పరవశాన్నిచ్చే పైరగాలి సైతం పరవశించే పాటల కంపోజిషన్.. త్రీ జనరేషన్స్ ను మెప్పించి.. 70కు పైగా సినిమాల్లో 500కు పైగా పాటలకు ట్యూన్స్ కట్టిన దిగ్గజ సంగీత దర్శకత్వం.. ఓపీ నయ్యర్. దశాబ్దాల కాలం పాటు హిందీ భారతీయ భాషలన్నింటిలో పాడి.. హిందీ సినిమాను శాసించిన గాత్రం లతా మంగేష్కర్. అయితే, వీరిద్దరూ సంగీతం విషయంలో ఎక్కడా ఒకరికొకరు తారసపడకపోవడం విశేషం. ఓపీ నయ్యర్ సంగీత దర్శకత్వం వహించిన ఏ సినిమాలోనూ… ఇండియన్ నైటింగెల్ గా పిల్చుకునే లతాజీ పాట లేకపోవడం అబ్బురం. 1950 నుంచీ 60 వరకూ ఆ ఇద్దరూ పీక్ లో ఉన్న సమయంలోనూ ఓపీ నయ్యర్ సంగీత దర్శకత్వం వహించిన ఒక్క పాట కూడా లత పాడలేదు. మరెందుకలా జరిగింది..?
ఒక మ్యుజీషియన్ తన సంగీతంతో మెజీషియన్ గా కూడా మారితే ఆ వండర్ ఓపీ నయ్యర్. సంగీతంలో ఏ విధమైన శిక్షణా తీసుకోకపోయినా.. అద్భుతమైన బాణీలను అలవోకగా కట్టి మన్ననలందుకున్నారు. కనీసం ఓపీ నయ్యర్ ఇంట్లో కూడా ఎవ్వరూ సంగీతంతో అటాచ్ మెంట్ ఉన్నవాళ్లు కారు. లాయర్లు, డాక్టర్ల కుటుంబమది. లాహోర్ లో పుట్టిన ఓంకార్ ప్రసాద్ నయ్యర్ కు గురుదత్ సినిమా బాజ్ లో అవకాశం దక్కింది. కానీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఆ తర్వాత ఓరోజు ఆ సినిమాకు సంగీతం వహించిన నయ్యర్.. గురుదత్ దగ్గరకు వెళ్లి తనకివ్వాల్సిన డబ్బుల గురించి అడగ్గా.. ఇప్పుడా డబ్బు తానివ్వలేనని.. కానీ, తాను చేయబోయే నెక్స్ట్ మూడు సినిమాలకు సంగీత దర్శకత్వం అవకాశం ఇచ్చి.. ఆ తర్వాత మొత్తం డబ్బులు చెల్లిస్తానన్నారట గురుదత్.
ఆ తర్వాత ఆర్ పార్, మిస్టర్ అండ్ మిసెస్ 55, సీఐడీ సినిమాలకు సంగీత దర్శకుడిగా ఓపీ నయ్యరే సంగీత దర్శకుడు కావడం.. అవి కాస్తా బ్లాక్ బస్టర్స్ గా సంచలనం సృష్టించడం.. ఆర్ పార్ లో సున్ సున్ జాలిమా, బాబూజీ ధీరే చల్నా వంటి పాటలు రికార్డులు కొల్లగొట్టడం.. ఆ తర్వాత నౌషాద్, రోషన్, శంకర్ జైకిషన్, మదన్ మోహన్ వంటివారిని తట్టుకుని చిత్రపరిశ్రమలో నిలదొక్కుకోవడం వంటి ఓపీ నయ్యర్ హిస్టరీ చాలామందికి తెలిసిందే. నయ్యర్ ఆస్థాన గాయకుల్లో మహ్మద్ రఫీ, గీతాదత్, శంషాద్ బేగం, ఆశాభోంస్లేలను ప్రధానంగా చెప్పుకోవాలి.
Ads
అయితే, లత చెల్లెలైన ఆశాభోంస్లేతో ఎన్నో పాటలు పాడించిన ఓపీ నయ్యర్.. మరి గానకొకిలగా యావత్ దేశం గుర్తించిన లతాజీతో ఎందుకు పాడించలేదన్నదే కదా అసలు టాపిక్..? ఇద్దరూ సంగీత రంగంలోనే తమ తమ విభాగాల్లో లెజెండ్స్ గా ఎదిగినా.. మరెందుకు వారిద్దరూ అవకాశాలున్నా కలిసి పనిచేయలేకపోయారు..? ఈ ప్రశ్నలు చాలాసార్లే లత, ఓపీ నయ్యర్ ఇద్దరికీ ఎదురయ్యాయి. అయితే, ఓపీ నయ్యర్ ను పలువురు పలుమార్లు అడిగిన ప్రతీసారీ.. లతాజీ చాలా అద్భుతమైన గాయని.. కానీ, తన ట్యూన్స్ కు తాననుకున్న విధంగా తన ఏ పాటకూ ఆమె గొంతు నప్పుతుందని తాను భావించలేకపోయానని… అందుకే లతతో పనిచేయడం కుదరలేదంటారట నయ్యర్.
