Bp Padala …… యండమూరి రాసిన ‘ యుగాలు మారినా ‘ కథకు నా విశ్లేషణ 1995 లో రచన లో ప్రచురించబడింది . మెచ్చిన యండమూరి ఈ కథను రాసిన పెన్ ను బహుకరించడం అదో పెద్ద కథ… ఆ కథ, నా విశ్లేషణ ఒకసారి చదువరుల కోసం ఇక్కడ… (యండమూరికి కృతజ్ఞతలతో…)(కథ స్క్రీన్ షాట్స్‌గా ఉంది… జూమ్ చేసుకుంటూ చదివితే సరి… కథ దిగువన నా విశ్లేషణ…)
Ads
ధర్మరాజు ఆలిని ఓలిగా పెట్టి ఓడిపోయాడు.. సరే! వట్టి మగ దురహంకారపు పంది. కానీ ఎప్పుడు..!? తన ధన, సువర్ణ, దాసదాసీ జనాన్నీ, చతురంగ బలాల్నీ, రాజ్య సంపదలనూ పోగొట్టుకున్న తర్వాత. తన సోదరుల్నీ, తననూ ఓడిపోయిన తర్వాత. అంటే తన రాజ్య సంపదలకన్నా, ప్రియ సోదరులకన్నా, చివరికి ఇంద్రప్రస్థ సార్వభౌముడైన తనకన్నా కూడా ద్రౌపదికి ఎక్కువ విలువ ఇచ్చాడన్న మాట. మరి దీన్ని స్త్రీకి గౌరవం ఇవ్వడం అంటారా? అన్యాయం చేయడం అంటారా?
అంతవరకూ ఓడిపోయిన పాండవ రాజ్యలక్ష్మికీ, అరివీర భయంకరులైన పాండవుల దాస్యవిముక్తికీ సమానంగా ద్రౌపది తెలివికీ, స్థాయికీ నిదర్శనం కాదా? ప్రజ్ఞగల స్త్రీని ఏ సమాజమైనా , ఏ పరిస్థితులలోనైనా గుర్తిస్తుందనడానికి ద్రౌపదిని మించిన ఉదాహరణ మరేముంది? ధర్మరాజు తన భార్యనూ, సోదరుల భార్యలనూ ( సుభద్ర మొ|| వారు) ద్రౌపది ఓడిపోయిన తర్వాత కూడా పందెంగా పెట్టలేదే? అంటే ద్రౌపది( స్త్రీ)ని పందెంగా పెట్టడం exception కానీ rule కాదని తెలుస్తుంది కదా!
ఈ నాటి స్త్రీ ఆలోచించడానికి భయపడడం లేదు. ఆలోచన ఆపితే ఎక్కడ తన అస్తిత్వానికి భంగం కలుగుతుందో అని ఆలోచిస్తుంది. అసలు తమ వ్యక్తిగత ఆవేశాన్ని, ఆక్రోశాన్ని ఒక సిద్ధాంత చట్రంలో అమర్చి తన వర్గ శత్రువుగా ‘ మగాడు’ గా నిర్ణయించినప్పుడే స్త్రీవాదం వక్రమార్గం పట్టింది. అలాంటి దారీ తెన్నూ లేని వాదాన్ని మహాభారత సంఘటనలో బలవంతంగా జొనపటానికి రచయిత చేసిన ప్రయత్నంలో కథ కూడా కృతకంగా అయ్యింది. అయితే ఇంత బలహీనమైన వాదాన్ని కథలో అమర్చిన తీరు చూస్తుంటే రచయిత ‘చేయితిరిగిన వాటం’ స్పష్టంగా కనిపిస్తుంది.
ఉల్లిపాయ నవ్వు సంఘటన నిజంగా మహాభారతంలో ఉందో లేదో నాకు తెలియదు. లేకుంటే మాత్రం రచయిత ఊహాశక్తికి జోహార్లు! ఒక దేశకాల పరిస్థితులలో జరిగిన సంఘటనను, మరొక దేశకాల పరిస్థితులలో సమ్యక్ దృష్టితో విశ్లేషించితే ప్రయోజనం ఉండొచ్చేమో కానీ, ఒక ఇరుకు సిద్ధాంత అద్దాల గుండా చూస్తే ప్రయోజనం శూన్యం. ఇకపోతే కౌరవ సభలో భీష్మ , ద్రోణ, విదురుల వంటి గురు కురు వృద్ధులు కూడా ద్రౌపది వస్త్రాపహరణాన్ని ఆపలేదనీ, మగబుద్ధిని ప్రదర్శించారనీ వాపోయిన రచయిత చేతిలో కూడా కౌరవ ఘోషలో మరుగున పడిన వికర్ణుని గొంతు వినపడలేదెందుకనో ?
Share this Article