పార్ధసారధి పోట్లూరి ……. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాత్కాలిక కాల్పుల విరమణకి ఆదేశాలు ఇచ్చాడు ! జనవరి 7 ని రష్యన్ ఆర్ధడాక్స్ చర్చ్ జీసస్ పుట్టిన రోజుగా లెక్కిస్తుంది కాబట్టి నిన్న ఈరోజు రష్యన్లకు క్రిస్మస్. ఒకప్పటి సోవియట్ రిపబ్లిక్ అయిన ఉక్రెయిన్ కూడా జనవరి 6, 7 తేదీలని సెలవుగా ప్రకటిస్తాయి.. ఆర్ధడాక్స్ చర్చ్ జూలియన్ కాలెండర్ ని పాటిస్తుంది కాబట్టి రేపు క్రిస్మస్ వాళ్ళకి.
పుతిన్ కి యుద్ధ విరామ అవసరం ఉంది ! జనవరి 6. 7 తేదీలు అనేవి కేవలం సాకు మాత్రమే ! నిజానికి గత నెల రోజుల నుండి ఎవరన్నా మధ్యవర్తిత్వం చేసి యుద్ధానికి విరామం ప్రకటింప చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు పుతిన్ కానీ ఆ పని ఎవరూ చేయలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వాలోదిమిర్ జెలెన్స్కీ మాత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్ లో మాట్లాడాడు కానీ దాని సారాంశం ఏమిటో ఎవరికీ తెలియదు. బయట కొంత మంది ఏవేవో ఊహాగానాలు చేశారు కానీ అవేవీ నిజాలు కావు.
రష్యాకి ఆధునిక యుద్ధ పరికరాలు వాడగల సైనికులు కావాలి, ఇంజినీర్లు కావాలి ! గత సంవత్సరం నవంబర్ నెల 25 న యుద్ధానికి సంబంధించి వార్తలు మాత్రమే రిపోర్ట్ చేసే పత్రిక ఒకటి ఒక సంచలన విషయం బయటపెట్టింది. అది రష్యన్ సైన్యానికి ఆధునిక యుద్ధ పరికరాలని ఉపయోగించగల సైనికులు మరియు ఇంజినీర్లు కావాలి అంటూ! మరో విషయం కూడా రిపోర్ట్ చేసింది, పుతిన్ యుద్ధ విరామం ప్రకటించే అవకాశం ఉంది అంటూ ! అయితే నవంబర్ 25న సదరు వార్తా సంస్థ చేసిన రిపోర్ట్ అందరూ తేలికగా తీసుకున్నారు కానీ అది ఇప్పుడు నిజం అయ్యింది ! కాబట్టి ఆ వార్తకి విలువ ఉంది !
Ads
రష్యాకి హైటెక్ ఆర్టీలరీ సిస్టమ్స్ ఉన్నాయి. వీటితో ఉక్రెయిన్ తో యుద్ధంలో చాలా సులువుగా విజయం సాధించవచ్చు. కానీ వాటిని సమర్ధవంతంగా ఆపరేట్ చేసే వాళ్ళు లేరు. ప్రస్తుతం రష్యా అధీనంలో ఉన్న’దొనేత్సక్ పీపుల్ రిపబ్లిక్ [Donetsk People’s Republic] కి చెందిన మిలీషియా ఫైటర్ మాక్సిమ్ ఫోమిన్ [Maksim Fomin] తన స్వంత బ్లాగులో యుద్ధ విషయాలని వ్రాస్తూ వస్తున్నాడు. ’దొనేత్సక్ పీపుల్ రిపబ్లిక్’ అనే ప్రాంతం భౌగోళికంగా ఉక్రెయిన్ లోనే ఉన్నా ఈ ప్రాంతం మొత్తం రష్యన్ భాష మాట్లాడే వాళ్ళతో నిండి ఉంటుంది. పైగా రష్యాకి అనుకూలంగా పోరాడుతూ వస్తున్నది గత 10 ఏళ్లుగా. ఈ Maksim Fomin అనే అతను గత సంవత్సరం ఫిబ్రవరి 24 న రష్యా ఉక్రెయిన్ మీద దాడి మొదలు పెట్టినప్పటి నుండి రష్యా తరపున తన అనుచరులతో కలిసి పోరాడుతున్నాడు ఉక్రెయిన్ సైన్యానికి వ్యతిరేకంగా. ఉక్రెయిన్ నుండి ’దొనేత్సక్ పీపుల్ రిపబ్లిక్ ని రష్యన్ సైన్యం స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. టెక్నికల్ గా ఉక్రెయిన్ పౌరుడు అవడం వలన ఆ ప్రాంత భౌగోళిక స్వరూపం బాగా తెలిసినవాడు అవడంతో, ఒక్కో ప్రాంతం నుండి ఉక్రెయిన్ సైనికులని ఎదుర్కొంటూ స్వాధీన పర్చుకున్నాడు తన అనుచరులు మరియు రష్యన్ సైనికులతో కలిసి.
