మన షణ్ముఖ ప్రియపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాగుతూనే ఉంది… ఎక్కువగా నార్త్ ఇండియన్లే… ఒకవైపు యూనిక్ అని షణ్ముఖను మెచ్చుకుంటూనే, మెల్లిమెల్లిగా ఇండియన్ ఐడల్ జడ్జిలు సయాలీ, అరుణితను పైకి లేపుతున్నారు… నిజానికి ఈ షో, ఈ టీవీ, ఈ జడ్జిలు, ఈ పాటలు, ఈ ఆర్కెస్ట్రా, ఇతర స్టాఫ్ అంతా నార్తరన్ వాతావరణమే… సౌత్ ఇండియా పట్ల ఏదో తెలియని వివక్ష కనిపిస్తూ ఉంటుంది… అసలు ఇదే కాదు, బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, బ్యూరోక్రసీ, పాలిటిక్స్ ఎట్సెట్రా ప్రతి అంశంలోనూ… బాలీవుడ్ మ్యూజిక్ విషయానికి వస్తే… అప్పట్లో బాలసుబ్రహ్మణ్యాన్నే ద్రవడి, మద్రాసీ, సౌత్ యాస పేరిట మొదట్లో అడ్డుకున్నారు సంగీత దర్శకులు… తెలిసిందే కదా… ఐనా ఆ లెజెండ్‌ను ఆపలేకపోయారు… మన రేఖ, మన శ్రీదేవి, మన జయప్రద, మన హేమమాలిని, మన విద్యాబాలన్ ఎట్సెట్రా తారలు తప్ప మన సౌత్ నుంచి ఇంకేమీ వద్దు వాళ్లకు… మన సింగర్స్ అసలే వద్దు… మరి ఇండియన్ ఐడల్‌ను భిన్నంగా ఎలా చూడగలం..?
నిజంగా ఆ వాతావరణంలోనూ శ్రీరామచంద్ర, కారుణ్య, రేవంత్, రోహిత్ తదితరులు తమ మెరిట్ చూపించి, మెప్పించి… విజేతలుగానో, ఫైనలిస్టులుగానో నిలిచారు… అది విశేషమే… ఈ యాసల గొడవల్లేవ్, ఆ వేదికను దున్నిపారేశారు… కానీ ఫిమేల్ సింగర్స్ ఎందుకు ఇలాంటి జాతీయ వేదికలపై మెరవడం లేదు..? ఈ సీజన్‌లో శిరీష భాగవతుల, షణ్ముఖప్రియ ఇద్దరూ చేరారు, శిరీషలో మెరిట్ ఉన్నా దురదృష్టవశాత్తూ ఎలిమినేట్ అయిపోయింది… ఈసారి పోటీ చాలా టఫ్‌గానే ఉంది… మరి 11 సీజన్లలో ఒక్క తెలుగు ఫిమేల్ సింగర్ పోటీపడలేదు ఎందుకు..? ఆసక్తి లేదా..? ఆ శక్తి లేదా..? ఆడిషన్లలోనే విఫలమై వెనక్కి వచ్చేశారా..? ఎందుకు..? ఎక్కడ వైఫల్యం..? ఇదొక చిక్కు ప్రశ్నే… మనవాళ్లకు శ్రావ్యమైన గొంతుల్లేవా..? సంగీతజ్ఞానం లేదా..? సినిమాల్లోనూ, వేదికలపైనా బొచ్చెడు పాటలు పాడిన అనుభవం ఉన్నవాళ్లూ ఉన్నారు కదా… మరి ఎక్కడ ఆగిపోయారు..? ఎవరెవరో ఈశాన్య రాష్ట్రాల సింగర్స్ కూడా ప్రతిభ ప్రదర్శిస్తున్న జాతీయ పోటీవేదికల మీద మనవాళ్లను ఆపుతున్నది ఏమిటి..? సినిమాల్లో పాటల చాన్సులు, విదేశీ టూర్ల చాన్సులు, స్వరాభిషేకాలు, జిల్లాల్లో టూర్లతో ఇక చాల్లే అని సాధన ఆపేస్తున్నారా..? అప్‌డేట్ కాలేకపోతున్నారా..?
Ads
సునీత, పూర్ణిమ, కౌసల్య వంటి సీనియర్ల మాటెలా ఉన్నా… ప్రత్యేకించి రమ్య బెహరా, మాళవిక వంటి కాస్త ఎక్కువ మెరిట్ ఉన్నట్టుగా కనిపించే సింగర్స్ ఎక్కడ ఆగిపోయారు..? నిత్యసంతోషిణి వంటి సింగర్స్ ఏమైపోయారు..? ఇక్కడ ఒక కేరక్టర్ గురించి చెప్పుకోవాలి… కల్పన… మన కల్పన ఇలాంటి పిల్ల కాలువలెన్నో ఈదేసిన దిట్ట… సాధన, స్వరజ్ఞానం, సంకల్పం, స్టేజ్ ప్రజెన్స్, వాయిస్ వేరియేషన్స్, భావవ్యక్తీకరణ ఎట్సెట్రా ఏ అంశమైనా సరే, కల్పన తనేమిటో చూపించగలిగేది… కానీ ఈ ఐడల్ షోలు ఇప్పటివి కదా, ఆమె పాతబడిపోయింది… ఇప్పుడు షణ్ముఖ ప్రియలో ఒక కల్పన కనిపిస్తోంది… కాదు, ఇద్దరు ముగ్గురు కల్పనలు కలిసి కనిపిస్తున్నారు… మోడరన్, క్లాసిక్ ఫ్యూజన్ దగ్గర్నుంచి… వాయిస్ వేరియేషన్స్, యోడిలింగ్, జాజ్, రాక్, పాప్, మెలొడీ, మాస్… ఏదైనా సరే దున్నేస్తోంది… ఈ మిక్స్‌డ్ టాలెంట్ వేరే సింగర్లలో లేదు… తను చాలా చిన్నప్పటి నుంచే పాడుతోంది… ఎయిర్‌టెల్ సూపర్ సింగర్ పోటీల్లో ఇదే కల్పన టీంలో ఉండేది బహుశా… అయితే… ఇంగ్లిష్‌లో తప్పుల్లేకుండా, సరైన ఉచ్ఛరణతో ధారాళంగా మాట్లాడాలంటే, ఇంగ్లిషులోనో ఆలోచిస్తూ, ఇంగ్లిషులోనే మాట్లాడుతూ ఉండాలి అంటారు స్పోకెన్ ఇంగ్లిష్ ట్యూటర్లు… ఈ హిందీ పాటలూ అంతే… షణ్ముఖ హిందీలో అలా మునిగిపోయింది, సాధన చేసింది… అందుకే నార్తరన్ సింగర్స్‌కన్నా హిందీని అలా అలవోకగా ఆలపించగలుగుతోంది… బట్, టీవీ షోలు అంటేనే బోలెడు రాజకీయాలు… గెలుపో ఓటమో జానేదేవ్… షణ్ముఖ ఈజ్ షణ్ముఖ… దట్సాల్…!!
Share this Article