలం. వారిని ప్రసన్నం చేసుకోవడానికి కింది అధికారులు కూడా వారితో హిందీలోనే మాట్లాడుతుండడంతో వారికి వారి సొంత ఊళ్ళో ఉన్నామన్న భావన కలుగుతోంది.

తెలంగాణాలో శతాబ్దాల నిజాం పాలన వల్ల జనం కూడా హిందీకి (ఉర్దూ) అలవాటుపడ్డారు. అందువల్ల పేరుకు క్యాడర్ పరంగా తెలుగు రాష్ట్రంలో నియుక్తులైనా చాలామంది ఉత్తర భారతానికి చెందిన తెలంగాణ అధికారులు నిత్యవ్యవహారాల్లో హిందీని తిని… తాగి… పీలుస్తూ ఉంటారు. అధికారికంగా ఇంగ్లిష్ ను తిని… తాగి… పీలుస్తూ ఉంటారు. వారు న్యాయంగా, విహితధర్మంగా, విధ్యుక్తధర్మంగా తెలుగును తిని… తాగి… పీల్చకపోవడంవల్ల ఫిర్యాదుదారులు బలైపోతున్నారు.

ప్రత్యేకించి ఐపిఎస్ అధికారులతో వస్తోంది ఈ చిక్కు. ఎంతగా ఇంగ్లిష్ మీడియం పురులు విప్పి నాట్యం చేస్తున్నా… ఇప్పటికీ తెలుగువారికి పోలీస్ కంప్లైంట్ తెలుగులో రాయడమే హాయి. సులభం. అసలే నేరమో, ఘోరమో జరిగి బాధితులుగా ఉన్నవారికి పోలీసు ఉన్నతాధికారుల ఇంగ్లిష్ ప్రేమ మరింతగా గుండెల్లో గుచ్చుకుంటోంది. పోలీసులను ఆశ్రయించేదే న్యాయం చేయమని. కాపాడమని. అలాంటిది అధికారిక వ్యవహారమంతా ఇంగ్లిష్ లోనే జరపడంవల్ల బాధితులకు మరింత బాధే మిగులుతోంది.

ఫిర్యాదుదారుడు తెలుగులో ఫిర్యాదు కాగితం రాసిస్తాడు. పోలీసులు దానిమీద విచారణ తెలుగులోనే చేస్తారు. అనుమానితులను తెలుగులోనే అడుగుతారు. సాక్ష్యాలను తెలుగు మాట్లాడే సేకరిస్తారు. నెలలు, ఏళ్లతరబడి మౌఖికంగా అంతా తెలుగులోనే జరుగుతూ ఉంటుంది. రాతకోతల దగ్గర మాత్రం అంతా ఇంగ్లిషే.

ఎఫ్ఐఆర్- ఇంగ్లిష్.
ఛార్జ్ షీట్- ఇంగ్లిష్.
కేసు సంబంధ ఉత్తరప్రత్యుత్తరాలు- ఇంగ్లిష్.
చివరికి కోర్టుకు సమర్పించే వివరాలు- ఇంగ్లిష్.

తెలుగులో ఛార్జ్ షీట్ రాస్తే తమకు అర్థం కాదు కాబట్టి… పోలీసు ఉన్నతాధికారులు తిరస్కరిస్తున్నారు. దాంతో ఇంగ్లిష్ లోనే రాయాల్సి వస్తోంది. తెలుగు బాధను పొల్లుపోకుండా ఇంగ్లిష్ లో రికార్డ్ చేస్తే ఏ బాధా లేదు. బాధితుడు తెలుగులో చెప్పిందొకటి- ఇంగ్లిష్ లోకి తర్జుమా అవుతున్నది మరొకటి.

స్టేషన్ హౌస్ ఆఫీసర్- ఎస్‌హెచ్ఓ; ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్- ఐఓ ఏది ఇంగ్లిష్ లోకి అనువదిస్తే అదే కోర్టు దాకా వెళుతోంది. వారి భాషాజ్ఞానం; అనువాద సామర్థ్యం మీదే బాధితుడికి అవసరమైన న్యాయమో, అనవసరంగా అన్యాయమో జరుగుతూ ఉంటుంది.

“తెలుగులో ఛార్జ్ షీట్ వేస్తే కోర్టులు తిరస్కరించడానికి వీల్లేదు. కింది కోర్టుల్లో తెలుగు వాడేలా అటు న్యాయ శాఖకు, ఇటు పోలీసు సిబ్బందికి ప్రభుత్వమే చొరవ తీసుకుని శిక్షణ ఇవ్వాలి. భాషాజ్ఞానం లేని పోలీసులు ప్రయివేటు టైపిస్టుల మీద ఆధారపడుతున్నారు. దీనితో ఒకవైపు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం ఆలస్యమవుతోంది. మరోవైపు వారి అజ్ఞానం కూడా తోడై తప్పులతో ఛార్జ్ షీట్ తయారై… కోర్టుల్లో ఇబ్బందులెదురవుతున్నాయి” అని తెలంగాణ జ్యుడిషియల్ అకాడెమీ మాజీ డైరెక్టర్, రచయిత, తెలుగులో తీర్పులిచ్చిన మాజీ న్యాయమూర్తి మంగారి రాజేందర్ అంటున్నారు…

చాలా రాష్ట్రాల్లో స్థానిక భాషలో ఛార్జ్ షీట్లు వేసేలా చట్టాలు చేశారు. దాంతో కోర్టులు కూడా అనుమతిస్తున్నాయి. కేరళలో దిగువ కోర్టు కేసుల్లో 50 శాతం శిక్షలు పడడానికి మలయాళంలో రాయడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ చట్టం చేయకపోవడంవల్ల శిక్షలు పడక ఓడిపోతున్న కేసుల్లో 50 శాతం ఓటమికి ఇంగ్లిషే కారణం.

అటు గోడ దెబ్బ- ఇటు చెంప దెబ్బ ఒకేసారి తగిలాయని తెలుగు సామెత. దొంగల చేతి దెబ్బ- ఇంగ్లిష్ అడ్డుగోడ దెబ్బ ఒకేసారి తగిలే ఈ ఆధునిక సందర్భాలకు తగిన సామెతలను కొత్తగా రాసుకుని… ఓడగొట్టిన అనువాద న్యాయానికి ఎవరిని బాధ్యులు చేయాలో తెలియక… గుండెలు బాదుకోవాల్సిన పదహారణాల తెలుగు రోదనలివి.

“హోల్డ్ యువర్ టంగ్!
మైండ్ యువర్ లాంగ్వేజ్!!”
అని బొడ్లో పిస్తోలున్న పోలీస్ అధికారుల ఇంగ్లిష్ తూటాలకు ఎదురొడ్డి నిలబడగలిగే తెలుగు ఉక్కుపిండాలు ప్రకాశం పంతుళ్ళు పుట్టే కాలమా ఇది?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నడిరాతిరి వేళా నీ పిలుపు… ఇలాంటి ఓ హిందీ పాటే ఓ ఉత్సవం…
  • ఈ తూరుపు, ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ…!
  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions