Amarnath Vasireddy….. పెళ్లిళ్లు ఎందుకు పెటాకులవుతున్నాయి ? మనస్పర్థలు .. బ్రేక్ అప్ .. డివోర్స్ .. ఇటీవల బాగా వినిపిస్తోన్న మాటలు !గతం తో పోలిస్తే విడిపోయే దంపతుల సంఖ్య బాగా పెరిగిందనేది నిర్వివాదాంశం ! ఎందుకిలా ? గతం లో పెళ్లిళ్లు నిలబడ్డాయంటే … కాపురాలు సాగాయంటే… అది మహిళల త్యాగాల పునాదుల పైనే అని ఒక అభిప్రాయముంది . సరైన అభిప్రాయమేనా ?
స్వీపెంగ్ కన్క్లూజన్ అనొచ్చు . కానీ నిజం లేక పోలేదు . మొన్నటిదాకా స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం లేదు . పురుషాధిక్య సమాజం లో స్త్రీ తన తోటి స్త్రీ ల మీద పురుష పెత్తనానికి కర్త- కర్మ- క్రియ . పురుషాధిక్య సమాజం అట్టా సెట్ చేస్తుంది. ” అమ్మా ! ఇన్నాళ్లు అయితే పుట్టిల్లు . ఇక అలా కాదు . మెట్టింటికి వెళుతున్నావు . అత్తా మామల్ని , బావల్ని గౌరవించాలి . వారేదైనా మాట అన్నా పడాలి ” అని కూతుర్ని సాగనంపేటప్పుడు తల్లి బోధతో ఇది మొదలవుతుంది .
అందరు అత్తా – మామలు కోడల్ని రాచి రంపాన పెడతారని కాదు . సహజంగా పురుషాధిక్య సమాజం లో స్త్రీకి పెద్దగా హక్కులుండవు . వంటింటికి పరిమితం . తండ్రి ఆస్థి ఉన్నా- తమ్ముళ్లకే . తనకు చీర సారె.. స్త్రీ ధనం అంతే ! స్త్రీ జీవితాంతం మైనర్ గానే ఉంటుంది . చిన్నప్పుడు తండ్రి పై , అటు పై భర్త పై , భర్త చనిపోతే పెద్దకొడుకు పై ఆధార పడి బతకాలి .. అని స్త్రీ తలరాతను సమాజమే రాసింది . ఇదే తరతరాల చరిత్ర ! స్త్రీ నెత్తిన రాసిన గీత .. తలరాత !
Ads
ఎక్కడో… ఎప్పుడో ఒక … గోషాల , లోపాముద్ర , రజియా , ఝాన్సీ .. నూటికి కోటికో ఒక్కరు .. చిన్నప్పుడే పెళ్లి చేస్తే అమ్మాయి మెట్టింటి వారితో బాగా కలిసిపోతుంది అని బాల్య వివాహాలు జరిపేవారు . రాజా రామ్ మోహన్ రాయ్ కాలం దాకా బాల్య వివాహాలు కామన్ . కులాల నిచ్చెనలో పైన ఉన్న కులాల్లో నైతే పురుషాధిక్యత మరీ ఎక్కువ . సతీ సహగమనం లేదా జీవితాంత నరకం . పదహేరేళ్లకే భర్తను కోల్పోయిన స్త్రీ, సమాజం వేసిన ముసుగులో , తెల్ల చీరతో జీవితాంతం ఎడారి బతుకును అనుభవించాల్సిన స్థితి .
ముదుసలి మొగుళ్ళ వ్యవస్థలో ఎన్ని కోట్ల మంది పుత్తడి బొమ్మ పూర్ణమ్మలో… . స్త్రీ పుట్టుకే- శాపం అనే స్థితి. పద్నాలుగో పదహేడులోనో మొదటి కాన్పు .. సరాసరిగా ఎనిమిది మంది సంతానం .. ఆంటే స్త్రీ గర్భిణిగా, బాలింతగా తన జీవితం లో ప్రైమ్ టైం గడిపేసేది . ముట్టు మొదలయినప్పటి నుంచి ముట్టుడిగే దాకా ఒకే వ్యాపకం – మెట్టింటి వంశోద్ధారకులను కనడం , పెంచడం . అదే ఆమె జీవితం .
ఎంత త్యాగం ?
