Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సుందరయ్య రాజీనామా ఎందుకు? రణదివేతో గొడవేంటి? మాకినేనితో మాటల్లేవ్ దేనికి..?

May 26, 2023 by M S R

పుచ్చలపల్లి సుందరయ్య.. పరిచయం అక్కర్లేని పేరు. పొగడ్తలకీ, భుజకీర్తులకీ పొంగిపోని మనీషి. తిండీ తిప్పలకు కటకటలాడే కూలీనాలీకి గొంతుక. అలో రామచంద్రా అంటూ అల్లాడే బడుగు బలహీనవర్గాలకు అండాదండ. ఎర్రజెండా అంటే పీక్కోసుకునే వారి ముద్దుబిడ్డ. అందరూ పిలుచుకునే పేరు సుందరయ్య. పార్టీ వర్గాలకు పీఎస్. మార్క్సిజం పొడగిట్టని వాళ్లకు కమ్యూనిస్టు గాంధీ. పుట్టింది- ప్రపంచవ్యాప్తంగా ఎర్రజెండా ఎగిసిపడే మేడే నాడు. 72 ఏళ్ల బతుకులో- తెలివిడి వచ్చిందగ్గర్నుంచీ తన కోసం కాకుండా పరుల కోసం- అర్ధశతాబ్దానికిపైగా పరితపించి 1985 మే 19న ఎర్రజెండాను చుట్టుకుని అరమరికలు లేని అధోజగత్ ను దేవులాడుకుంటూ వెళ్లిపోయారు. అనేకానేక చారిత్రక సంఘటనల రూపశిల్పి. సమాజ మూల మలుపులకు ప్రత్యక్ష సాక్షి. ప్రత్యేక వ్యక్తిత్వాన్ని చంపుకుని సమష్టి వ్యక్తిత్వాన్ని సంపాయించుకున్న వారు. కల్లోల సంధ్యలో సంఘర్షణ పడినవారు. సరిగ్గా ఆయన వర్ధంతి నాడే నా చేతికో పుస్తకం అందింది. దాని పేరే సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శికి, పాలిట్ బ్యూరో సభ్యత్వానికి నా రాజీనామా…

…
గుర్రం విజయకుమార్. సీపీఐ ఎంఎల్ నాయకుడు. అంతో ఇంతో సిద్ధాంతం చదివిన వారు. ఆయన నాకీ పుస్తకం ఇమ్మన్నారంటూ- ఆయన మిత్రుడు, నాకూ పరిచయమున్న- ముప్పాళ్ల భార్గవ శ్రీ ఫోన్ చేశారు. విజయవాడ ఏలూరు రోడ్డులోని విశాలాంధ్రలో ఇవ్వండి నేను తీసుకుంటానని చెప్పా. అనుకున్నట్టే ఆయన అక్కడిచ్చిన పుస్తకాన్ని ఆ సాయంత్రం తెచ్చుకున్నా. సుందరయ్య వర్ధంతినాడే ఈ పుస్తకం నా చేతికందడం కాకతాళీయమే కావొచ్చు కానీ గుర్రం విజయ్ కుమార్ నాకు ఎందుకిమ్మన్నారో తెలియదు. కమ్యూనిజమంటే మోజే తప్ప చదివింది తక్కువ. వృత్తిధర్మంలో భాగంగా చాలా ఏళ్లపాటు కమ్యూనిస్టు పార్టీల వార్తలు రాశా. బహుశా అదే కారణమై ఉండొచ్చ. పార్టీ అంతర్గత వ్యవహారాలు, కుమ్ములాటలు, రాజీనామాలాంటి వార్తలంటే పత్రికలకు, విలేఖర్లకు మక్కువెక్కువ. చాలా సందర్భాలలో నేనూ అలాంటి తుంటరి వార్తలు రాసి కొందరి చీవాట్లు, మరికొందిరి మెచ్చుకోళ్లు పొందా. అది కూడా కారణమేమో. ఏమైతేనేం, వాడెవడో గుండూఖాన్ యాడ్- డబ్బులు ఎవరికీ ఊరికే రావన్నట్టు కాకుండా- పుస్తకం ఉద్దరగానే దక్కింది.

