రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేసినట్టే అని కలలుకంటున్న కాంగ్రెస్‌వాదుల్లో ఓ కలకలం… నిజంగానే కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఓ ఆందోళన ఉంది… పలు విమర్శలు వినవస్తున్నాయి… వాటికి బలం చేకూర్చేట్టు మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎఐసీసీ స్థాయి నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేశాడు… నిజంగానే ఓసారి ప్రజలు లుక్కేయాల్సిన పరిణామం…
తను బీఆర్ఎస్‌లోకి వెళ్తాడా, తనతో ఏయే బీఆర్ఎస్ నేతలు సంప్రదింపుల్లో ఉన్నారనేది పక్కన పెడదాం కాసేపు… ఆల్‌రెడీ పల్లా కోసం ఏకంగా ముత్తిరెడ్డి వంటి లీడర్‌నే తీసి పక్కన పెట్టేసింది బీఆర్ఎస్… అలాంటిది పొన్నాలకు చాన్స్ ఇస్తారా అనేది డౌటే… ఇస్తే న్యాయం చేసినట్టే..! (పల్లా, ముత్తిరెడ్డి ఇద్దరూ జనగామకు స్థానికేతరులే…)
తను రాజీనామా చేస్తూ ఓ లేఖ రాశాడు… ఎఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఆ లేఖ… నిజానికి తన రాజీనామాకు కారణాల్ని ప్రజలకు వివరించడానికే ఆ లేఖను తెలుగులో విడుదల చేసినట్టున్నాడు… అంటే ఎఐసీసీ స్థాయిలో తనకున్న సంబంధాలు, పరిచయాలన్నీ టచ్ చేసినా సరే, తన కోరికలు నెరవేరే సూచనలు లేక, ఇక విధి లేని స్థితిలో రాజీనామా చేసినట్టున్నాడు… షాకింగే… నిజానికి గత ఎన్నికల్లోనే తనకు టికెట్టు ఇవ్వలేదు మొదట్లో… పీసీసీ మాజీ అధ్యక్షుడు తన టికెట్టు కోసం కష్టపడాల్సిన దుస్థితి కాంగ్రెస్‌లో…
Ads
ఆయన దశాబ్దాలుగా కాంగ్రెస్‌నే అంటిపెట్టుకుని ఉన్నాడు… చీటికీమాటికీ పార్టీలు మారడం సాధారణమైన ఈ రోజుల్లో కూడా తను పార్టీని విడిచిపెట్టి పక్కచూపులు చూడలేదు… కమిటెడ్ లీడర్… ప్రస్తుతం జనగామ అభ్యర్థిగా చెప్పబడుతున్న కొమ్మూరి ప్రతాపరెడ్డి టీఆర్ఎస్, వైఎస్సార్సీపీల మీదుగా కాంగ్రెస్‌లోకి వచ్చాడు… పొన్నాల రాజీనామాలోని అంశాలకొద్దాం… అన్ని అంశాల్లోనూ ఆయన ఆవేదనకు అర్థముంది… ఓసారి ఆ రాజీనామాను చదవండి… పూర్తి పాఠం ఇది…
తొమ్మిదేళ్లుగా తనకు ఏ పదవీ ఇవ్వలేదు అనే పాయింట్ ఎలా ఉన్నా సరే… తను పలకరించినా సరే పీసీసీ అధ్యక్షుడు స్పందించకపోవడం కాస్త సీరియస్ పాయింటే… ఇది ఒకరకంగా అవమానించినట్టే… పార్టీ టికెట్లు అమ్మకపు సరుకు అయిపోయిందనే ఆరోపణ మాటెలా ఉన్నా సరే, తన అనర్హత ఏమినేది క్వశ్చన్ పాయింట్…
తనకు డబ్బుంది… పార్టీకి కమిటెడ్… పలు సబ్జెక్టుల మీద సాధికారంగా స్పందించగలడు… ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉన్నాడు… వయస్సు ఎక్కువ అనుకుంటే జానారెడ్డి తదితరుల వయస్సు మాటేమిటి..? కొందరు సీనియర్లకే ఫ్యామిలీ ప్యాక్స్ ఆలోచిస్తూ పొన్నాలకు తనకే టికెట్టు నిరాకరించే సిట్యుయేషన్… ఇప్పుడు పొంగులేటి, తుమ్మల ఎట్సెట్రా కొత్త నాయకులే కావాలా..? పార్టీకి కమిటెడ్ లీడర్ల స్థితి ఇంటికి వెళ్లిపోవడమేనా సైలెంటుగా..?
అన్నింటికీ మించి బీసీలు ఎక్కువ సీట్లు అడుగుతుంటే కాంగ్రెస్‌లో పొన్నాల వంటి బీసీలకే కత్తెర్లు పడుతున్నాయి… ఇంకెక్కడి సామాజిక న్యాయం..? బీఆర్ఎస్‌కూ కాంగ్రెస్‌కూ తేడా ఏమున్నట్టు ఇక..? పొన్నాల నిష్క్రమణ కారణాలు ఖచ్చితంగా పార్టీలో మథించి, సరిదిద్దుకోవాల్సినవే… ఐనా అది కాంగ్రెస్… మథనాలు, క్షాళనలు గట్రా ఉండవు… కొందరి పెత్తనాలు కొంతకాలం నడుస్తాయి… ఢిల్లీ పాదుషాల కళ్లకు అవి కనిపించవు, కనిపించినా సరే, కళ్లు మూసుకుంటారు… నటిస్తూ…!! కొన్ని తెలియక, కొన్ని తెలిసీ..!!
Share this Article