నెలల తరబడి వివిధ రష్యన్ కమాండర్ల ఆధ్వర్యంలో కలిసి తిరుగడం వలన వాళ్ళ బలాలు, బలహీనతలని దగ్గర ఉండి గమనించాడు మాక్సిమ్ ఫోమిన్. స్వతహాగా మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాడు కావడం చేత ఆధునిక రష్యన్ ఆయుధాలని దగ్గర నుండి చూసి తెలుసుకోవడం వలన మాక్సిమ్ ఫోమిన్ చేసిన వ్యాఖ్యలకి విలువ ఉంది – ఉంటుంది కూడా.
వ్లాడ్లెన్ టాటర్స్కీ- Vladlen Tatarsky ఇది మాక్సిమ్ ఫోమిన్ కలం పేరు ! తన బ్లాగులో మాక్సిమ్ ఫోమిన్ ప్రస్తావించిన అంశాలు : రష్యన్ ఆర్మీ కి చెందిన ఉత్తర మిలటరీ డిస్ట్రిక్ట్ [Russian army’s Northern Military District] దగ్గర ఉన్న ఆర్టీలరీ గన్స్ చాలా ఆధునికమయినవి. ముఖ్యంగా ఆర్టీలరీ గన్స్ కి ఉన్న ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ [Fire Control System] చాలా ఆధునిక టెక్నాలజీ తో ఉన్నవి. రష్యన్ ఆర్టీలరీ గన్నర్స్ కి తాము వాడుతున్న ఆర్టీలరీ గన్స్ లో ఉన్న ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ గురించి 20% మాత్రమే తెలుసు. వాళ్ళ పని తీరుని గమనించిన వారికి ఎవరికి అయినా తెలిసిపోతుంది ఈ విషయం . అయితే రష్యన్ ఆర్టీలరీ గన్స్ కి ఉన్న ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ మీద అవగాహన ఉండాలి కరెక్ట్ జడ్జ్మెంట్ ఇవ్వాలంటే. నేను దగ్గర నుండి చూసినవి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
రష్యన్ డిఫెన్స్ పరిశ్రమ దశాబ్దాల తరబడి పరిశోధన, అభివృద్ధితో తయారు చేసిన అత్యాధునిక ఆర్టీలరీ గన్స్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ నిజానికి పశ్చిమ దేశాలతో పాటు అమెరికా దగ్గర ఉన్న వాటికి ఏ మాత్రం తీసిపోవు. కొన్ని టెక్నాలజీల విషయంలో రష్యన్లు అమెరికా కంటే ముందు ఉన్నారు. వేల కోట్ల డాలర్ల ఖర్చుతో అభివృద్ధి చేసి తయారు చేసినవి వాటిని పూర్తి స్థాయిలో ఎలా ఉపయోగించాలో తెలియని వాళ్ళకి అప్పచెప్పారు యుద్ధం చేయమని.