…..
1970-1980ల మధ్యకాలం.. దేశానికి గడ్డుకాలం. రైతాంగ పోరాటాలు, ఎత్తుగడల పంథాలు సన్నగిల్లాయి. అధికారమే సర్వస్వమైంది. కాంగ్రెస్ కు పోటీ కమ్యూనిస్టులనే భావన సడలింది. మతమంటూ శివాలెత్తినోళ్లు ఓ పక్క, మితిమీరిన దేశభక్తులొకపక్క. ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ పెట్టింది. తిట్టినోళ్లందర్నీ ఈడ్చిఈడ్చి కొట్టింది. గొంతెత్తితే పీకమీద కాలేసి తొక్కినంత పన్జేసింది. జైళ్లు నిండాయి. కీచు గొంతుకలు తప్ప పెద్ద నోళ్లు మూతపడ్డాయి. ఆ ఎమర్జెన్సీ కమ్యూనిస్టుల్లోనూ కలతలు రేపింది. కక్కాలేక మింగాలేకుండా చేసింది. మితవాదుల సడుగులిరిగాయని సంతోషపడాలో జనశక్తుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉడిగాయని బాధపడాలో తెలియని సందర్భం.

Ads

1975 ఆగస్టు 22… రాజీనామాపై..
ఈ తేదీకి ముందే అంటే 1975 జూన్ లోనో జూలైలోనో పుచ్చలపల్లి సుందరయ్య సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శికి, పాలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు. 1975 ఆగస్టు 8న ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో సుదీర్ఘంగా వివరించారు. అందుకే ఈ పుస్తకం 128 పేజీలైంది. ఎవరెవరితో ఏయే విషయాలపై ఘర్షణ పడాల్సి వచ్చిందో, ఎందుకు పడాల్సి వచ్చిందో రాశారు. అయితే ఇవన్నీ దేశాన్ని ఎలా నడపాలనే దానిపై అభిప్రాయభేదాలే తప్ప సొంత ఆస్తుల కోసమో పదవుల కోసమో వచ్చినవి కావు. మొత్తం పది అంశాలపై సుందరయ్యకి పాలిట్ బ్యూరోతో, కేంద్ర కమిటీతో తేడాలున్నట్టు తేల్తుంది. చదవాలనుకునే వారికి వీలుగా ఈ వివరణలుంటాయి. మాకినేని బసవపున్నయ్య అప్పటికే పాలిట్ బ్యూరోను వదిలేసి విజయవాడ వచ్చారు. మరో పాలిట్ బ్యూరో సభ్యుడు రామమూర్తి రాజీనామా చేశారు. బీటీ రణదీవేతో సుందరయ్యకు ఘర్షణ ఉంది. పార్టీలో మనసిప్పి మాట్లాడుకునే స్థితి లేదు. రాజకీయ, నిర్మాణ సమస్యలపై ఒకే మాట మీదుండే పాలిట్ బ్యూరోలో, కేంద్ర కమిటీలో బలం లేకుండా పోయింది. దీంతో సుందరయ్యను ఒంటరితనం వెంటాడింది. వాటన్నింటి ఫలితమే రాజీనామా అంటూ సుందరయ్య రాసుకొచ్చారు.

సుందరయ్య ఏమన్నారంటే…
ఆయన ఏమన్నారంటే…“ అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాటడమనే పేరిట సామ్రాజ్యవాద అనుకూల, అర్ధ సైనిక ఫాసిస్టు ఆర్.ఎస్.ఎస్. గుండెకాయగా ఉండే జనసంఘ్తో సమష్టి పోరాటాలకు అనుకూలంగా కేంద్ర కమిటీ మెజారిటీ తీర్మానించింది. అది మన పార్టీకీ, ఇటు దేశంలోనూ, విదేశాల్లో ఉండే ప్రజాస్వామిక సమూహాలలో నష్టదాయకమని, సామ్రాజ్యవాద వ్యతిరేక సోషలిస్టు శక్తుల నిం వేరుపడడానికి దారి తీస్తుందని రాజీనామా చేస్తున్నా”

“మనం ఒక విప్లవకరపార్టీగా, కార్మికవర్గ పార్టీగా మార్క్సిజం లెనినిజం పునాదిగా ఉన్న మన పార్టీ నిజమైన విప్లవకర పార్టీని నిర్మించే కర్తవ్యాన్ని తీవ్రంగా చేపట్టడం లేదని భావిస్తున్నా” “పాలిట్ బ్యూరోను ఐక్యపరచలేక పోతున్నా. అనేక సమస్యలపై అంగీకరించలేకపోతున్నా. అందువల్ల నేను పార్టీ, ప్రజా ఉద్యమాల పురోగతికి అడ్డం అవడం లేదు గదా అని రెండేళ్లుగా ఆలోచించి” ఆయన రాజీనామా నిర్ణయానికి వచ్చారు.

