.
మామూలు ప్రొటోకాల్ నిబంధనల్ని ఉల్లంఘించి మోడీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి మరీ పుతిన్‌కు స్వాగతం పలికాడు, తనదైన శైలిలో ఆలింగనం చేసుకున్నాడు… అది వారిద్దరి మైత్రి సూచన మాత్రమే కాదు… ప్రస్తుతం జియోపాలిటిక్స్‌లో, అమెరికాను ఏమాత్రం నమ్మదగని పరిస్థితిలో… రష్యాతో స్నేహం ఇండియాకు ఎంత ప్రధానమో తెలియజెప్పే సూచిక…
ఇది వారి మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం (Personal Rapport), రెండు దేశాల మధ్య ఉన్న బలమైన వ్యూహాత్మక బంధాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది… తరువాత ఎవరి కాన్వాయ్‌లో వాళ్లు వెళ్లకుండా… ఇద్దరూ కలిసి ఫార్చూనర్ కారులో వెళ్లారు… ఎందుకు..? ఇదీ ఇప్పుడు చాలామందిలో చర్చనీయాంశం… అంతేకాదు, చైనాలో పుతిన్ కారులో మోడీ ఆంతరంగిక ప్రయాణం కూడా మళ్లీ చర్చకు వస్తోంది…
Ads
షాంఘైలో ఏం జరిగింది..?
షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు, చైనాలో (2025 సెప్టెంబర్)…. టియాన్జిన్‌లో జరిగిన ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా, పుతిన్ తన అధికారిక కారు ‘ఆరస్ సెనాట్ లిమౌసిన్’లో ప్రధాని మోడీకి లిఫ్ట్ ఇచ్చాడు… వారు సదస్సు వేదిక నుండి ద్వైపాక్షిక భేటీ జరిగే హోటల్‌కు కలిసి ఒకే కారులో ప్రయాణించారు… పుతిన్ స్వయంగా మోడీ కోసం దాదాపు 10 నిమిషాలు వేచి చూసి, ఆ తర్వాత కారులో ఎక్కించుకుని వెళ్లాడు…
రకరకాల ప్రచారాలు సాగాయి.., అక్కడ మోడీని ఖతం చేసే కుట్ర జరిగిందనీ, అది తెలిసిన పుతిన్ మోడీని అలర్ట్ చేసి, స్వయంగా తన కారులో తీసుకువెళ్లాడనే ప్రచారాలు… కానీ ఏవో వర్తమాన ప్రపంచ రాజకీయాలకు సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని మోడీతో పుతిన్ షేర్ చేసుకున్నాడంటారు… అది రెండు దేశాలకూ ఉపయుక్తం… హోటల్ గదుల్లో ఇలాంటివి పంచుకోలేరు, నిఘా, సంభాషణల్ని రికార్డు చేసే ప్రయత్నాలూ ఉంటాయి… అందుకని దుర్భేద్యమైన పుతిన్ కారే నయం…
పుతిన్ వివరణ…: ఈ విషయంపై పుతిన్ స్పందిస్తూ, ఇది ముందుగా అనుకున్న ప్రణాళిక కాదని, బయటకు రాగానే తన కారు సిద్ధంగా ఉందని, “మనం ఇద్దరు స్నేహితులుగా కలిసి ప్రయాణిద్దాం” అని తాను మోడీని ఆహ్వానించానని, ఇది తమ స్నేహానికి చిహ్నం అని పేర్కొన్నాడు…
ఇప్పుడు ఢిల్లీ విమానాశ్రయంలో స్వాగతం పలికాక… ఇద్దరు నాయకులు తమ సాధారణ వీఐపీ ఫ్లీట్లను పక్కన పెట్టి, తెల్లటి టయోటా ఫార్చూనర్‌లో కలిసి ప్రయాణించారు… సాధారణంగా ప్రధాని మోడీ రేంజ్ రోవర్ లేదా పుతిన్ ‘ఆరస్ సెనాట్’ ఉపయోగిస్తారు.,.. కానీ, ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి ఒకే కారులో వెళ్లడం ద్వారా, రష్యా- భారత్ బంధం ఎంత బలంగా ఉందో ప్రపంచ దేశాలకు స్ట్రాంగ్ మెసేజ్ పంపించినట్లైంది…
అంతేకాదు… కీలకమైన సమాచార మార్పిడి అందులోనే జరిగిపోతుంది సాఫీగా… తరువాత ప్రొటోకాల్స్, ఇతరత్రా మర్యాదలు, కీలకమైన విషయాల్లో ఒప్పందాలు, సంతకాలు సరేసరి…

ఇంతకీ పుతిన్ ఎందుకంత స్పెషల్ అంటారా..? అది ‘నడిచే కోట’… దుర్భేద్యం… ‘ఆరస్ సెనాట్ లిమౌసిన్’ (Aurus Senat Limousine)... ఇది కేవలం లగ్జరీ వాహనం మాత్రమే కాదు, చక్రాలపైన కదులుతున్న ఒక కోట అని చెప్పవచ్చు… ఇది రష్యాలోనే రూపొందించబడిన అత్యాధునిక సాంకేతికతతో కూడిన వాహనం…
