.
టైమ్ మ్యాగజైన్ తాజాగా “100 Most Influential People in Sports 2026” జాబితాలో స్మృతి మందాన పేరును కూడా చేర్చింది… ఆమెకు గొప్ప సర్టిఫికెట్- గుర్తింపు- ప్రశంస ఇది. ఎందుకు ఆమె స్పెషల్? ఇదీ ప్రశ్న. అందం, ఆటతీరు, అణకువ, బ్రాండ్ వాల్యూ, ఎన్నో కారణాలు.
భారత మహిళా క్రికెట్‌లో ఎందరో గొప్ప ఆటగాళ్లు వచ్చారు. కానీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని, మహిళా క్రికెట్‌కు ఒక బ్రాండ్ అంబాసిడర్‌లా మారిన వాళ్లు చాలా తక్కువ. అందులో మొదటి వరుసలో ఉండే పేరు స్మృతి మందాన. తాజాగా టైమ్ మ్యాగజైన్ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ క్రీడాకారిణి ఆమె కావడం చిన్న విశేషం ఏమీ కాదు.
Ads
అసలు స్మృతి మందానను స్పెషల్‌గా నిలబెట్టింది ఏమిటి? అందం వల్ల స్టార్ కాదు… ఆట వల్ల ఐకాన్. భారత మహిళా క్రికెట్‌లో చాలాకాలం పాటు ఒక అపోహ ఉండేది. మందాన గురించి మాట్లాడితే చాలామంది ముందు ఆమె రూపాన్ని మాత్రమే ప్రస్తావించేవారు. కానీ కాలక్రమంలో ఆ చర్చ పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఆమె బ్యాట్ ఎక్కువ మాట్లాడింది.
అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో ఆమె ఒకరు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్. ఒక క్యాలెండర్ సంవత్సరంలో 1000కి పైగా వన్డే పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్ కూడా ఆమెనే. ఇప్పుడు అభిమానులు ఆమెను “అందమైన క్రికెటర్”గా కాదు, “అత్యుత్తమ బ్యాటర్”గా గుర్తిస్తున్నారు.
2017 గాయం… కెరీర్‌ను మార్చిన మలుపు 2017లో జరిగిన మహిళల ప్రపంచకప్‌కు ముందు మందాన ఎడమ మోకాలికి తీవ్ర గాయం అయింది. ACL లిగమెంట్ దెబ్బతినడంతో ఆమె దాదాపు ఆరు నెలలు క్రికెట్‌కు దూరమైంది. ఒక యువ ఆటగత్తె కెరీర్‌ను దెబ్బతీసే స్థాయి.
కానీ అదే గాయం ఆమెను మరింత బలంగా మార్చింది. రిహాబిలిటేషన్ పూర్తి చేసి తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఆటలో స్థిరత్వం పెరిగింది. ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టింది. ఆ తర్వాతి కాలంలోనే ఆమె ప్రపంచ మహిళా క్రికెట్‌లో అత్యంత ప్రమాదకర ఓపెనర్లలో ఒకరిగా ఎదిగింది. చాలామంది స్టార్ ఆటగాళ్లు విజయాల వల్ల గొప్పవాళ్లు అవుతారు. మందాన మాత్రం ఎదురుదెబ్బల్ని జీర్ణించుకుని తిరిగి లేచినందుకు ప్రత్యేకం.
వ్యక్తిగత జీవితంలో ఎన్నో చర్చలు… కానీ ఫోకస్ మాత్రం క్రికెట్‌పైనే
గ్లామర్, ప్రకటనలు, సోషల్ మీడియా ఫాలోయింగ్, వ్యక్తిగత సంబంధాలపై గాసిప్స్… ఇవన్నీ మందాన కెరీర్‌లో కొత్తవి కావు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. కానీ వాటిలో ఏదీ ఆమె ఆటను ప్రభావితం చేయలేకపోయింది.
చాలామంది సెలబ్రిటీలకు వ్యక్తిగత జీవితంలోని ఒడిదొడుకులు ప్రొఫెషనల్ ప్రదర్శనపై ప్రభావం చూపుతాయి. మందాన విషయంలో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన చిత్రం కనిపిస్తుంది. మైదానంలోకి అడుగుపెట్టాక ఆమెకు కనిపించేది బంతి మాత్రమే. అందుకే ఆమె స్థిరత్వం ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది.

