ఒక రైతును నువ్వు ఫలానా పంటే పండించాలి అని నిర్బంధంతో నియంత్రించడం సాధ్యమేనా..? అదీ ఆహారపంటను… పైగా బాగా ఆదాయం తెచ్చి పెట్టే పంటను… అందులోనూ టెంపర్‌మెంట్ బలంగా ఉండే పంజాబ్ రైతును..! ఇటీవల పంజాబ్ వార్తల్లో ఆకర్షించింది… పూస44 రకం వరిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా నిషేధమే విధించింది… వచ్చే వ్యవసాయ సీజన్ నుంచి ఆ పంట వేస్తే శిక్షార్హులు రైతులు… అసలు ఈ కారణంతో రైతుల్ని శిక్షించడం సాధ్యమేనా..?
సాధ్యమే కాదు, అవసరం కూడా అంటోంది పంజాబ్ ఆప్ ప్రభుత్వం… కానీ ఎందుకు..? ఒక్కసారి ఈ వెరయిటీ ఎందుకు పాపులర్ అయ్యిందో తెలుసుకోవాలి… సాధారణ వరి వెరయిటీలు ఎకరానికి 30- 35 క్వింటాళ్ల మేరకు దిగుబడినిస్తే ఈ పూస రకం ఏకంగా 80-90 క్వింటాళ్ల దిగుబడి ఇస్తోంది… నిజానికి ఇది పాత వెరయిటీయే, కొత్తదేమీ కాదు… 1993లోనే కేంద్ర వరి పరిశోధనా మండలి (ఐసీఏఆర్) దీన్ని డెవలప్ చేసింది… మెల్లిమెల్లిగా పెరిగీ పెరిగీ ఇప్పుడు 70-80 వరి పంట ఈ రకానిదే అయిపోయింది…
పంజాబ్‌లో వరి రైతులకు కొనుగోళ్ల సమస్య లేదు… ఎఫ్‌సీఐ సింహభాగం పంటను కొనుగోలు చేస్తుంది… పైగా దిగుబడి ఎక్కువ… ఒకవైపు ఈరోజుకూ తూర్పు దేశాలు ఇంకా దిగుబడినిచ్చే వెరయిటీల కోసం పరిశోధనలు చేస్తున్నాయి… ఇప్పటికే మనకన్నా చాలా ఎక్కువ దిగుబడి సాధిస్తున్నాయి… ఈ స్థితిలో మంచి దిగుబడులనిచ్చే వెరయిటీల సాగునే నిషేధించడం ఏమిటనేది కదా అసలు ప్రశ్న…
Ads
- ఇది స్వల్పకాలికం కాదు… కనీసం 160 రోజుల పంటకాలం… అంటే ఇతరరకాలతో పోలిస్తే నాలుగైదు తడుల మేరకు అదనంగా అవసరం… ఈ పంటకు నీళ్లు బాగా కావాలి… తద్వారా రాష్ట్రంలో భూగర్భజల మట్టాలు ఆందోళనకరంగా తగ్గిపోతున్నాయని ప్రభుత్వం అంటోంది… పూస నిషేధం ద్వారా భూగర్భజలాల సంరక్షణ సాధ్యమని అంటోంది…
- గోధుమ వేసుకునే సమయానికి గానీ ఈ వరిరకం కోతకు రావడం లేదు… దాంతో పంట కోసేసిన తరువాత మిగిలే పొట్టకాళ్లు, అవశేషాలను కాల్చేస్తున్నారు రైతులు… ఇది వాతావరణంలో కాలుష్యాన్ని పెంచుతోంది… ఈ కలుషిత గాలులు ఢిల్లీ వైపు వెళ్లి అసలే కలుషితంగా ఉండే రాజధాని వాతావరణంలో మరింత కాలుష్యాన్ని నింపుతున్నాయి… చాన్నాళ్లుగా ఈ ఆందోళనలు ఉన్నయ్… సాధారణ వరిరకాలతో పోలిస్తే ఈ పూస రకం అవశేషాలు ఎక్కువ…
ఈ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఈ వరి రకం సాగుపైనే నిషేధం విధించింది… ఆచరణలో ఎంతమేరకు విజయవంతం అవుతుందో చూడాలి… ఎందుకంటే ఇతర వరి రకాలకన్నా ఎక్కువ ఆదాయాన్ని ఇస్తున్న పంటను నిషేధించినా సరే రైతులు సహకరిస్తారా అనేది ప్రధాన ప్రశ్న… పంట సీజన్ కాస్త ముందుకు జరుపుకోవడం, కాలువల కింద ఈ రకాన్ని అనుమతించడం, స్టబుల్ బర్నింగ్ సమస్యకు వేరే పరిష్కారాలు వెతకడం, బోర్ల కింద మాత్రమే ఈ వరిరకాన్ని నిరుత్సాహపరచడం, ఎఫ్‌సీఐ ద్వారా ఈ ధాన్యం కొనుగోళ్లపై ఆంక్షలు పెట్టడం వంటివి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు… లేదా ఈ వరిని మించి ఆదాయం వచ్చే ఇతర పంటల్ని ప్రోత్సహించడం, అంటే కొనుగోలు ధరల్ని పెంచడం, విత్తనాలకు సబ్సిడీలు ఇవ్వడం వంటివి…
Share this Article