త్యాగం అనడానికి కూడా లేదు . అప్పుడు మరో ఆప్షన్ లేదు . సమాజం అదే నమ్మింది . స్త్రీ జన్మకు అదే పరమార్థం అని నిర్దేశించింది . పుట్టినప్పటి నుంచి బాలికలకు అదే చెప్పింది . అలాగే పెంచింది . ప్రపంచం లోని అన్ని పురుషాధిక్య సమాజాల్లో కాస్త అటుగా ఇటుగా అదే స్థితి . ఎవరైనా ఏదయినా ప్రశ్నించినా, సమాజం సహించేది కాదు . మెట్టిల్లు వదిలి పుట్టింటి కి అమ్మాయి వస్తే ఆ కుటుంబానికి నరకం చూపేది . “చావైనా రేవైనా నీకు మెట్టిల్లే. మా పరువు తీయకు . నీకు పెళ్లి కావలసిన చెల్లెళ్లున్నారు ” అంటూ తల్లే మెట్టింటి ఆరళ్ళు తట్టు కోలేక తన గూటికి చేరిన కూతుర్ని బలవంతంగా నరకానికి నకలు – మెట్టింటికి సాగనంపేది.
వ్యక్తి ప్రపంచం ఇరుకయినప్పుడు బుద్ధులు కూడా అంతే ! వంటిల్లే తన ప్రపంచం గా వుండే స్త్రీలకు సంకుచిత మనస్తత్వం ఏర్పడిందంటే దానికి కారణం సమాజము లోని జెండర్ వ్యత్యాసాలు . ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో మాతృ వంశీయ , మాతృ స్థానిక సమాజాల్లో స్త్రీ బేసిక్ పర్సనాలిటీ పురుషాధిక్య సమాజాలకు పూర్తిగా బిన్నం . దీని బట్టే స్త్రీ పురుషుల మధ్య ఉన్న జైవిక వ్యతాసాలకు , సమాజం స్త్రీ పురుషుల మధ్య సంస్కృతీ పరంగా నిర్దేశించిన అంతరానికి మధ్య గల తేడా ను ఇట్టే అర్తం చేసుకోవచ్చు .
ప్రియుడితో కలిసి భర్తను కడదేర్చిన యువతి !
ప్రియుడి డైరెక్షన్ లో అత్తామామ- భర్త పై గృహహింస కేసు పెట్టి బ్లాక్ మెయిల్ చేసి కోట్లు కొట్టేసిన వివాహిత !
ఒకే సారి నలుగురి ప్రియులతో వ్యవహారం సాగిస్తున్న స్త్రీ !
విడాకుల కోర్ట్ ల్లో భారీగా పెరిగిన లిటిగేషన్ లు !
పెళ్లయిన ఏడాదికే మ్యూచువల్ డివోర్స్ లు తీసుకొంటున్న జంటలు కోకొల్లలు !
ఇవీ నేడు మీడియా లో తరచూ కనిపిస్తున్న / వినిపిస్తున్న వార్తలు ! జైంట్ వీల్ లో అర్ధ రౌండ్ వేసిందా ? నల్ల కాకి వార్త ఎలా అవుతుంది ? యు ట్యూబ్ కాలం లో తెల్ల కాకులదే ట్రెండింగ్! ఇప్పటికీ పురుషాధిక్య సమాజంలో …. ఇంకా బాగా చెప్పాలంటే, పురుషాధిక్య హ్యాంగ్ ఓవర్ లో ఉన్న సమాజం లో నలిగిపోతున్న పడతులెందరో ! కానీ …
ఒక ట్రెండ్ అయితే మొదలయ్యింది .. అది ఎక్కడి దాకా వెళ్లిందంటే భార్యా- బాధిత సంఘాలు పెట్టుకొనేదాకా ! వారు చేస్తే తప్పు . వీరు చేసినా తప్పే ! ఇన్నాళ్లు వారు చేసారు కాబట్టి .. ఇప్పుడు వీరు చేస్తే తప్పు కాదు . అది ప్రతీకారం ” ఆంటే? వితండవాదం అవుతుంది !
1990 తో మొదలెట్టి ప్రపంచాన్ని మల్టీ నేషనల్ కంపెనీ లు పాలిస్తున్నాయి. కరోనా మొదలుకొని వాక్సిన్ ల దాకా వారే మొత్తం సెట్ చేస్తారు . లాభాలు పిండుకోవడమే వారి ఏకైక లక్ష్యం . మద్యం , సిగరెట్లు .. సమాజం లోని సగం జనాభా కే పరిమితమైతే ఎలా ? లాభాలు పెంచుకోవాలంటే..? మానేజ్మెంట్ నిపుణులు రంగం లోకి దిగారు .