మహిళా క్రికెట్‌కు ముఖచిత్రం … భారతదేశంలో మహిళా క్రికెట్‌కు ఒకప్పుడు పరిమిత ప్రేక్షకాదరణ మాత్రమే ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ మార్పులో మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామిలతో పాటు స్మృతి మందాన పాత్ర కూడా కీలకమే.
ఆమె మ్యాచ్‌లు చూస్తూ క్రికెట్ పట్టుకున్న అమ్మాయిల సంఖ్య వేలల్లో కాదు, లక్షల్లో ఉంటుంది. మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) విజయానికి కూడా మందానలాంటి స్టార్‌ల ప్రభావం చాలా ఉంది.
టైమ్ వంటి అంతర్జాతీయ సంస్థలు “ప్రభావశీల క్రీడాకారులు” ఎంపిక చేసేటప్పుడు కేవలం పరుగులు, వికెట్లు మాత్రమే చూడవు. ఆ ఆటగాడు తన క్రీడను ఎంతమందికి చేరువ చేశాడు? ఎంతమందికి స్ఫూర్తిగా నిలిచాడు? అనేదీ చూస్తాయి.
అసలు బ్రాండ్ వాల్యూ అక్కడే ఉంది… ఈరోజు స్మృతి మందాన పేరు అంటే కేవలం ఒక క్రికెటర్ కాదు. అది ఒక బ్రాండ్. మైదానంలో నిలకడ, బయట హుందాతనం, వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిత్వం, యువతకు ఆదర్శంగా నిలిచే ఇమేజ్… ఇవన్నీ కలిసి ఆమెను మార్కెటింగ్ ప్రపంచానికీ ఇష్టమైన స్పోర్ట్స్ ఐకాన్‌గా మార్చాయి.

క్రికెట్‌లో పరుగులు కొట్టే ఆటగాళ్లు చాలామంది ఉంటారు. కానీ ఒక తరం అమ్మాయిలకు “నేనూ క్రికెటర్ అవగలను” అనే నమ్మకం ఇచ్చే ఆటగాళ్లు చాలా అరుదు. అందుకే టైమ్ జాబితాలో చోటు దక్కింది స్మృతి మందానకు. ఎందుకంటే ఆమె కేవలం పరుగులు మాత్రమే చేయలేదు… భారత మహిళా క్రికెట్ ముఖచిత్రాన్నే మార్చేసింది.
ముంబైలోని ఓ మరాఠీ కుటుంబంలో పుట్టింది, తరువాత సాంగ్లీలో స్థిరపడింది వాళ్ల కుటుంబం. 2019 నుంచీ పలాష్ ముచ్చల్‌తో ప్రేమబంధంలో ఉంది. నిశ్చితార్థం అన్నారు, తరువాత రద్దు. తండ్రికి అనారోగ్యం, ఇవేవీ ఆమె బ్యాటు మీద ప్రభావం చూపలేదు… నిన్నటి మ్యాచులో కూడా వీరవిహారం చేసింది. అందుకే ఆమె స్పెషల్. 2026 సంవత్సరానికి ఆమె బ్రాండ్ విలువ 200 కోట్లు దాటుతుందని ఓ అంచనా. అటు మేల్ క్రికెట్‌లో కోహ్లీ టాప్, ఇటు ఫిమేల్ క్రికెట్‌లో ఈ లేడీ కోహ్లీ టాప్ ఈ కోణంలో…
క్రికెట్ ఓ మతంగా వర్ధిల్లే ఇండియాలో వుమెన్ క్రికెట్‌కు మాత్రం దశాబ్దాలుగా నిరాదరణ, పట్టించుకునేవారు ఉండరు, స్పాన్సరర్లు దొరకరు, చివరకు గ్లవుజులు, డ్రెస్సులు, బ్యాట్లకూ కొరతే చాన్నాళ్లు… ఆ స్థితి నుంచి ఈరోజు స్మృతి వంటి క్రికెటర్లు ‘వెలిగిపోతున్నారు’… ఈ ప్రస్థానంలో స్మృతి పాత్ర కీలకం, అందుకే ఆమె అంత ఫేమస్..!
Share this Article