రాడార్లు, వందలకొద్దీ అత్యాధునిక హోవిట్జర్లు, రాకెట్ లాంచర్స్ మరియు డ్రోన్లు ఇవన్నీ ఆర్టీలరీ గన్స్, వాటితో పాటు ఉన్న ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ తో ఒక దానితో ఇంకొకటి కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఫిబ్రవరి 24, 2022 నుండి నవంబర్ 20 వరకు ఇలా ఒకదానితో ఇంకొకటి అనుసంధానంగా కలిసి పని చేయలేదు. అంతే కాదు ఫార్వార్డ్ అబ్జర్వర్ అనేది ఆర్మీ కి కళ్ళు, చెవులు లాంటివి. ఫార్వార్డ్ అబ్జర్వర్ ఎప్పుడూ సైన్యానికి ముందు ఉంటూ ఎదురుగా వచ్చే సైన్యం కదలికలు మరియు వాటి సంఖ్యని తన వెనకాల వచ్చే కమాండర్ కి తెలియచేస్తూ ఉంటాడు. ఒకప్పుడు దీనికోసం మనుషులని వాడే వాళ్ళు ఇప్పుడు అతి చిన్న డ్రోన్లు, UAV లని వాడుతున్నారు. యుద్ధంలో గెలుపు ఓటమికి ఫార్వార్డ్ అబ్జర్వర్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది.
మాక్సిమ్ ఫోమిన్ గత సంవత్సరం ఫిబ్రవరి 24 న రష్యా ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టినప్పుడు ఆ దాడి ఎలా మోదలయ్యిందో ఎలా కొనసాగిందో వివరంగా చెప్పాడు. ఆర్టీలరీ గన్స్ ఫ్రంట్ లైన్ లో ఉంటాయి. వాటితో పాటు ఫైర్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది. డ్రోన్స్ ఉంటాయి. శత్రువు దగ్గరికి సమీపిస్తున్నపుడు కమాండర్ ముందు డ్రోన్ ని ఆకాశంలోకి పంపి, శత్రు సైన్యం ఎంత దూరంలో ఉంది, ఎంతమంది ఉన్నారు, అలాగే ట్యాంక్స్ ఎన్ని ఉన్నాయి, రాకెట్ లాంచర్స్ ఎన్ని ఉన్నాయి లాంటి సమాచారాన్ని పైనుండి చూసి, వాటి లొకేషన్ ని కూడా సేకరించి, తన ఆర్టీలరీ గన్స్ కి అనుసంధానంగా ఉన్న ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ కి ఇవ్వాలి. వెంటనే ఫైర్ కంట్రోల్ సిస్టమ్ ఆర్టీలరీ గన్స్ కి పొజిషన్ చెప్తుంది మరియు రాకెట్ లాంచర్స్ కి కూడా ఇదే సమాచారాన్ని ఇవ్వడమే కాదు వెంటవెంటనే ఫైర్ చేయిస్తుంది ఇటు ఆర్టీలరీ గన్స్ తో మరియు రాకెట్ లాంచర్స్ తో. డ్రోన్ ఇచ్చిన సమాచారం వెంటనే 10 సెకన్లలో ఫైరింగ్ మొదలవుతుంది. దీనివలన శత్రువుకి తప్పించుకొనే అవకాశం ఉండదు. ఫార్వార్డ్ అబ్జర్వర్ అది మనిషి కావచ్చు లేదా డ్రోన్స్ కావొచ్చు లేదా శాటిలైట్ ఇమేజెస్ కావచ్చు యుద్ధ రంగంలో ఉన్న అన్ని కమాండ్ పోస్ట్ లకి చేరుతుంది ఏక కాలంలో.
