.
రూపాయి.. రూపాయి.. నువ్వెందుకు పడిపోతున్నావ్?
‘రూపాయి విలువ పడిపోతోంది’.. పడిపోవడం ఏమిటి? రూపాయి నిన్న, ఇవాళ, రేపు.. రూపాయే కదా? చాలామందికి ఇదే సందేహం. అమెరికాలో కార్చిచ్చు, మహాకుంభమేళాలో మోనాలిసా, హైదరాబాదులో కుక్కర్ హత్య.. వీటన్నింటికంటే ముందుగానే ‘రూపాయి క్షీణత’ దేశంలో ప్రకంపనలు రేపుతూ ఉంది.
కానీ చాలామంది దీని గురించి మాట్లాడుకోవడం లేదు. మన దేశం ఆర్థికంగా చాలా గొప్పగా ఎదిగిపోతోందన్న నమ్మకం ఉన్నవారైతే అసలు పట్టించుకోవడం లేదు. ఈ క్షీణతకు అప్పటి నెహ్రూయే కారణమని అన్నా అనేవాళ్లున్నారేమో?
Ads
అసలు ‘రూపాయి విలువ పడిపోవడం’ అంటే ఏమిటి? ఏ దేశపు కరెన్సీ అయినా ప్రపంచవ్యాప్తంగా ఉండే డిమాండ్‌ను బట్టి దాని విలువ ఉంటుంది. అమెరికా అగ్రరాజ్యం కాబట్టి ఆ దేశపు కరెన్సీతోనే మనం పోలిక చూసుకోవాలి.
ఏడాది క్రితం రూ.80 ఇస్తే ఒక డాలర్ వచ్చేది. ఇప్పుడు రూ.85 ఇస్తే ఒక డాలర్ వస్తుంది. అంటే డాలర్ విలువ రూ.5 పెరిగింది. మన కరెన్సీ విలువ రూ.5 పడిపోయింది. డాలర్ విలువ ఎందుకు పెరుగుతోంది? దానికి అనేక కారణాలు. అమెరికా వడ్డీ రేట్లు పెంచడం, బాండ్ రేట్లు పెరగడం లాంటివి.
‘సరే.. డాలర్ విలువ పెరిగితే మనకేంటి నష్టం?’ అని అనుకుందామా? అనుకోలేం. ఎందుకంటే వ్యాపారాలు, దిగుమతులు, దౌత్య సంబంధాలు, ఉన్నత విద్య, వీసాలు తదితర అనేక విషయాల్లో మనకు అమెరికాతో నిత్య లావాదేవీలు జరుగుతుంటాయి. మనం అమెరికా వస్తువులను దిగుమతి చేసుకుంటే ఆ దేశానికి డాలర్లలోనే చెల్లింపులు చేయాలి.
అంటే గతేడాది ఒక డాలర్‌కి రూ.80 ఇచ్చే చోట, ఈసారి రూ.85 ఇవ్వాలి. అలా కొన్ని కోట్ల సొమ్ము అదనంగా అమెరికాకు వెళ్లిపోతుంది. దీనికితోడు అమెరికాకు వెళ్లే విద్యార్థులకు డాలర్లు కావాలంటే గతంలో కంటే ఎక్కువ సొమ్ము అవసరమవుతుంది. డాలర్లలో అప్పులు తెచ్చుకునే భారత కంపెనీలు సైతం చాలా పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి ఇంకా ఉన్నాయి. దీనివల్ల మన సొమ్ములో చాలాభాగం అగ్రరాజ్యానికి తరలిపోతుంది.
ఇదంతా ఎందుకు? అమెరికాకు చెల్లింపులు చేయడం ఆపేస్తే? మంచిదే. కానీ అలా ఆపాలంటే దిగుమతులు ఆపాలి. మనం ఆపగలమా? ప్రధానంగా ఆటోమొబైల్ రంగం దిగమతుల మీదే ఆధారపడి ఉంది. దిగుమతులు ఆపేస్తే ఆ రంగంపై కోలుకోలేని దెబ్బ పడుతుంది.
