నీతులు చెప్పడానికేముంది..? ఎన్నయినా చెప్పొచ్చు..! ఆ నీతులు పాటించాలని ఎవరికి చెబుతున్నామో, వాళ్లకు జీవితంలో అవి ఉపయోగపడాలి కదా… నో, ఈ సోషల్ మీడియా యుగంలో అవన్నీ ఆలోచించే సవాలే లేదు… నోటికొచ్చింది చెప్పామా, నాలుగు లైకులు వచ్చాయా..? అంతే… రీల్, షార్ట్స్ లాగే నీతులు…
సాంకేతిక విషయాల్నీ తెలుగులోకి తీసుకురావాలి అనేది ఇలాంటి నినాదమే… ఈ డిమాండ్ చేసేవాళ్లు ఒక్కసారి… జస్ట్, ఒక్కసారి తెలుగు అకాడమీల పాఠ్యపుస్తకాల్ని తిరగేస్తే బాగుండు… అత్యంత దరిద్రమైన పదజాలం… దిక్కుమాలిన అనువాదాలు.,. ఆ తలకుమాసిన ఈనాడు అనువాదాలు నయం అనిపిస్తుంది అవి చదువుతుంటే…
అంతేనా..? తెలుగు చట్టసభల్లో వ్యవహారాలపై తెలుగులో తీసుకొచ్చే ప్రశ్నోత్తరాలు గట్రా చదవాలి ఓసారి… ఇనుప గుగ్గిళ్లు… ప్రపంచంలో ఎవడికీ అర్థం కాని భాష అది… అవును, తెలుగు వాడికి అస్సలు అర్థమైతే ఒట్టు… ఎవడో తెలుగు జీతగాడు… నోటికొచ్చినట్టు తెలుగు పదాలు పేరుస్తాడు… చట్టసభల సభ్యులెవరూ చదవరు, చదివినా అర్థం కాదు…
Ads
సేమ్, టెక్నాలజీని తెలుగులోకి అనువదించినా అలాగే ఉంటుంది… తెలివైన పౌరుడికి నేర్పించాల్సింది ఏమిటంటే..? ఏ భాషలో టెక్నాలజీ మీద, సైన్స్ మీద, ఇతరత్రా అనేకానేక అంశాల మీద ఎక్కువ పుస్తకాలు ఉన్నాయో ఆ భాషను పర్‌ఫెక్టుగా నేర్చుకునేలా పురికొల్పాలి… అంతే తప్ప, తెలుగు, తెలుగు కాదు…
ఫస్ట్ ఆఫ్ ఆల్… మన తరువాత తరాలకు ముందు తెలుగు రాయడం నేర్పండి, తెలుగు చదవడం నేర్పండి, తెలుగు అర్థం చేసుకోవడం నేర్పండి… అసలు విదేశాల్లో ఉంటున్న మనవాళ్ల పిల్లలకు అసలు తెలుగు పలకడమే రాదు, చదవడం రాదు, రాయడం మాటే తెలియదు… నిజానికి తప్పుపట్టే పనిలేదు… వాళ్ల అవసరం ఇంగ్లిష్… వాళ్ల కాన్సంట్రేషన్ ఇంగ్లిష్… బతకడానికి, బతుకులో ఎదగడానికి… నిలవడానికి, గెలవడానికి…
అంతే తప్ప… దుష్ట అనువాదాలతో కంపు కొట్టే తెలుగు వాళ్లకు అక్కర్లేదు… వాళ్లకు అర్థం కూడా కాదు… వేల, లక్షల సంవత్సరాల మానవ పురోగతిలో భాషలు, సంస్కృతులు, అలవాట్లు గట్రా కాలాన్ని బట్టి మారుతూనే ఉంటాయి… మారకపోతే ‘స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్‌లో’ కొట్టుకుపోతారు… ఫిట్టెస్ట్ ఆఫ్ సర్వైవల్… అంటే కాలం, అవసరం, ప్రాంతాలకు అనుగుణంగా మారేదే నిలబడుతుంది, ప్రగతి వైపు కొనసాగుతుంది…
మాతృభాషలో చెబితేనే అర్థమవుతుంది అనేది ఓ డొల్ల మాట… చిన్నప్పటి నుంచి మనం ఏం నేర్పిస్తామో అదే అలవడుతుంది పిల్లలకు… అందుకని మనం విశ్వమానవులుగా ఎదగాలంటే మన మాతృభాషను కాపాడుకుంటూనే ప్రపంచ భాషల్లో పరిణతి, ప్రగతి సాధించాల్సిందే… చాలామంది ఛాందస భాషావాదులకు ఇవన్నీ జీర్ణం కావు, కానీ ఇదే నిజం…
ప్రపంచంలో అనేకానేక భాషలు అంతరిస్తున్నాయి… అది కాలసహజం… ఎవరెంత సెంటిమెంట్ రాజేసినా, మనోభావాలు దెబ్బతీసుకున్నా… రాబోయే రోజుల్లో తెలుగుకు గడ్డుకాలం తప్పదు… దాని లిపికి, దాని వ్యాకరణానికి, దాని మనుగడకూ గండమే… ఛాందసవాదం ఱ ర, ఖ క, గ ఘ, శ ష వంటి అక్షరాల నడుమ తేడాలతో సుదీర్ఘ వ్యాసాలు రాస్తుంటుంది… కానీ సగటు మనిషి వాడుక భాషకు ఆ తేడాలు అక్కర్లేదు… 56 కాదు, 26 అక్షరాలు చాలు అంటారు కొందరు తెలుగు భాషావేత్తలు…
ఇదంతా చదివి చొక్కాలు చింపుకుని, మనోభావాలు చంపుకుని గగ్గోలు పెట్టనక్కర్లేదు… కాస్త దీర్ఘదృష్టితో ఆలోచించాలి… నిజానికి ఈ స్టోరీ ప్లాట్‌తో ఓ పెద్ద పుస్తకమే రాయొచ్చు… కానీ చాలామందికి ఇది యాంటీ సెంటిమెంట్… కానీ యాంటీ రియాలిటీ…!! మన తెలుగువాడు విశ్వమానవుడు… అనేక దేశాల్లోకి విస్తరిస్తున్నాడు… అన్ని భాషల్నీ మథించి, నేర్చి, అలవాటు చేసుకుంటున్నాడు… కనీసం ఇళ్లల్లోనైనా తెలుగును బతికించుకుందాం అంటారా..? గుడ్… అదీ స్పిరిట్..!! (మరీ గాయపడకండి, జస్ట్ ఫర్ ఎ డిబేట్…)
Share this Article