.
ఏదైనా అలవాటయ్యాక చాలా మామూలు విషయం అయిపోతుంది. అలా ఆమధ్య బెంగళూరు మహానగర ట్రాఫిక్ మహానరకం మధ్యలో “వర్క్ ఫ్రమ్ కార్” ఓవర్ టైమ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసుల కంట్లో పడింది ఒక ఉద్యోగిని. బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు జగద్విదితం.
“రెండు నిముషాల్లో హోటల్ నుండి ఇంటికి ఫుడ్ పార్సెల్ డెలివెరి అయ్యే యాప్ ను భారత సిలికాన్ వ్యాలీ బెంగళూరు ఆవిష్కరించి… లక్ష కోట్ల ఈక్విటీని, ఐపిఓ ల్లో జనం పెట్టుబడిని ఆకర్షించగలదు కానీ… ట్రాఫిక్ లో ఇరుక్కున్న ఆ ఫుడ్ పార్సెల్ ను రెండు గంటలైనా ఆ యాప్ బయటికి తెచ్చుకోలేదు”… అని బెంగళూరు మీద పాపులర్ జోక్.
Ads
బెంగళూరు ట్రాఫిక్ అంత భయానకం. హైదరాబాద్ ట్రాఫిక్ ను విసుక్కునేవారు రెండ్రోజులు బెంగళూరు ట్రాఫిక్ లో తిరిగి వస్తే… హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ జామే కాదని ఒప్పుకుంటారు.
గంట, రెండు గంటలు ట్రాఫిక్ లో కారు నడుపుతూ ఆ ఉద్యోగిని స్టీరింగ్ మీద ల్యాప్ టాప్ ఓపెన్ చేసి హాయిగా పనిచేసుకోవడం మొదలుపెట్టింది. ఎప్పుడూ ఇలాగే చేస్తోందో! లేక అదే తొలిసారో! తెలియదు కానీ… ఎవరో పక్కనుండి సెల్ ఫోన్లతో షూట్ చేసి… సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దాంతో పోలీసులు పెనాల్టీ వేసి… ఇంకోసారి చేస్తే… డ్రయివింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు.
ఏమాటకామాట. ఇంటికెళితే ఇంటి పనులు ఎలాగూ ఎదురుచూస్తూ ఉంటాయి. రోడ్డు మీద ట్రాఫిక్ లో ఎంత వీలైతే అంత పని పూర్తి చేసేస్తే మంచిది కదా! అనుకున్న ఆ యువతి ఆరాటం కూడా అర్థం చేసుకోదగ్గదే. మహానగరాల్లో ప్రాణాన్ని పణంగా పెట్టి బతుకుపోరును ఈదే సగటు ఉద్యోగి కోణంలో ఈ “వర్క్ ఫ్రం కార్” దృశ్యాన్ని చూడాలి.
బెంగళూరులో సంవత్సరంలో సగటున 117 గంటలు రోడ్లమీద ట్రాఫిక్ లో ఇరుక్కుని ఉంటున్నారని ఒక అధ్యయనంలో తేలింది. 117ను సంవత్సరం రోజులతో భాగిస్తే సగటున రోజుకు 32 నిముషాలు. అంతే. ఈ లెక్కలో ఏదో తప్పున్నట్లుంది. లేదా ఈ అధ్యయనానికి తీసుకున్న శాంపిళ్ళే తప్పయినా అయి ఉండాలి.
రోజుకు తక్కువలో తక్కువ గంట; ఎక్కువలో ఎక్కువ రెండు గంటలు ట్రాఫిక్ లో ఇరుక్కుని బంపర్ టు బంపర్ కదిలే బెంగళూరు వాహనాల సంగతి తెలిసిందే. వర్షాకాలంలో బెంగళూరు అండర్ పాస్ లలో నీరు నిండి కదలని వాహనాలు; ఆ పాస్ లలో మునిగిన కార్లలో నుండి బయటపడలేక చనిపోయిన ఉద్యోగుల విషాదగాథలు కూడా లోకానికి తెలుసు.
దక్షిణాన మైసూర్ రోడ్డులో ఉన్నవారు ఉత్తరాన ఉన్న దేవినహళ్లి విమానాశ్రయానికి ట్రాఫిక్ రద్దీ వేళ రావాలంటే రెండు గంటలకు పైగా పడుతోంది. అక్కడి నుండి దక్షిణ భారతంలో ఎక్కడికి విమానంలో వెళ్లినా ప్రయాణం గంటలోపే. అంటే విమాన ప్రయాణంకంటే గంట ముందు విమానాశ్రయం చేరుకోవడానికి పట్టే సమయమే మూడింతలు ఎక్కువ.
ఈ నేపథ్యంలో సంవత్సరానికి 500 నుండి 700 గంటలు బెంగళూరు జనం ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఇరుక్కుని విలువైన జీవనకాలాన్ని కోల్పోతుంటే ఈ సర్వే ఏమిటి ఇలా 117 గంటలు మాత్రమేనని ఇంతగా తగ్గించి చెబుతోందని బాధపడాలా? ఏ మహానగరంలో అయినా అరగంట, గంట ట్రాఫిక్ ఇబ్బందులు సహజమేనని సర్దుకుపోవాలా?
కొస విరుపు
:- కేరళలో ఒక జాతీయరహదారి మీద 65 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి 11 గంటల సమయం పట్టింది. అయినా టోల్ గేట్ పనిచేస్తూనే ఉంది. ఇలాంటప్పుడు కూడా వాహనాల ముక్కుపిండి టోల్ ఫీజు వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ జనం కోర్టుకెక్కారు. కేసు సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది.
ప్రయాణ సమయంతో మాకేమి సంబంధమని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తమ పిచ్చి చర్యను సమర్థించుకోబోతే… సుప్రీం కోర్టు కడిగిపారేసింది. కొంచెమన్నా బుర్ర ఉపయోగించారా? అని జాతీయ రహదారుల దోపిడీని జాతిజనులు తెలుసుకునేలా చేసింది. అంతంత ట్రాఫిక్ జామ్ లలో చిక్కుకున్నప్పుడు అక్కడ టోల్ ఫీజు కట్టాల్సిన పనిలేదని తీర్పు చెప్పింది.
ఫల శ్రుతి
:- మనం పట్టించుకోము కానీ… సరిగ్గా పట్టుకుని ఆధారాలతో ఇలా కోర్టు ముందు నిలబెడితే ఎన్నెన్నో టోల్ గేట్ల బాధ నుండి మనమూ తప్పించుకోవచ్చు….
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article