…… By….. Vanaja C……. చిన్న పొరపాటు – పెద్దమూల్యం….. దాదాపు నయం అయిందనుకున్న రవీందర్ కార్డియాక్ అరెస్ట్ తో పోవటంతో ఏం జరిగి ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తే అనుమానించిందే నిజం అయింది. ఆక్సిజన్ మీద ఉన్న రవీందర్ ఆ ఉదయం జావ కోసం మాస్క్ తీశాడు. జావ తాగటానికి 15 నిమిషాలు పట్టింది. అంతసేపూ మాస్క్ లేకుండా ఉన్నాడు. ఏదన్నా తినగానే శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. అసలు తినటానికయినా సరే అంత సేపు మాస్క్ తీసి ఉంచకూడదు. సపోర్ట్ తియ్యటం వల్ల పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్ తో పాటు తినడం వల్ల మరింత ఆక్సిజన్ అవసరం అయిన స్థితిలో అతను బాత్ రూంకి వెళ్ళాడు. అది మరో ఐదు నిమిషాలు. అందుకోసం నడవడం, కూర్చోవడం, లేవటంతో ఆక్సిజన్ లెవల్స్ విపరీతంగా పడిపోయి ఉండాలి. ఆ స్థితిలో అతనికి కార్డియాక్ అరెస్ట్ అయింది.
విజయవాడలో టీవీ గారి సహచరి అరుణక్క ఆక్సిజన్ తీసేసి బాత్రూంకి వెళ్ళి 20 నిమిషాలైనా రాకపోతే టీవిగారు కేకలేస్తే వెళ్ళి చూస్తే పడిపోయిఉన్నారట. తనకీ కార్డియాక్ అరెస్ట్. కరోనా వచ్చాక రోజూ వాడే ఇండియన్ టాయ్లెట్ కే వెళ్లి లేవలేక అక్కడే ఐదు నిమిషాలు పడిపోయి ఉన్నప్పుడు గానీ మహబూబ్ నగర్ రాఘవచారికి ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్న విషయం తెలియలేదు. బహుశా వాష్ రూం యాక్టివిటీకి ఆక్సిజన్ అవసరం ఎక్కుఉండొచ్చు. హాస్పిటలైజ్ అయ్యాక ఆక్సిజన్ తీసేసి వాష్ రూంకి పోయి కార్టియాక్ అరెస్ట్ అయి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉండి ఉంటారో. అటెండెంట్ ను కూడా రానివ్వని చోట కార్డియాక్ అరెస్టు కు మందు ఏం జరిగిందో బయటకెలా తెలుస్తుంది. నిజానికి ఇవి ఆపగలిగిన మరణాలు.
Ads
చాలామంది కోవిడ్ పుణ్యమా అని మొదటిసారి ఆక్సిజన్ బెడ్లు, ఐసీయు బెడ్లు ఎక్కారు. కాబట్టి అట్లా ఆక్సిజన్ తియ్యకూడదనీ, తీసి వాష్ రూంకి వెళ్ళకూడదనీ చాలామందికి తెలియదు నాతో సహా. కానీ హాస్పిటళ్లలో కూడా ఎవరూ ఈ జాగ్రత్తలు చెప్పినట్లు లేరు. దాంతో చాలామందే ఈ చిన్న పొరపాటు చేసి పెద్ద మూల్యం చెల్లించారు. నేను కూడా తెలియక ఆక్సిజన్ తీసేసి వాష్ రూంకి వెళ్తే ఆక్సిజన్ లెవల్స్ 70 కంటే కిందకి పడిపోయాయి. ఇట్లా పడి పోయామని చెప్తే అప్పుడు చెప్పారు డైపర్లు, బెడ్ పాన్ లు వాడాలని, ఆక్సిజన్ తియ్యకూడదని. ఆక్సిజన్ డిపెండెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు తినడానికి కూడా ఆక్సిజన్ తియ్యకూడదు. కనీసం నోస్ పాంగ్స్ పెట్టుకుని తినాలి. కానీ అంత జాగ్రత్తలు ఎవరూ పాటిస్తున్నట్లు లేరు.
పెద్ద పెద్ద కార్పోరేట్ హాస్పిటళ్లలో కూడా ఈ జాగ్రత్తలు చెప్పట్లేదు, పాటించట్లేదు. డానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు బాత్రూంకి వెళ్లి ఆక్సిజన్ లెవల్స్ విపరీతంగా పడిపోయాయని అజిత చెప్పినప్పుడు డైపర్లు వెయ్యమని, కమోడ్ చెయిర్ ఉందేమో కనుక్కోమని నేను చెప్పేదాకా తనకు అక్కడ ఎవరూ ఆ జాగ్రత్తలు చెప్పలేదు. బెడ్ పాన్ వాడడం పాత మోటు పద్దతి. కమోడ్ చెయిర్ కొంత నయం. రోజుకు 70 వేలు వసూలు చేసిన కార్పోరేట్ హాస్పిటల్ లో వార్డు మొత్తానికి ఒకటే కమోడ్ చెయిర్ ఉందట. ఆ నాలుగు రోజులూ ఉన్న ఒక్క కమోడ్ చెయిర్ కోసం అటెండెంట్ల మధ్య గొడవలు. ఇంతా చేస్తే చాలా మంచి కమోడ్ చెయిర్ కూడా మూడున్నర వేలే. నేను ఉన్న నిమ్స్ లో కూడా అవి లేవు. RICU లొ మాత్రం ఒకటి ఉంది. అది ఇంచార్జిగా ఉన్న డాక్టర్ పద్మజ పర్సనల్ గా తెప్పించి పెట్టారు. అక్కడ నుంచి డిస్చార్జి అయిన వెంటనే నేను చేసిన మొదటి పని ఆ వార్డుకి ఇంకో కమోడ్ చెయిర్ కొనివ్వడం.
రెండో వేవ్ తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా చాలామందే ఆక్సిజన్ బెడ్లమీద, ICU బెడ్ల మీద ఉన్నారు. మూడో వేవ్ వస్తే మళ్ళీ ఎంతమంది ఆ బెడ్లు ఎక్కుతారో తెలియదు. కాబట్టి ఎవరికికైనా తెలిసిన వాళ్ళు ఆ పరిస్థితిలో ఉంటే అడగకపోయినా చెప్పండి. తినడానికి ఆక్సిజన్ తియ్యాల్సి వస్తే ఎక్కువ సేపు తియ్యొద్దని. తీస్తే వెంటనే పెట్టుకోమని. డైపర్లు వాడి వాష్ రూంకి వెళ్ళటం తగ్గించమని. ఆక్సిజన్ తీసేసి వాష్ రూంకి వెళ్లొచ్చో లేదో డాక్టర్ను అడగకుండా అసలు వెళ్లొద్దని. కనీసం కొన్ని ప్రాణాలయినా కాపాడిన వాళ్లమవుతాం….
Share this Article