ఆర్టీలరీ గన్స్ లో వాడే షెల్స్ లేజర్ గైడెడ్ కాబట్టి ఫైర్ కంట్రోల్ సిస్టమ్ ఇచ్చిన సమాచారం మేరకు ఖచ్చితంగా టార్గెట్ ని కొడతాయి. మరోవైపు రాకెట్ లాంచర్స్ కూడా కాలి నడకన వచ్చే సైనికుల మీద వర్షంలాగా పడిపోతాయి. ఎవరూ తప్పించుకునే అవకాశం ఉండదు. ఈ పని అంతా ఫైర్ కంట్రోల్ సిస్టమ్ చేస్తుంది ! ఇంత అత్యాధునిక సిస్టమ్స్ ఉన్నా అలా జరగలేదు.
పైన చెప్పిన ప్రకారం అన్నీ ముందుకు వెళ్ళాయి కానీ డ్రోన్ ని ఉపయోగించలేదు. ఒక స్పాటర్ [ఫార్వార్డ్ అబ్జర్వర్ ] దగ్గరలో ఉన్న చెట్టు పైకి ఎక్కి, బైనాక్యులర్ తో దూరంగా ఉన్నవాటిని చూసి, తన కమాండర్ కి చెప్పడం, వాళ్ళు గుడ్డిగా ఒక్కో దానిని ఫైర్ చేయడం జరిగింది. దాంతో ఉక్రెయిన్ కమాండర్లు తమ సైనికులని పొజిషన్ తీసుకోమని చెప్పడం, వాళ్ళు జట్లుజట్లుగా విడిపోయి నక్కుతూ ముందుకు వెళ్ళడం మరియు టాంక్ లతో తిరిగి ఫైర్ చేయించడం, రాకెట్ లాంచర్స్ తో ఫైర్ చేయించడం వలన రష్యన్ ఆర్టీలరీ తమ పొజిషన్స్ ని మార్చుకొని తలా ఒక దిక్కుకి వెళ్లిపోయారు… దాంతో సమాచారం అంటే కమ్యూనికేషన్ తెగిపోయింది. జస్ట్ ఇద్దరు సమఉజ్జీలు ఎదురు ఎదురుగా నిలబడి పోరాడారు. టెక్నాలజీ విషయంలో రష్యా చాలా ముందు ఉన్నది కానీ దానిని ఉపయోగించే వాళ్ళు లేరు.
బైనాక్యులర్స్ ఎప్పుడు ఎవరు వాడతారు ? సరిహద్దుల వద్ద ఉండే చెక్ పోస్ట్ లమీద ఉండే సైనికులు వాడతారు. శాంతి సమయంలో ఎవరన్నా బోర్డర్ దాటి వస్తున్నారా లేదా అని. ఏదన్నా అనుమానాస్పదంగా కనపడితే వెంటనే డ్రోన్ లని పంపిస్తారు విషయం ఏమిటో తెలుసుకోవడానికి. అంతే కానీ యుద్ధ సమయంలో బైనాక్యులర్స్ వాడే స్థితి లేదు ఇప్పుడు. అది రెండవ ప్రపంచ యుద్ధం కాలం నాటి టెక్నాలజీ. ఇప్పుడు అంతా డ్రోన్ ఇచ్చే సమాచారం మీద ఆధారపడి ఆర్మీ ముందుకు వెళుతుంది కానీ తమతో పాటు ముందు జాగ్రత్తగా బైనాక్యులర్స్ కూడా తీసుకెళ్తున్నారు కానీ వాటి అవసరం ప్రశాంతంగా ఉన్నప్పుడే ఉంటున్నది. డ్రోన్ మరియు శాటిలైట్ సమాచారం దొరకని ప్రదేశంలో మాత్రం ఫార్వార్డ్ అబ్జర్వర్ బైనాక్యులర్స్ ని వాడాల్సి వస్తుంది అంటే ఇది మూడో ఆప్షన్ కానీ మొదటి ఆప్షన్ కాదు. (మొదటి భాగం ఇది. రెండవ భాగంలో మిగతా విషయం తెలుసుకుందాము)
Share this Article