ఎంత మానసిక క్షోభపడి ఉంటారో…
సొంతబిడ్డలా సాకి సంతరించి జవసత్వాలను కూడబెట్టిన పార్టీ పదవులకు రాజీనామా చేయడానికి ముందు ఆయనెంత మానసిక క్షోభ పడి ఉంటారో ఊహించవచ్చు. గత్యంతరం లేని స్థితిలోనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. ఆ రాజీనామా పత్రం ఊళ్లోని కార్యకర్త వరకు వెళ్లాలని, అందరూ చదవాలని, మాట్లాడాలని కోరుకున్నారు. ఇలా చేయడం ఒక్క కమ్యూనిస్టులకే సాధ్యమవుతుంది. అందువల్లే ఆయన తన రాజీనామా లేఖను పార్టీ పత్రికలోనూ ప్రచురించాలని కోరారు.

తప్పుల్ని దిద్దుకుని ముందుకెళ్లాలంటే…
కమ్యూనిస్టులు ఇప్పుడు కత్తుల వంతెనపై నడుస్తున్నారు. అస్తిత్వ పోరాటం చేస్తున్నారు. ఒకప్పుడు ఇదే సుందరయ్య పార్లమెంటులో నెహ్రూ, పటేల్ మీద మీసం మెలేసిన నాయకుడు. కాంగ్రెస్ పై కాలుదువ్వినోడు. కానీ నేడెక్కడ? 4వేల మందిని బలిదానం చేసిన తెలంగాణ సాయుధ పోరు గడ్డపై కమ్యూనిస్టుల ఉనికి లేదు. 30 ఏళ్లు ఎదురులేకుండా గెలిచిన పశ్చిమ బెంగాల్ లో ఎక్కడ??, త్రిపురలో ఎక్కడ??.. కేరళలో లేకుంటే కమ్యూనిస్టులు కనుమరుగయ్యారని ఊదరగొట్టేవారు..

ఇటువంటి గడ్డుకాలంలో కామ్రేడ్ గుర్రం కోటయ్య మెమోరియల్ కమిటీ (పొన్నెకల్లు, గుంటూరు జిల్లా) ఈ పుస్తకాన్ని తీసుకొచ్చింది. ఎటువంటి వ్యాఖ్యానాలు లేకుండా ఉన్నదున్నట్టు పాఠకుల ముందుంచింది. ఇప్పటికే ఈ పుస్తకం చేరాల్సిన వాళ్లకి చేరింది. చదివి అర్థం చేసుకున్నోడికి చేసుకున్నంత…

కమ్యూనిస్టు పార్టీలకు కొత్త జవసత్వాలు నింపాలనుకునే వారు ఈ పుస్తకాన్ని కచ్చితంగా చదవాల్సిందే. లోపాలెక్కడున్నాయో వెతకాల్సిందే. దాపరికం లేకుండా మాట్లాడాల్సిందే. పూర్వవైభవానికి నిచ్చెన మెట్లు వేయాల్సిందే. పుస్తకం చివరిపేజీలో తరిమెల నాగిరెడ్డికి నివాళులర్పిస్తూ సుందరయ్య చేతిరాతతో రాసిన లేఖ వేయడం బాగుంది. పీఎస్, సీసీ, పీబీ లాంటి అబ్రివేషన్స్ కి పూర్తి పేర్లు ఒక్కసారైనా రాస్తే ఇప్పటివాళ్లకు తెలుస్తుంది. పుస్తకం కావాల్సిన వాళ్లు కర్నాటి వెంకటరామ్ సెల్ నెంబర్ 9848365778కి ఫోన్ చేయండి. ధర వంద రూపాయలు
…
అమరయ్య ఆకుల
9347921291

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions