ఆఫ్టరాల్ ‘మా’… ఉన్నవే 800- 900 వోట్లు… పడ్డవి ఆరేడు వందలు… జస్ట్, తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో నటుల అసోసియేషన్ అది… వోటింగుకు చాలామంది స్టార్లు రానే రాలేదు, ఎప్పుడూ రారు, ఆ అసోసియేషన్ మొహమే చూడరు… కానీ ఆ ఎన్నిక మీద ఎందుకింత రచ్చ జరుగుతోంది… అఫ్ కోర్స్, జనం ఆధారించే సెలబ్రిటీలు కావచ్చు, కాస్త ఆసక్తి క్రియేటవుతుంది… నిజమే… కానీ ఇంతకుముందు కూడా ఎన్నికలు జరిగాయి కదా, మరి ఇప్పుడే ఎందుకీ రచ్చ..? అది చెప్పుకోవడానికి ముందుగా ఓ విషయం చెప్పుకోవాలి… ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఓటమికి పరోక్షంగా కారకుడైన నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేశాడు, నవ్వొచ్చేలా ఉంది… ప్రాంతీయవాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టులాడుతున్నదట మా అసోసియేషన్, అందుకే రాజీనామా చేస్తున్నాడట… ఎంపీగా పోటీచేసి ఓడిపోయినప్పుడు ఇలా పార్టీకో, రాజకీయాలకో రాజీనామా చేయలేదేం..? పైగా ఆ రాజీనామా పోస్టే చిత్రవిచిత్రంగా ఉంది, తన ఆలోచనలు, అడుగులు, కూతలు, చేతల్లాగే…
నిజానికి ప్రకాష్ రాజ్ వయస్సు, అనుభవం, పరిణతి బుర్రతో పోలిస్తే మంచు విష్ణు ఓ పిల్లగాడు… ప్రకాష్ రాజ్ మీద పర్వర్టెడ్, తుకడే కేరక్టర్ అని ముద్రపడవచ్చుగాక… తను చదువుకున్నవాడు, సొసైటీ మీద తనదైన ఓ అవగాహన ఉన్నవాడు… తన రాజకీయ ధోరణుల మీద ఎవరికి ఎలాంటి అభిప్రాయమున్నా సరే, తన వ్యక్తిత్వం మీద- జీవనశైలి మీద ఎవరి అంచనా ఎలా ఉన్నాసరే… తను కాస్త విజన్ ఉన్నవాడు… కాకపోతే కాస్త పర్వర్షన్… తనతో పోలిస్తే మంచు కుటుంబానికి ఏముంది..? మోహన్‌బాబు నోటికి జడవనివాళ్లు ఇండస్ట్రీలో ఒక్కరైనా ఉన్నారా..? విపరీతమైన ఈగో, దురుసుతనం… తనతో పోలిస్తే ఇష్యూష్ సున్నితంగా, హుందాగా, పద్దతిగా డీల్ చేయడంలో చిరంజీవి చాలా బెటర్… మరి ఆ మెగా క్యాంపు పూర్తిగా సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్ ఎందుకు ఓడిపోయాడు..? మంచు విష్ణు ఎందుకు గెలిచాడు..? రకరకాల కారణాలు…
Ads
