ముందుగానే ఓ పెద్ద డిస్‌క్లయిమర్…. ఇది ఈ కథనం రాస్తున్న సమయం బుధవారం రాత్రి తొమ్మిది గంటల వరకు ఉన్న పరిస్థితి…. ఎన్టీయార్ పేరును పీకిపారేసి, వైఎస్ పేరు పెట్టాడు కదా జగన్ హెల్త్ యూనివర్శిటీకి… తెలుగుదేశం గాయిగాయి గత్తర రేపుతున్నది… దానికి అది అవసరం… జగన్ ఎక్కడ దొరికితే అక్కడ బదనాం చేయడం దాని రాజకీయ అవసరం… పైగా ఇది జగన్ పట్ల వ్యతిరేకతను పెంచుతోంది… తెలుగుదేశంతో సంబంధం లేని తటస్థులు కూడా జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు…
యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ అనే ఎన్టీయార్ వీరాభిమాని తను ఉద్దరిస్తున్న అధికార భాషాసంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు… మరి ఆయన్ని ఏ ప్రాతిపదికన జగన్ అప్పట్లో ఎంపిక చేశాడో, ఇంకా అలాంటి వారు ఎందరున్నారో జగన్‌కే తెలియాలి… సరే, దాన్ని పక్కన పెట్టేస్తే… ఎన్టీయార్ అంతమందిని కన్నాడు… పిల్లలు, అల్లుళ్లు, కోడళ్లు, మనవలు, మనవరాళ్లు, ఆ తరువాత తరం… ఓ పెద్ద సమూహం… ఒక్కరంటే ఒక్కరూ స్పందించినట్టు కనిపించలేదు…
జగన్ అంటే గజగజ వణుకా..? చివరకు తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎన్టీయార్ నటవారసుడు, చంద్రబాబు వియ్యంకుడు, లోకేష్ మామ బాలయ్య స్పందన కూడా కనిపించలేదు ఇప్పటికీ…! యాడ తానున్నాడో రాజు…!! (Update :: లేట్ గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టుంది)… ఎప్పుడైనా ఎన్టీయార్ వర్ధంతి రోజో, జయంతిరోజో పత్రికల్లో పావు పేజీ ప్రకటనలు మాత్రం కనిపిస్తుంటయ్… మళ్లీ ఎప్పుడు పుడతావు నాన్నా అనే శీర్షికతో ఇస్తుంటారు యాడ్స్…! జూనియర్ మాత్రం విడిగా ఇచ్చుకుంటాడు… ఎన్టీయార్ కుటుంబం ఇప్పటికీ తమలో ఒకడిగా స్వీకరించినట్టు లేదు…
Ads
ఎన్టీయార్ పేరును కత్తిరించిపారేయడం తమకు సంబంధం లేని వ్యవహారం అనుకుంటున్నారా ఆ కుటుంబసభ్యులు… అది ఎన్టీయార్ గౌరవానికి కత్తెర వేయడంగా కనిపించడం లేదా..? దానిపై స్పందించాల్సిన అవసరం ఉందని కూడా అనిపించడం లేదా..? అదీ ఆశ్చర్యం… ఫాఫం, ఎన్టీయార్… అప్పట్లో చంద్రబాబు చెప్పగానే పోలోమంటూ అందరూ ఎన్టీయార్‌కు వ్యతిరేకంగా నిలబడ్డారు కదా… ఇప్పుడూ అంతే, ఎన్టీయార్ పట్ల తమ నైతిక కర్తవ్యాన్ని మరిచిపోతున్నారు…
పోనీ, వాళ్లందరినీ వదిలేసి, లోకనిందకూ భయపడకుండా, అధికారం పోతున్నా సరే, ఆమె వెంట నిలబడ్డాడు కదా… ఆ లక్ష్మిపార్వతి నుంచి కూడా స్పందన లేదు… జగన్ క్యాంపులో ఉన్నందుకా..? అధికార హోదాలో ఉన్నందుకా..? జగన్‌కు కోపం రావొద్దనా..? ఉన్న ఆ పోస్టు కాపాడుకోవడానికా..? ఎన్టీయార్ త్యాగానికి ఆమె చూపే విశ్వాసం, కృతజ్ఞత ఇదా..?
ఎందుకు కన్నావ్, ఎందుకు కట్టుకున్నావ్ ఎన్టీయార్ అనాలనిపిస్తోందా..? అవును… అన్నా తప్పులేదేమో… చివరకు బీజేపీలో ఉన్న పురంధేశ్వరి కూడా సైలెంట్… ఎందుకు..? జగన్ పట్ల ఆబ్లిగేషన్ ఏమీ లేదు కదా… మరెందుకీ నిశ్శబ్దం… కొంపదీసి జగన్ నిర్ణయాన్ని ఆమోదించడం లేదు కదా…!!
Share this Article