ఎహె, బిగ్‌బాస్-5 లో ఎవరెవరు..? ఎప్పట్నుంచి..? ఇది పెద్దగా ఆసక్తిని క్రియేట్ చేయడం లేదు ఇప్పుడు..? ఓ వార్త మాత్రం భలే పట్టేసింది.,. అదేమిటో ముందు చెప్పుకుందాం… ‘‘రియాలిటీ షోలు ఎప్పుడూ ఒకేరకంగా ఉంటే ఎవడు చూస్తాడు..? కొత్తదనం కావాలి ప్రేక్షకులకు… బిగ్‌బాస్ తాత వంటి రియాలిటీ షో ఒకటి బిగిన్ కాబోతోంది… ఆఫ్టరాల్ బిగ్‌బాస్ అంటే ఒక ఇంట్లో వదిలేస్తారు, ఇక తన్నుకొండిరా, తిట్టుకొండిరా అని చెబుతారు… ఏవో దిక్కుమాలిన ఇగోలు, పోటీలు గట్రా ఉంటయ్… బయట ప్రైవేట్ సోషల్ ఆర్మీలు, వోట్ల దందాలు అన్నీ ఉంటయ్… కానీ జీ తమిళ్ వాడు కంటెస్టెంట్లను దీవుల్లో వదిలేసే ఓ కొత్తరకం పోటీ ప్లాన్ చేశాడు… భారతీయ భాషల్లో తొలిసారి… దాని పేరు సర్వైవర్… సీనియర్ హీరో అర్జున్ దీనికి హోస్ట్… మన తెలుగులో దీనిపై పెద్ద చర్చ ఏమీ జరగడం లేదు కానీ తమిళంలో బోలెడువార్తలు, ఊహాగానాలు నడుస్తూనే ఉన్నయ్… ఇంతకీ ఏమిటి ఆ దీవి..?
ఆఫ్రికన్ తీరంలోని కొన్ని దీవుల్లో జాంజీబార్ దీవులు కూడా ఉన్నయ్… టూరిజమే ప్రధానం అక్కడ… చిన్న చిన్న దీవుల సముదాయం అది… అదుగో అక్కడ 18 మంది కంటెస్టెంట్లను వదిలేస్తారు… ఎవరు ఎలా సర్వైవ్ అవుతారనేదే పోటీ… బిగ్‌బాస్ మనకు అలవాటైంది కాబట్టి ఆ ఆట రూల్స్ ఏమిటో, మైనసులేమిటో, ఏమేం జాగ్రత్తలు తీసుకుంటారో మనకు తెలుసు… పైగా అది స్టూడియోలోని సెట్టు కాబట్టి ఏదైనా విపత్కరం వస్తే వెంటనే అటెండ్ కావడానికి వీలుంటుంది… మరి ఏదో ఓ దీవిలో ఎలా..? అదే థ్రిల్, అదే మిస్టరీ, అదే కొత్తదనం… అదే షో టీఆర్పీలను పట్టుకురావాలి… కరోనా గండం రాకపోతే ఇప్పటికే స్టార్టయ్యేది షో… నటులు శివ కార్తికేయన్, ఆర్యల ఫస్ట్ లుక్స్ కూడా ప్రమోషన్ కోసం రిలీజ్ చేసినట్టున్నారు… మిగతా కంటెస్టెంట్లు ఎవరు అనే చర్చ నడుస్తూనే ఉంది… వారిలో శ్రీరెడ్డి, వనిత పేర్లు కూడా కనిపిస్తున్నయ్… అదే జరిగితే ఆ దీవంతా రచ్చ రచ్చే…
Ads
తాజా వార్తలను బట్టి ఈ షో సెప్టెంబరు 12 నుంచి రాత్రి తొమ్మిదిన్నరకు ప్రసారం చేస్తారు… మిగతా కంటెస్టెంట్ల జాబితా ఏదో వినిపిస్తున్నా, వారిలో మనకు పరిచయమున్న మొహాలు తక్కువే కాబట్టి అది వదిలేద్దాం… బిగ్‌బాస్‌తో పోలిస్తే ఇది రిస్క్‌తో కూడిన థ్రిల్లింగ్ రియాలిటీ షో కాబట్టి జనానికి మంచి వినోదాన్ని ఇస్తుందనే ఆశిద్దాం… మరి తెలుగు..? ఇదీ ప్రశ్న… తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్ విపరీతంగా చిరాకు పుట్టించింది అందరికీ… కృత్రిమ ప్రేమలు, ఏడ్పులు తెగ విసిగించేశాయి… ఎలాగూ జీతెలుగు వాడు స్టార్‌మాటీవీ, ఈటీవీతో పోలిస్తే రియాలిటీ షోలలో చాలా వీక్… నాన్-ఫిక్షన్ కేటగిరీలో చాలా వెనుకంజ… సో, పనిలోపనిగా తెలుగు కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసి, ఆ తమిళ కంటెస్టెంట్లతోపాటే తీసుకెళ్లి ఆ దీవిలో పడేస్తే సరిపోయేది… ఎలా తమిళ సిబ్బంది తెలుగు షోకు కూడా సరిపోతారు… డౌటేముంది..? అర్జున్ కూడా హోస్టుగా భేషుగ్గా ఉంటాడు, తెలుగునాట అర్జున్ తెలియనివాళ్లు ఎవరు..? కాదు, నిజంగానే ఓ ప్రాజెక్టు చేస్తామనే సోయి గనుక ఉంటే… జాంజీబార్ వేస్ట్… మన అండమాన్ లేదా మన లక్షద్వీప్ దీవుల్లోనే ఒకటి ఎంచుకోవచ్చు… అండమాన్‌లో దాదాపు 30 వరకూ మనుషుల ఉనికి ఉన్న దీవులున్నయ్… అది మన టెరిటరీ కాబట్టి రక్షణ, మద్రాస్ నుంచి, వైజాగ్ నుంచి రవాణా ఈజీ… కాకపోతే కంటెస్టెంట్లను తీసుకెళ్లినప్పుడు పొరపాటున ఏ సెంటినలీ దీవిలోనో వదిలేసి వస్తే మాత్రం కష్టం… సర్వైవర్ అంటూ ఎవరూ మిగలరు…!! అవునూ, ఓ డౌట్… వీళ్లు సర్వైవింగ్ టాస్కులు చేస్తున్నప్పుడు షూట్ చేయడానికి కెమెరా క్రూ గట్రా ఉంటారు కదా… మరిక ఒంటరిగా ప్రకృతి శక్తులతో పోరాటం అనే కాన్సెప్ట్ ఎలా నెరవేరుతుంది… అందరి మెడల్లో మూర్చబిళ్లలు వేసినట్టుగా మీనియేచర్ కెమెరాలు వేలాడదీసి, ఆ డేటా ఎప్పటికప్పుడు శాటిలైట్ కనెక్షన్ల ద్వారా స్టూడియోకు చేరితే…!? ఏదైనా ప్రమాదం ముంచుకొస్తేనే వాళ్ల దగ్గరకు ఛాపర్లు వెళ్లేలా ఏర్పాటు చేస్తే..?!
Share this Article