పోనీ అమెరికాను వదిలేసి మరో దేశం నుంచి దిగుమతి చేసుకుందామా? అదీ కుదరదు. మిగిలిన దేశాలు కూడా ‘మాకు డాలర్లలోనే చెల్లింపులు చేయండి’ అనే కండీషన్ పెడితే చచ్చినట్లు డాలర్లలోనే చెల్లింపులు జరపాలి. అలా జరపాలంటే డాలర్లు కొనాల్సిందే. మన సొమ్మును అమెరికాకు తరలించాల్సిందే!
మన దేశం పోయినేడాది పెట్రోల్, డీజిల్ వంటి వాటిపై రూ.11 లక్షల కోట్ల సొమ్ము విదేశాలకు పంపింది. ఇప్పుడు డాలర్ విలువ పెరిగింది కాబట్టి అది ఇంకెంత పెరుగుతుందో ఆలోచించండి.
సరే.. ఇదంతా ప్రభుత్వం పని. మాకేమీ నష్టం లేదులే అని అనుకుంటే ద్రవ్యోల్బణంలో కాలేసినట్టే. ఎప్పుడైతే రూపాయి విలువ తగ్గి, మన దగ్గరున్న నిల్వలు ఇతర దేశాలకు తరలిపోతాయో, వెంటనే మన దగ్గర వస్తువులకు రేటు పెరుగుతుంది. రెండింతలైనా ఆశ్చర్యం లేదు.
రేట్లతోపాటు పన్నుల పోటు మరింత పెరుగుతుంది. దీనికితోడు మనదేశంలో పెట్టుబడి పెట్టిన విదేశీయులు చకచకా తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటారు. అంటే వాళ్లకు కూడా డాలర్లే ఇవ్వాలి. దీంతో స్టాక్ మార్కెట్‌పై భారీ దెబ్బ పడుతుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో కలిపి సుమారు రూ.1.5 లక్షల కోట్ల సొమ్మును వెనక్కి తీసుకున్నారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది.
రూపాయి విలువ పడిపోవడం వల్ల అన్నీ నష్టాలేనా, లాభాలు లేవా అని అడిగితే ఉన్నాయి. ఏ దేశానికైనా ఎగుమతులే లాభమనే విషయం మనకు తెలుసు. ఆ లెక్కన మన దేశం నుంచి రకరకాల వస్తువులను విదేశాలకు ఎగుమతి చేసేవారు లాభం పొందుతారు.
అలాగే అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇండియాకు డబ్బు పంపేవారు కూడా లాభపడుతున్నారు. ఒకప్పుడు వారి డాలర్ రూ.80 మాత్రమే అయితే, ఇప్పుడు రూ.85 అయ్యింది. దీంతో ఆదాయం అమాంతం పెరిగింది. ఇక్కడి నుంచి విదేశీ కంపెనీలకు పనిచేసి, జీతం పొందేవారికి కూడా లాభమే.
ఇదీ పడిపోతున్న రూపాయి కథ. రూపాయి విలువ పడిపోవడం వల్ల కొందరికి లాభాలున్నా సరే, దీర్ఘకాలంలో ఇది దేశానికి చాలా పెద్ద ముప్పు అని నిపుణులు అంటున్నారు. పరిస్థితి ఇలా కొనసాగితే నిత్యావసరాల ధరలు జనానికి అందుబాటులో లేకుండా పోతాయంటున్నారు.
బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లు పెంచడం, లోన్లకు పరిమితి విధించడం వంటివి చేసే అవకాశం ఉంటుందంటున్నారు. విదేశీ పెట్టుబడులను తెచ్చుకోవడం, ఎగుమతులు పెంచుకోవడం, క్రూడ్ ఆయిల్ దిగుమతుల్ని తగ్గించుకోవడం వంటివి సత్వరం చేస్తే ఆర్థిక వ్యవస్థ కొంత గాడిన పడుతుందని సూచిస్తున్నారు. – విశీ (వి.సాయివంశీ)
Share this Article