.
అవును, సగటు ప్రేక్షకుడి మదిని తొలిచే ప్రశ్నలే కోర్టు కూడా వేస్తోంది… 1) అంతలేసి బడ్జెట్లతో ఎవరు తీయమన్నారు సినిమాలు మిమ్మల్ని..? 2) ఓజీ వంటి చిత్రాలతో జనానికి ఒరిగేదేముంది..?
3) మీ ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసి, ప్రజలే వందలకు వందలు పెట్టి టికెట్లు కొనాలంటే ఎలా..? 4) బెనిఫిట్ షోల పరమార్థం ఏమిటి..? అనాథలకు ఏమైనా ఆసరా ఇస్తున్నారా..? 5) ఎగ్జిబిటర్లకు లాభాల కోసం ఈ ప్రభుత్వ నిర్ణయాలా..?
Ads
… నో, నో… బెనిఫిట్ షోలకు అడ్డగోలు రేట్లు, తరువాత కూడా టికెట్ రేట్ల పెంపు చెల్లకూడదు అంటోంది కదా కోర్టు… బాగుంది, ఆహ్వానిద్దాం… ఓజీ మాత్రమే కాదు, అసలు ఈ బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపు ప్రభుత్వ విధానాలపైనే హైకోర్టు ఈ విచారణను విస్తరించాలని ఆకాంక్షిద్దాం…
మనం పదే పదే చెప్పుకుంటున్నదే… సినిమా అనేది ఓ వ్యాపారం… ఎంత వీలైతే అంత దండుకుందామనే వ్యాపారి ఆశిస్తాడు… కానీ ప్రభుత్వం ఎందుకు సహకరించాలి దానికి..? సరుకు బాగుంటే ప్రేక్షకుడు ఆదరిస్తాడు, లేకపోతే తిరస్కరిస్తాడు… అది వ్యాపారి రిస్క్… ఆ వ్యాపారి పెట్టే పెట్టుబడికి ప్రభుత్వం ఏమైనా పూచీకత్తు పడాలా..?
ఇలా ఇష్టానుసారం రేట్లను పెంచుకుంటూ పోతే ఇక ప్రభుత్వ నియంత్రణ ఏమున్నట్టు..? అసలు టికెట్ రేట్ల పెంపుకు సమర్థన ఉందా..? నిర్మాతలు చెప్పే వందల కోట్ల లెక్కలు ఆడిటెడ్ కాదు కదా, మరి ఈ ఖర్చులను ఎవరు నిర్దారిస్తున్నారు..? ఇవన్నీ ప్రశ్నలే… ఇవే ఖర్చుల్ని ఐటీకి చూపిస్తున్నారా..?
వీటికితోడు మరో బెడద… ఈ బెనిఫిట్ షోల టికెట్లను కూడా బ్లాకులో అమ్ముకోవడం, మరీ కొన్నిచోట్ల వేలం వేయడం… ఈ వేలంవెర్రిని సమాజం అంగీకరించాలా..? అసలు ఈ బెనిఫిట్ షోల ఆదాయమంతా జీఎస్టీ లెక్కల్లోకి వస్తుందా..?
ఇవేకాదు, హైకోర్టు తన దృష్టిని మరింత విస్తరించి… ఈ ప్రిరిలీజ్ ఫంక్షన్లకు అనుమతులనూ విచారిస్తే ప్రజలకు మరింత మేలు… వాళ్ల సినిమా వ్యాపారం ప్రమోషన్ కోసం మీటింగులు పెడితే… జనానికి అవస్థలు… ట్రాఫిక్ ఆంక్షలు… చినుకుపడితే చాలు గంటల కొద్దీ ట్రాఫిక్ ఆగిపోయి, నగరమే స్థంభించిపోతున్న ఈ రోజుల్లో ఈ ప్రిరిలీజ్ ఫంక్షన్లు, ట్రాఫిక్ ఆంక్షలు దుర్మార్గం కాదా..?
తీరా ఆ ఫంక్షన్లలో ఏముంటుంది..? పరస్పర పొగడ్తలు, అభినందనలు, హీరోల పాదసేవనాలు… ఒకరకంగా ఇది వ్యక్తి పూజల్ని మరింత ప్రమోట్ చేయడమే… పోనీ, ఈ సినిమాల తీరు ఏమిటి..? రక్తపాతాలు, హింస, రప్పారప్పా నరికివేతలు, శవాలు… నెగెటివిటీని స్ప్రెడ్ చేసేలా అనైతిక, అసాంఘిక పోకడలను హీరోయిజంగా గ్లోరిఫై చేయడం, అదీ సమాజానికి హాని చేయడమే…
అవును, ఒక్క ఓజీ మాత్రమే కాదు, స్థూలంగా ఈ అంశాలపై, సర్కారు పాలసీలనే న్యాయస్థానం సమీక్షిస్తే అది తప్పకుండా ప్రజాప్రయోజనకరం..! మరిచేపోయాను… థియేటర్లలో క్యాంటీన్లలో ధరలు మరో అరాచకం..! చివరకు మంచినీళ్ల సీసాను కూడా బయటి నుంచి తీసుకురాకుండా అడ్డుకోవడం అంటే దోచుకోవడమే..! ఏపీలోనూ ఇలాంటి కేసు పడి, విచారణ జరిగితే ఎంత బాగుణ్ను..!!
Share this Article