ప్రతిసారీ పండుగల మీద వివాదాలు ఎందుకు తలెత్తుతున్నాయి..? ఎందుకు పండితులు వేర్వేరు అభిప్రాయాలు, లెక్కలతో ప్రజల్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నారు… అసలు గ్రహస్థితుల గమనం మీద మనకంటూ ఓ ఏకీకృత గణన ఎందుకు కరువైంది..? పండుగలకు ప్రామాణికంగా తీసుకోవాల్సిన తిథుల విషయంలో ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి… వచ్చే దసరా ఎప్పుడు అనే విషయంలో తాజాగా మరో వివాదం… తలా ఓ లెక్క… ఈ స్థితిలో, ఈ నేపథ్యంలో ఓసారి లోతుగా ఈ గణన పద్ధతుల్లోకి వెళ్దాం… (ఇది పండుగలు, తిథులు, గ్రహగతులను నమ్మేవారి కోసం మాత్రమే…)
ఖగోళం మనిషికి ఎప్పుడు ఆసక్తి కలిగించే అంశమే… పగలు సూర్యుడి వెలుగు కారణంగా కనిపించని నక్షత్రాలు, గ్రహాలు రాత్రయ్యే సరికి మిణుకు, మిణుకుమంటూ కనిపిస్తుండే సరికి మనిషికి ఆకాశం మీద ఆసక్తి పెరగడం ప్రారంభమైంది… అలా ప్రతి రోజు పరిశీలిస్తూండగా అవన్నీ కూడా ఒక క్రమపద్ధతిలో ఆకాశంలో సంచరిస్తున్నాయనే విషయం అర్ధం చేసుకున్నాడు మనిషి…
క్రమంగా ఈ పరిశీలన ఒక శాస్త్రంగా మారింది. ఆకాశంలో సంచరించే వాటిల్లో కొన్ని గ్రహాలుగా, మరికొన్ని ఉపగ్రహాలుగా, ఇంకొన్ని నక్షత్రాలుగా గుర్తించాడు… వీటిలో గ్రహాలు మరియు ఉపగ్రహాలు ఒక క్రమపద్ధతిలో ప్రతి రోజు కొంతదూరం సంచరిస్తున్నాయని విషయాన్ని గమనించి, ఒక్కో గ్రహం ఒక్కో వేగంతో సంచరిస్తున్నాయనే విషయాన్ని అర్ధం చేసుకున్నాడు… ఆ తర్వాత కాలంలో పూర్వీకుల ఖగోళ విజ్ఞానాన్ని తర్వాత తరాలకు అందించడం కొరకు సిద్ధాంత రూపంలో పుస్తకాలుగా రాయటం ప్రారంభించారు.
Ads
ఈ సిద్ధాంత గ్రంథాలు ఆకాశాన్ని చూడకుండా ఆయా గ్రహాలు యే సమయంలో ఏ రాశి, నక్షత్రాల్లో ఉంటాయో తెలిపే గణిత సూత్రాలు రూపొందించారు. సూర్య సిద్ధాంతం మొదలైన ఈ గ్రంథాలు గ్రహ గమనాలు మరియు ఇతర ఖగోళ విశేషాల్ని లెక్కించడానికి ఉపయోగపడతాయి. అయితే వారు కేవలం ఈ సిద్ధాంత గ్రంథాల్లో ఇచ్చిన గణితాన్ని యథాతథంగా స్వీకరించకుండా ఆయా సమయాల్లో ఖగోళ పరిశీలన కావించి గ్రహ గణితంలో కాలానుగుణంగా సవరణలు చేయాల్సిందిగా చెప్పారు.
ఈ సిద్ధాంత గ్రంధాలు మరింత అర్థమయ్యేలా మరియు గ్రహ గణితం సులువుగా చేసుకునేలా తర్వాతి కాలంలో కరణ గ్రంథాలు రాయబడ్డాయి. ప్రస్తుతం వాడుకలో ఉన్న పంచాంగ గణనకు మూలం ఈ సిద్ధాంత మరియు కరణ గ్రంథాలే. కాలక్రమంలో పూర్వీకులు చెప్పిన ఖగోళ పరిశీలన అనే అంశాన్ని పక్కన పెట్టి కేవలం గ్రంథాల ఆధారంగా చేసే రాసే పంచాంగాలను పూర్వ పద్ధతి పంచాంగాలుగా, ఖగోళంలో ఉండే గ్రహ గమనం ఆధారంగా ఎప్పటికప్పుడు సవరణలు చేస్తూ రాసే పంచాంగాలను దృక్ గణిత పంచాంగాలుగా పిలవటం జరుగుతున్నది.
