మామూలు పరిస్థితులే కాదు… సర్జికల్ స్ట్రయిక్స్ అనంతరం ఉద్రిక్తత, చైనాతో సరిహద్దు ఘర్షణ వంటి సందర్భాల్లో కూడా మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోలేదు… వాస్తవ పరిస్థితులేమిటో, తమ ప్రభుత్వం ఏం చేస్తున్నదో చెప్పే ప్రయత్నం ఏమీ చేయలేదు… దాడులకు ముందు చెప్పాల్సిన పనిలేదు, కొన్ని రహస్య ఎత్తుగడలుంటయ్… కానీ ఉద్రిక్తతలు చల్లారాకనైనా విపక్షాలకు పరిస్థితులేమిటో వివరిస్తే బాగుండేది… వాళ్లూ ప్రజలను రిప్రజెంట్ చేసేవాళ్లే కదా… ఉగ్రవాద దాడులు, సరిహద్దు ఘర్షణల సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన, చేస్తున్న అపరిణత వ్యాఖ్యలపై ప్రజల్లోనే కాస్త ఎవర్షన్ ఉంది, ఇక మోడీ వంటి నాయకుడికి ఇంకా మండిపోతుంది కదా సహజంగానే… కానీ విపక్షం అంటే రాహుల్ గాంధీ మాత్రమే కాదు కదా… తనను జస్ట్, అలా పక్కకు తోసేసి, మిగతా సీనియర్లతో భేటీలు వేయడం మంచిది కదా… పోనీ, లెఫ్ట్ పార్టీలు అంటే చైనా పార్టీలే అనుకుంటే, వాళ్లనూ పక్కన పెట్టేయొచ్చు… కానీ ఇంతకుముందు ఈ దేశ కీలక పదవుల్లో పనిచేసినవాళ్లూ ఉన్నారు కదా… ఎస్…
మోడీ ప్రభుత్వం అదే ఆలోచించినట్టుంది… ఇంకేదైనా కారణం ఉండవచ్చు కూడా… కేంద్ర రక్షణ మంత్రి అంతకుముందు రక్షణ మంత్రులుగా పనిచేసిన సీనియర్ నాయకులు, పరిణతి కలిగిన నాయకులు ఏకే ఆంటోనీ, శరద్ పవార్‌లతో భేటీలు వేశాడని కొన్ని ఇంగ్లిష్ సైట్స్ రాస్తున్నయ్… (అఫ్ కోర్స్, శరద్ పవార్ రాష్ట్రపతి రేసులో ఉన్నాడనీ, మోడీ కూడా ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా ఉన్నాడనీ, ఇద్దరి నడుమ భేటీ కారణం అదేనని వార్తలొస్తున్నయ్, అది వేరే కథ…) ఒకవైపు విదేశాంగ మంత్రి పలు దేశాలు తిరుగుతూ మంతనాలు సాగిస్తున్నాడు… మొన్న తజికిస్థాన్ రాజధాని దుషాంబేలో షాంఘై సహకార సంస్థ భేటీలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్-యి ని కలిశాడు… ఇంకోవైపు అఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నయ్… ఈ స్థితిలో రాజనాథ్‌సింగ్ మాత్రమే కాదు… మన రక్షణబలగాల చీఫ్ బిపిన్ రావాత్, ఆర్మీ చీఫ్ నరవాణె కూడా ఆంటోనీ, పవార్‌ను కలిసి సరిహద్దుల్లో పరిస్థితిని, మన అప్రమత్తతను వివరించారు… పవార్ ఎలాగూ అత్యంత సీనియర్, ఆంటోనీ మెచ్యూరిటీ పట్ల మొత్తం పొలిటికల్ సర్కిళ్లలో మంచి అభిప్రాయం ఉంది…
Ads
నిజానికి పైకి మామూలుగా కనిపించినా… మోడీ ప్రభుత్వ ధోరణి కోణంలో పరిశీలిస్తే ఇది ఓ అసాధారణ చర్యే… అందుకే పలు అనుమానాలు ముప్పిరిగొంటున్నయ్… అటు చైనా, ఇటు ఇండియా కలిసి సరిహద్దుల్లో దాదాపు లక్ష మంది మొహరించి ఉన్నారు… క్షిపణులు, క్షిపణి నిరోధక వ్యవస్థలు, యుద్ధవిమానాలు గట్రా చేరవేయబడి ఉన్నయ్… గతంలో ఘర్షణ జరిగిన పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో సిట్యుయేషన్ చక్కబడినా… హాట్ స్ప్రింగ్స్, డోగ్రా, దెసాంగ్ లోయ తదితర ప్రాంతాల్లో ఇష్యూస్ అలాగే ఉన్నయ్… చైనా లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టు మీద దూకుడుగా వెళ్తూనే ఉంది… ఇండియాకు దానిపై చాలా అభ్యంతరాలున్నయ్…
ఈ స్థితిలో రక్షణ మంత్రి మన పూర్వ రక్షణ మంత్రులను కలిసి చర్చలు జరపడం అంటే… సరిహద్దుల్లో పరిస్థితి చక్కబడని రీతిలో ముదిరిపోయిందా..? మన విదేశాంగ మంత్రి కూడా ఈమధ్య తరచూ చెబుతున్నాడు… చైనాతో సంబంధాలు నెగెటివ్‌గానే కనిపిస్తున్నాయి అని..! ముఖ్య పార్టీల నేతలతో భేటీలు గాకుండా… కేవలం పాత రక్షణ మంత్రులతోనే భేటీలు వేయడం అంటే… ఇదేదో విపక్షాల్ని విశ్వాసంలోకి తీసుకోవడం కాదు, ఇంకేవో అధికారిక రహస్యాలు, సమాచార మార్పిడి కోసం కలిసి ఉంటారనే వాదనలు కూడా వినిపిస్తున్నయ్… ప్రపంచంలో అతి పెద్ద సంఖ్యలో బలగాలున్న రెండు దేశాలు… వేల కిలోమీటర్ల సరిహద్దు… ఎక్కడ చిన్న నిప్పురవ్వ ఎగిసినా… ఏ మంటలకు దారితీస్తుందో తెలియని ఉద్రిక్తత, అవిశ్వాసం… ఇంతకీ ఏం జరుగుతోంది..?! (స్టోరీ నచ్చితే దిగువన కోడ్ స్కాన్ చేసి ముచ్చటకు అండగా నిలవండి)
Share this Article