పబ్ .. యువతకు హాట్ స్పాట్ అయ్యింది . యువత జోష్ .. ట్రెండ్ ” ఆది వారం పుబ్బు గబ్బు ఫోటో లు సోమవారం సిటీ ఎడిషన్ సెంటర్ స్ప్రెడ్ లో . పైడ్ ప్రచారం పుణ్యమా అంటూ ఇప్పుడు కాలేజీ ల్లో తాగని అమ్మాయి ఎవరా? అని వెతుక్కోవలసిన స్థితి . అమ్మాయిలకు ఫ్రీ మందు పోస్తే తన వెంట వచ్చే నలుగురు కుర్రాళ్ళ బిల్ తో సెట్ అయిపోతుంది . అదీ ఐఐఎం మానేజ్మెంట్ ల మార్కెటింగ్ మాయాజాలం ! మగాడు తాగితే తాగు పోతు! మరి ఎత్తిన గ్లాస్ దించకుండా పబ్ లో నాలుగైదు షాట్స్ కొట్టే యువతి ని ఏమని పిలవాలో ?
భాషా దారిద్య్రం .. సమాజపు స్పీడ్ ను అందుకోలేని భాషాకోవిదులు .. పాత్రికేయులు నేడు. నలబై – యాభై లో మహిళా లోకం : ” మహిళలు కూడా మందు కొడతారా ! ?” ఇరవై ల్లో ఉన్న మహిళా లోకం . .. “కనీసం అడపాదడపా కూడా మందు కొట్టని అమ్మాయిలుంటారా ?” ఇదీ ముప్పై ఏళ్ళ సామాజిక ప్రగతి ! . తాగడం వరకేనా ? హుక్కా లు.. సిగరెట్ట్లు .. డ్రగ్స్ .. చివరిది ఇంకా తక్కువ స్థాయిలో .. పదేళ్లుగా మరో నిశ్శబ్ద పరిమాణం! .. దీన్ని గురించి రాసేవారుండరు .
సామాజిక పరిణామాల గురించి విశ్లేషణలు రాయాలంటే అంత సులభం కాదు . రాజకీయాలకు మసాలా అంటిస్తే సరి .. వార్తలే వార్తలు . ప్రయాసకోర్చి సామాజిక విశ్లేషణలెందుకు ? సంభోగం… ఇప్పడిది నయా తరం మహిళా ప్రపంచం లో ఇన్ ట్రెండ్ . “ఫోర్ మోర్ షాట్స్” వెబ్ సిరీస్ తో మొదలు .. పూర్తి స్థాయి సంభోగాల సైట్ దాక వెళ్ళింది .. వెళుతోంది . డిమాండ్ ఎంతుందంటే మహిళల కోసమే ప్రత్యేక వెబ్ సైట్ లు ..
కాల్పనిక ప్రపంచం ! అడ్డగుట్ట ను ఎవరెస్ట్ గా చూపుతుంది . .. దీనికి అడిక్ట్ అయిన స్త్రీ కి పడకగదిలో నిరాశే ! తాను వీడియో లో చూసిన దానికి, ఊహించుకున్న దానికి, ఇక్కడ వాస్తవంగా జరిగిన దానికి పోలికే లేదు ! . అక్కడేమో గంటలు గంటలు .. ఇక్కడేమో అయిదు నిముషాల్లో ముగించేస్తాడు భర్త ! ఛీ ! తనను సంతోషాల ఎవరెస్ట్ దాకా తీసుకెళ్లలేడా ?
ఇదీ నేడు సగటు పట్టణ యువతి ఆలోచన ! ఎవరెస్ట్ అనుకొంటే అడ్డగుట్ట అయ్యింది అనుకొనే నయా తరం భార్య ! ఫాంటసీ నుంచి ఫ్రష్ట్రేషన్ లోకి…. స్త్రీ కి కూడా కోరికలుంటాయి పడక గది కేవలం తన సుఖం కోసమే కాదు అని అర్థం చేసుకోలేని పురుషాధిక్య హ్యాంగ్ ఓవర్ మరియానా ట్రెంచ్ లో నయా తరం భర్త .. చివరకు మహిళా పోలీస్ స్టేషన్ లో తేలుతాడు. అదీ నేటి తరం లో లింగ పరమైన అంతరం ! మాట్లాడేవాడే లేడు ! ఇక సమస్యకు పరిష్కారం ఎక్కడ? ఇవి కాకుండా మరి కొన్ని కారణాలు … వెరసి కలిసి .. పెళ్లిళ్లు .. పెటాకులు .. గృహహింస కేసుల్లో భారీగా దండుకొంటూ మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది .. విడాకుల లాయర్ ల కు మంచి డిమాండ్ ! సమాజానికి పునాది కుటుంబం ! ఆది కూలిపోతే ?మిగిలేది స్మశానమే ! కానీ .. చెప్పేవాడెవ్వడు ? చెప్పినా వినేవాడెవ్వడు ! (ఈ వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే…)
Share this Article