థింక్ వన్స్… ఒకసారి భిన్నంగా ఆలోచించి చూద్దాం… ఎన్నికలు రాగానే నోటాకు వేద్దాం, చైతన్యం చూపిద్దాం అనే నీతిబోధలు మీడియాలో స్టార్ట్ అవుతాయి… అక్కడికే వోటరు ఎందుకు ఆగిపోవాలి… బిట్ బియాండ్ దట్… అంతకుమించి ఎందుకు ఆలోచించొద్దు..? నోటా దగ్గరే మనం ఆగిపోతే అది ఓ తప్పుడు అవగాహన కాదా..? ఈ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు..? నిజంగా నోటాకు వోటు వేయడం అనేది ఓ చైతన్య సూచికా..? ఎవరో ఏదో దేశంలో ప్రవేశపెట్టిన ఈ నోటాకు వోటు అనేది వోటరు చైతన్యానికి ప్రతీకేనా..?
ఇది నోటా వ్యతిరేక కథనమేమీ కాదు… దానికే వోటు వేయాలని అనుకుంటే వేద్దాం… తప్పేమీ లేదు… కానీ వోటు వేయడం అంటేనే ఎవరినైనా గెలిపించాలి, లేదా ఎవరినైనా ఓడించాలి… మన వోటు వీటిలో దేనికీ పనికి రానప్పుడు… పనికిరాని వోటు వేయడానికి అంటే నోటా అనే ఓ నిష్ఫల వోటింగు కోసం, ఈ కరోనా పీడదినాల్లో రిస్కు తీసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లడం దేనికి..?
Ads
ఇదుగో ఇలాంటి ప్రచారాలు ఇక పోటెత్తుతాయి… అందుకే ఇలా ఓసారి విశ్లేషించుకుందాం… వోటు వేయడం మన కర్తవ్యమే… కానీ ఎందుకు వేయాలి..? ఇప్పుడు పాలించేవాడు సరిగ్గా లేడు అనుకున్నప్పుడు, ప్రత్యామ్నాయం కోసం వోటు వేయాలి… లేదూ, బాగా పనిచేస్తున్నాడు అనుకుంటే తనను మళ్లీ ఎన్నుకుని, భుజం తట్టడానికి వోటు వేయాలి… ఎహె, అభ్యర్థుల్లో ఎవరూ సరిగ్గా లేరు అనుకుంటే, అందరూ అలాంటోళ్లే అనుకుంటే… వాళ్లలో బెటర్ పర్సన్‌ను ఎంచుకుని వోటు వేయాలి… నోటాకు వేస్తే ఏమొస్తుంది..?
చెల్లని వోట్లు వేయడం ఎలాగో… నోటాకు వోటు వేయడం కూడా అలాగే… చెల్లని వోటు వేయడానికి వోటరు ఎందుకు ప్రయాసపడాలి..? పోలింగ్ శాతం పెరిగినట్టు చూపడానికా..? అంత అవసరం ఏమీ లేదుగా… మన వ్యవస్థలో పోలింగ్ శాతం ఎంతయినా పర్లేదు… ఇద్దరు అభ్యర్థులుండి, పది వోట్లు పడితే… ఆరు వచ్చినోడిదే గెలుపు… అంతే… పైగా సగం వోట్లు రావాలని కూడా ఏమీలేదు… ఒక్క వోటు ఎక్కువ వచ్చినా సరే, గెలుపు గెలుపే…
నిజానికి గ్రేటర్లో తమ కార్పొరేటర్ ఎవరు అని మొన్నామధ్య ఒకరు సర్వే చేస్తే సగానికి పైగా తమకు తెలియదు అన్నారట… అంతేమరి… మన నేతల పనితీరు అదీ… అసలు మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేయగలదు..? మరీ భీకరమైన చట్టాల్ని చేయలేదు… భారీ సంక్షేమాన్ని చేపట్టలేదు… మహాఅయితే మౌలిక పురసేవల్లో నాణ్యతను చూపించగలదు… రోడ్లు, వీథిలైట్లు, పారిశుధ్యం, డ్రైనేజీ, తాగునీరు… ఎట్సెట్రా… నిజానికి వాటిల్లోనూ ప్రభుత్వ నిర్ణయాల ప్రభావమే ఎక్కువ…
మరి ఏ కార్పొరేటర్ ఉంటే ఏమిటి అంటారా..? కాదు, పూర్తిగా ఈ ఆలోచన సరికాదు… ఒక గ్రేటర్ ఎన్నికలో అధికార పార్టీకి తక్కువ సీట్లు వస్తే అది ప్రజల్లో వ్యక్తమయ్యే వ్యతిరేకతకు సూచిక అవుతుంది… అధికార పార్టీని నేలమీదకు తీసుకురాగలదు గ్రేటర్ వోటు… కాదు, కాదు, ప్రభుత్వం బాగా పనిచేస్తుందీ అనుకుంటే, అనుకున్న సీట్లు గనుక గెలిస్తే, అది ప్రజల్లో సంతృప్తికి సూచిక అవుతుంది… మంచి పనితీరుకు గుర్తింపు అవుతుంది… అందుకని వోటు అవసరమైతే భుజం తట్టేలా ఉండాలి లేదా భుజం మెలితిప్పి, వీపు మీద ఒక్కటి బలంగా చరిచేలా ఉండాలి… నోటా వీటిలో ఏదీ చేయలేదు కదా… ఇప్పుడు చెప్పండి… నోటాకు వోటేద్దామా..? ఉన్నవారిలోనే ఒకరిని ఎంచుకుందామా..? వాట్ డు యు సే…?
Share this Article