-
బుల్లెట్‌ప్రూఫ్ కవచం (Armoured Fortress)….: ఈ కారు ప్రపంచంలోనే అత్యధిక భద్రతా ప్రమాణాలలో ఒకటైన VR10 బాలిస్టిక్ రక్షణ కలిగి ఉంది… ఇది బుల్లెట్‌ప్రూఫ్, గ్రెనేడ్ దాడులను, పేలుళ్లను తట్టుకునేలా రూపొందించబడింది…
-
కెమికల్ దాడుల నుంచి రక్షణ…: రసాయన దాడుల సమయంలో కూడా లోపల స్వచ్ఛమైన గాలిని అందించడానికి బిల్టిన్ ఎయిర్ ఫిల్ట్రేషన్, అత్యవసర ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ ఉంది…
-
పటిష్టమైన నిర్మాణం…: కారు అండర్‌బాడీ పేలుళ్లను తట్టుకునేలా, టైర్లు దెబ్బతిన్నా కూడా పరుగు కొనసాగించేలా (Run-flat tyres) తయారు చేయబడ్డాయి… కిటికీ అద్దాలు దాదాపు 6 సెం.మీ మందం వరకు ఉంటాయి…
-
శక్తివంతమైన ఇంజన్…: ఇది 4.4 లీటర్ ట్విన్-టర్బో V8 హైబ్రిడ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 598 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది… భారీ బరువు ఉన్నప్పటికీ, కేవలం 6 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు…
-
అత్యంత విలాసవంతమైన ఇంటీరియర్…: లోపల భాగం ఖరీదైన తోలు సీట్లు, చెక్క ట్రిమ్, డిజిటల్ డాష్‌బోర్డ్‌లు, సీటింగ్, కూలింగ్, మసాజ్ సౌకర్యాలతో సహా అత్యాధునిక లగ్జరీ సౌకర్యాలను కలిగి ఉంటుంది… డ్రైవర్, ఓనర్ క్యాబిన్ మధ్య ప్రత్యేక అడ్డుగోడ (Divider) కూడా ఉంటుంది…
కిమ్ తరహాలో పుతిన్ టాయిలెట్, ఫుడ్ ఏర్పాట్లు…
ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ వలె, పుతిన్ కూడా విదేశీ పర్యటనల్లో తన భద్రత, ఆరోగ్యం పట్ల అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాడు… కమ్యూనిస్టు దేశాల ముఖ్యులెవరూ ఎవరినీ, దేన్నీ నమ్మరు… ప్రత్యేకించి సీఐఏ ఏదైనా కుట్రలు చేస్తుందేమోనని సందేహం…
-
పోర్టబుల్ టాయిలెట్ (మొబైల్ బాత్‌రూమ్)…: పుతిన్ విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి టాయిలెట్లను ఉపయోగించడు… ఆయన తన వ్యక్తిగత సెక్యూరిటీ బృందం ద్వారా మొబైల్ బాత్‌రూమ్‌ను వెంట తీసుకెళ్తారని నివేదికలు చెబుతున్నాయి…
-
‘పూప్ సూట్‌కేస్’…: ఇద్దరు ఫ్రెంచ్ జర్నలిస్టుల నివేదికల ప్రకారం, పుతిన్ మలాన్ని కూడా ఆయన భద్రతా సిబ్బంది ఒక సీల్డ్ కవర్‌లో ప్యాక్ చేసి, ప్రత్యేక సూట్‌కేసులో (Poop Suitcase) భద్రపరిచి, తిరిగి రష్యాకు తీసుకువస్తారట… శత్రువులు ఆయన ఆరోగ్యం లేదా జీవక్రియల గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోకుండా ఉండేందుకు ఈ పద్ధతిని పాటిస్తారని తెలుస్తోంది…
-
ప్రత్యేక ఫుడ్ ల్యాబ్, చెఫ్‌లు: పుతిన్ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు… విదేశీ పర్యటనల్లో అక్కడి హోటల్ ఫుడ్‌ను తీసుకోడు… ఆయన కోసం రష్యా నుండే స్వంత చెఫ్‌లు, వంట సామాగ్రి, సరుకులను విమానంలో తీసుకెళ్తారు… ఆహారం సిద్ధం చేసిన తర్వాత, దానిని వినియోగించే ముందు విషపూరితం కాలేదని నిర్ధారించుకోవడానికి మొబైల్ ల్యాబ్‌లో కచ్చితంగా పరీక్షిస్తారు…
Share this Article