పూర్వ పద్ధతి మరియు దృక్ పద్ధతిలో రాసిన పంచాంగాలు ఒకప్పుడు ఒకేలా ఉన్నప్పటికీ కాలక్రమంలో పూర్వ పద్ధతి గణితంలో సంస్కారాలు చేయకపోవడం వలన ఆ గణిత పంచాంగాలకు మరియు దృగ్గణిత పంచాంగాలకు తిధి, నక్షత్రాది సమయాలలో, గ్రహస్ఫుటములో తేడా ఏర్పడటం ఆరంభమయ్యింది.
గతంలో జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు దసరా పండుగ నిర్ణయం విషయంలో విభేదాలు రావడంతో ఆయన భారత దేశమంతటా ఒకే విధమైన శాస్త్రీయ పద్ధతి ఉండాలని ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ భారతదేశంలోని పంచాంగ కర్తలతో చర్చించి దృగ్గణితమే సరైనదని, దాన్నే అందరూ పాటించాలని నిర్ణయించారు. ఆ నిర్ణయంతో ఏకీభవించని కొందరు పూర్వపద్ధతినే పాటిస్తూ పంచాంగాలు రాయటం జరుగుతున్నది…
అయితే ఉత్తర భారత దేశంలో ఎక్కువ శాతం మంది దృగ్గణిత ఆధార పంచాంగాలు రాయటం, దక్షిణ భారత దేశానికి వచ్చే సరికి పూర్వ పద్ధతి మరియు దృక్పద్ధతిలో పంచాంగాలు రాయటం జరుగుతున్నది. దీని కారణంగా ప్రతిసారి పండగల విషయంలో దేశమంతా ఒక తోవ అయితే పూర్వపద్ధతి వారిది ఒక తోవ అవుతున్నది…
వీరు చేసే గణితం ద్వారా దృగ్గోచరమయ్యే గ్రహణ గణితం సరిగా రాదు కాబట్టి గ్రహణ గణితానికి వారు దృక్పద్ధతిని వాడతారు. మిగతా పంచాంగ గణితమంతా పూర్వ పద్ధతిలో చేస్తారు. దేశ మంతటా దృక్పద్ధతి వాడే వారు అధికంగా ఉండటం, జాతక ఫలితాల్లో కూడా దృక్పద్ధతిలో గణించిన జాతకం సరైన ఫలితాలు ఇవ్వటం వలన ఈ పద్ధతిని అనుసరించే వారు పెరుగుతున్నారు…
తిథి గణనలో తేడా ఎందుకు వస్తోంది…
తిథి అంటే సూర్య, చంద్రుల మధ్య ఉండే దూరం. సూర్యుడు చంద్రుడు ఒకే డిగ్రీ పైన ఉంటే అమావాస్య అవుతుంది. 180 డిగ్రీల దూరం ఉన్నప్పుడు పూర్ణిమ అవుతుంది. ఇది పాశ్చాత్యులు వాడే సాయన పద్ధతిలో అయినా, భారతీయులు వాడే నిరయణ పద్ధతిలో అయినా ఒకేలా ఉంటుంది.
దృగ్గణిత ఆధారంగా లెక్కించే తిథులు నాసా ఎఫిమరీస్ గానీ, లేదా భారత దేశం ప్రచురించే రాష్ట్రీయ పంచాంగంతో కానీ సరిపోలుతాయి. కానీ, పూర్వ పద్ధతి ద్వారా గణించే తిథులు వీటితో కలవక పోవటం వలన ప్రతిసారి పండగలకు, శ్రాద్ధాది పితృకార్యాలకు, వ్రతాలకు, నోములకు సమస్యగా మారుతున్నది.
గ్రహగణిత ప్రాథమిక సూత్రమైన దృగ్గోచరమైన ఖగోళ గ్రహ స్థితితో గణితం సరిపోవాలన్న విషయాన్ని పూర్వ పద్ధతిలో పూర్తిగా విసర్జించటం వలన లేదా వదిలేయడం వల్ల ఈ గణితం యొక్క శాస్త్రీయత ప్రశ్నార్థక మవుతున్నది. ఈ పంచాంగాల ద్వారా పండగలు నిర్ణయించకుండా దేశమంతటా గతంలో ఉన్నవిధంగా ఒకే విధానాన్ని అమలు చేయాలని ప్రజలందరి కోరిక… దేశమంతా ప్రామాణికంగా తీసుకునే పద్ధతినే మనం ఎందుకు స్వీకరించకూడదు..?! (ఈ విశ్లేషణ, ఈ వివరణలతో విభేదించేవాళ్లూ ఉండొచ్చు… కానీ ఈ సందిగ్ధతలకు తెరవేయాలంటే శాస్త్రోక్తమైన ఓ చర్చ అవసరం… ఈ ప్రయత్నం అదే…)
Share this Article