ఒకడు మొదలుపెడతాడు… మిగతావాళ్లంతా పొలోమంటూ పరుగు తీస్తారు… మీడియాలో ఇది మరీ ఎక్కువ… ఎవడైనా బ్రేకింగ్ అని స్క్రోలింగో, ప్లేటో వేశాడంటే, ఇంకేముంది, నిజానిజాలు తరువాత చూద్దాంలే అనుకుని మిగతావాళ్లూ కుమ్మేస్తారు… ఏ ఏజెన్సీవాడో ఏదైనా వార్త పంపిస్తే అందరూ కళ్లు మూసేసుకుని అచ్చేస్తారు… నిన్నా, మొన్నా జాతీయ జెండా మీద రాయబడిన అనేకానేక కథనాలు చూస్తే కాస్త ఆశ్చర్యమేసింది… ఎందుకంటే..? ఈ కథనాలకు సందర్భం ఏమిటి..? సిగ్నిఫికెన్స్ ఏమిటి..? ‘‘మన జాతీయ జెండా రూపొందించిన పింగళి వెంకయ్య సరిగ్గా వందేళ్ల క్రితం ఈ జెండాను గాంధీకి సమర్పించెను… కనుక ఇది వందేళ్ల పండుగ’’ అని ఈ వార్తా కథనాలకు ఓ సమర్థన… నిజాలు రాస్తేనేమో నిష్ఠురం, జాతిద్రోహం, తెలుగుద్రోహం, జాతీయద్రోహం… ఐనా నిజమే చెప్పుకుందాం…
చూశారు కదా… 1921, మార్చి 31న విజయవాడలో అప్పటి కాంగ్రెస్ అత్యున్నత కమిటీల భేటీలు జరుగుతున్నాయి… భారత స్వాతంత్య్ర సమరానికి ఓ పతాకం అవసరమనీ, ఆ జెండా కిందే దేశమంతా పోరాడాలనీ అప్పటికే కాంగ్రెస్ అనుకుంది… పింగళి వెంకయ్య గురించి అప్పటికే విని ఉన్నందున ఈ విజయవాడ భేటీల సందర్భంగా, అర్జెంటుగా ఓ పతాకాన్ని సమర్పించాలని కాంగ్రెస్ వెంకయ్యను కోరింది… ఆయన గంటల్లోనే ఓ నమూనా తీసుకెళ్లి సమర్పించాడు… పైన బొమ్మలో చూడండి… ఆయన సమర్పించిన జెండాలో పైన తెలుపు రంగు, మధ్యలో ఆకుపచ్చ రంగు, దిగువన ఎర్రరంగు… మధ్యలో రాట్నం… ఇదొక నమూనా మాత్రమే… దాన్ని యథాతథంగా సమరపతాకంగా కాంగ్రెస్ స్వీకరించలేదు… గాంధీ కూడా తిరస్కరించాడు… తరువాత పలు వివాదాల నేపథ్యంలో అనేక మల్లగుల్లాలు పడి, పార్టీ తరఫున ఓ ఫ్లాగ్ కమిటీ వేసి, దానికి పలు మార్పులు చేసి… చివరకు 1931లో ఎఐసీసీ ఓ జెండాను ఆమోదించింది… అందులో పైన కాషాయం, మధ్యలో తెలుపు, దిగువన ఆకుపచ్చ… మధ్యలో రాట్నం… కాషాయం హిందూ, హరితం ముస్లిం, తెలుపు క్రిస్టియానిటీలకు ప్రతీకలుగా తీసుకున్నారు… రాట్నం గాంధీయమార్గంలో సమరానికీ, స్వదేశీ నినాదానికి అనుగుణంగా తీసుకోబడింది…
Ads
కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే… అది స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ఒక రాజకీయ పార్టీ జెండా… అంతేతప్ప అది జాతీయ పతాకం కాదు… పార్టీ పతాకానికీ, జాతీయ పతాకానికీ అసలు లింకే లేదు… జాతీయ పతాకాన్ని ప్రకటించాల్సింది దేశం… పార్టీ కాదు… స్వాతంత్య్రం వచ్చాక ఏర్పాటు చేసుకున్న భారత రాజ్యాంగ పరిషత్ 1947 జూలైలో ఈ మూడు రంగుల జెండాను యథాతథంగా తీసుకుని, రాట్నం గుర్తు బదులు అశోకుడి ధర్మచక్రాన్ని పెట్టి ఆమోదించింది… ఆగస్టు 15న ఎగిరిన స్వరాజ్య జెండా కూడా అదే… అంతేతప్ప పింగళి రూపొందించిన జెండాకూ, జాతీయ జెండాకూ పోలికే లేదు… ఆయన తొలుత ప్రతిపాదించిన నమూనా యథాతథంగా పార్టీ పతాకంగా కూడా ఆమోదింపబడలేదు… మరిక జాతీయ జెండాకు వందేళ్ల పండుగ ఏమిటి..? ఈ ప్రత్యేక కథనాలు ఏమిటి..? రాసుకోడంలో తప్పులేదు, కానీ ఇప్పుడు జాతీయ పతాకానికి వందేళ్ల పండుగ అనడంలోనే తప్పుంది… (స్వరాజ్య పోరాటం కోసం మాత్రమే ఏర్పడిన పార్టీ కాబట్టి, స్వరాజ్యం రాగానే ఆ పార్టీ వద్దు, ఆ జెండా వద్దు అన్నాడు గాంధీ… ఇదుగో ఇలాంటి సందిగ్ధతలు ఊహించి… కానీ కాంగ్రెస్ పెద్దలు అంగీకరించకుండా, ఆ పార్టీని కొనసాగించారు, ఆ జెండా రంగులను ఉంచేసుకున్నారు… కాకపోతే అశోకచక్రాన్ని తీసేశారు… తమ ఎన్నికల గుర్తును పెట్టుకున్నారు…) #NationalFlag
Share this Article