- ప్రకాష్ రాజ్ మెగా క్యాంపు అభ్యర్థిగా ముద్రపడటమే తన ఓటమికి ప్రథమ కారణం… పైగా నాగబాబు సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావుపై, ప్రకాష్ రాజ్ ప్రాంతీయతపై చేసిన వ్యాఖ్యలు, మోడీతో పోరాడే ఢీశాలిగా పొగడటం వంటివి ప్రకాష్ రాజ్ మీద క్రమేపీ వ్యతిరేకతను పెంచుతూ పోయాయి… మెగా క్యాంపును వ్యతిరేకించే వాళ్లంతా పోలరైజ్ అయిపోయారు… దీనికితోడు దాసరి స్థానాన్ని భర్తి చేసి, ఇండస్ట్రీకి పెద్దగా మారిపోవాలనే చిరంజీవి ప్రయత్నాలను, ఆలోచనలను వ్యతిరేకించే సెక్షన్ అంతా ఒక్కటైపోయింది… దాంతో ప్రకాష్ రాజ్ ఓ గ్రూపు అభ్యర్థి అయ్యాడు, అందరివాడు కాలేకపోయాడు, వెరసి భారీ తేడాతో ఓడిపోయాడు… నిజానికి ఇది ప్రకాష్ రాజ్ ఓటమి కాదు, మెగా క్యాంపు ఓటమి…
- నిజానికి దీన్ని కమ్మ- కాపు కాన్‌ఫ్లిక్ట్‌గా పూర్తిగా ముద్రవేయలేం… అలాగే యాంటీ మోడీ కేరక్టర్ ఓటమిగా కూడా సంపూర్ణంగా చిత్రీకరించలేం… కొంతవరకూ అవీ పనిచేసి ఉండవచ్చు… కానీ అవే కారణాలు కావు… అలాగే జగన్ సపోర్టర్స్, టీఆర్ఎస్ సపోర్టర్స్, కమ్మ సెక్షన్, యాంటీ-కాపు సెక్షన్, యాంటీ మెగా క్యాంపు, యాంటీ కమ్యూనిస్టులు, యాంటీ తుకడే గ్యాంగ్స్, యాంటీ నాన్-లోకల్ విజయంగా కూడా వందశాతం స్టాంప్ వేయలేం… అన్నీ కలిశాయి, ఇంకొన్నీ అదనంగా పనిచేశాయి…
- ఉంది… ఇండస్ట్రీలో కులాల పోరు ఉంది, ఎప్పటి నుంచో ఉంది… ఇప్పుడేమీ కొత్త కాదు… కాకపోతే మెగా క్యాంపు తప్పులు ప్రకాష్ రాజ్ కొంప ముంచినయ్… అసలు ప్రకాష్ రాజ్‌ను అధ్యక్ష అభ్యర్థిని చేయడంలోనే మెగాక్యాంపు మొదటి తప్పుటడుగు పడింది… జీవితను ఆ క్యాంపు నుంచి లాగేయడం… హేమ వంటి పాత్రల్ని వదిలించుకోలేకపోవడం… అన్నింటికీ మించి కోటా శ్రీనివాసరావుపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రివర్స్ కొట్టాయి… ప్రకాష్ రాజ్ కూడా మొదట్లో సంయమనంతో ఉన్నా, తరువాత క్రమేపీ బ్యాలెన్స్ కోల్పోయినట్టు కనిపించింది… అదేసమయంలో తన సహజ ధోరణికి భిన్నంగా మోహన్‌బాబు సంయమనం పాటించాడు… తను నోరు విప్పడం మొదలుపెట్టి ఉంటే విష్ణుకు ఫుల్ మైనస్ అయి ఉండేది… విష్ణు అందరితోనూ బాగుంటాడు, ఒక స్ట్రాటజీతో క్యాంపెయిన్ చేశాడు… నరేష్ తన వెనుక ఉండటం కూడా లాభించింది… విష్ణు ప్రకటించిన ‘ఉచిత పథకాల’ మేనిఫెస్టో కొంత పనిచేసి ఉండవచ్చు కూడా …!!
- నిజమే… ఓ సీనియర్ జర్నలిస్ట్ మిత్రుడు చెప్పినట్టు… ఈ ఆఫ్టరాల్ ఎన్నికలతో ఎవరికీ వచ్చే నష్టమేమీ లేదు, ఒనగూరే తక్షణ లాభమూ లేదు… కాకపోతే కనీస విజ్ఞత, సంస్కారం లోపించి… ‘అతి’కి పోతే అందరూ ఒక్కటై ఎలా ఓడిస్తారో చెప్పడానికి ఈ ఎన్నికలు ఓ ఉదాహరణగా మిగిలాయి… అంతే…
Share this Article