కానీ, అంతకుమించి లతతో.. ఓపీ నయ్యర్ కు నెలకొన్న వారే అందుకు ప్రధాన కారణం. అలాగే, లతాజీ కూడా తనకెప్పుడూ ఓపీ నయ్యర్ నుంచి పాట కోసం కాల్ రాలేదని చెప్పుకొచ్చేవారని.. అంతకుమించి తనకు తెలియదని సున్నితంగా దాటవేసేవారనీ చెబుతుంటారు. అలా రెండు కత్తులూ ఒకే ఒరలో ఇమడకుండా.. లత, నయ్యర్ మధ్య ఇగో ప్రాబ్లమ్స్ వాళ్ళ కోల్డ్ వార్ గేమ్ లో భాగమయ్యాయి. ఇద్దరు లెజండ్రీస్ పట్టువిడుపులతో ఏనాడూ ఒక్క గొడుగు కిందకు రాకుండా చేశాయి. సినిమా వంటి మ్యాజికల్ వరల్డ్ లో… చిరకాల శత్రువులు, చిరకాల మిత్రువులంటూ స్థిరంగా ఏమీ ఉండరు. అందుకు టాలీవుడ్ లో ఎస్పీబీ, సూపర్ స్టార్ కృష్ణ కథే ఓ ఉదాహరణ. మరలాంటిది బాలీవుడ్ లో మాత్రం.. నయ్యర్ అండ్ లత ఎందుకొకరికొకరు లైఫ్ టైమ్ దూరంగా ఉండాల్సి వచ్చిందన్నదే ఇప్పటికీ మిస్టీరీయస్ గా అర్థం కాని క్వొశ్చన్..?
అయితే, నయ్యర్ మొట్టమొదటి సినిమా ఆస్మాన్ తోనే.. నయ్యర్, లతాకు మధ్య పొరపచ్చాలు మొదలయ్యాయంటారు. ఓపీ నయ్యర్ వివాహ మహోత్సవం రోజే 1952లో ఆస్మాన్ సినిమా ఆఫర్ రావడం.. వెనువెంటనే నయ్యర్ తన భార్యతో సహా ముంబై రావడం జరిగిపోయాయి. ఆస్మాన్ కోసం పాటలకు కట్టాల్సిన బాణీల ప్రక్రియ పూర్తైంది. మూడు పాటల్ని సీహెచ్ ఆత్మ అనే అలనాటి గాయకుడితో, మరో నాల్గు పాటల్ని గీతాదత్ గాత్రంతో రికార్డింగ్ కూడా చేసేశారు. చివరి పాటను ఆత్మతో కలిసి డ్యూయెట్ పాడేందుకు అప్పటికే టాప్ పొజిషన్ లో ఉన్న లత కోసం కేటాయించారట. ఆత్మకు కూడా అప్పటికే నయ్యర్ రిహాల్సల్స్ కోసం సమాచారమిచ్చినా.. లత మాత్రం ఇతర సినిమా పాటల షెడ్యూల్ పూర్తి కాకపోవడంతో ఆ రిహాల్సల్స్ కి రాలేకపోయారు.
అయినా, లత కోసం వెయిట్ చేసినా అదే సిచ్యువేషన్. ఆమె కాదని రికార్డింగ్ స్టూడియో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు.. మరోవైపు ఆత్మ వంటి గాయకుడిని రమ్మని రిహార్సల్స్ లో లత మాత్రం రాలేని పరిస్థితి.. ఈ క్రమంలోనే అది అవమానంగా భావించిన నయ్యర్ కు కోపం వచ్చిందట. ఆది నుంచీ మొండి పట్టుదల కల్గిన మనిషైన ఓపీ నయ్యర్ ఆ అసహనంతో.. తన జీవితంలో ఇంకెప్పుడూ లతతో పని చేయకూడదని నిర్ణయించుకున్నారట. అలా ఆస్మాన్ సినిమా తర్వాత బాలీవుడ్ పరిశ్రమను రెండు దశాబ్దాలు శాసించిన నయ్యర్ లత లేకుండానే తన పాటలన్నీ రికార్డ్ చేయడం మాత్రం బాలీవుడ్ హిస్టరీలో.. వారిద్దరి సంగీత కలయికని చూడాలనుకున్న వారికి ఓ చేదు జ్ఞాపకం.
అలాగే మహబూబా సినిమా అవకాశం ఓపీ నయ్యర్ కు దక్కిన తరుణంలో జరిగిన ఘటన కూడా మళ్లీ లత, నయ్యర్ మధ్య ఉన్న దూరాన్ని పట్టి చూపించింది. అప్పటికే మహబూబా సినిమాకు మరో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ రోషన్ సంగీతమందించారు. కానీ, ఆ ప్రొడ్యూసర్ తో రోషన్ కు వచ్చిన పొరపచ్చాలతో.. మళ్ళీ ఓపీ నయ్యర్ ను సంప్రదించారట. కానీ, రోషన్ అప్పటికే నాల్గు పాటలను రికార్డ్ చేయగా.. అవన్నీ లతా మంగేష్కర్ తో పాడించారు. మిగిలిన సాంగ్స్ కూడా లతతోని రికార్డింగ్ కు ఒప్పందం కుదరగా.. ఓపీ నయ్యర్ మాత్రం ససేమిరా అన్నారట.
తానెప్పుడూ లతను తన పాటలు పాడమని అడుగబోనని మరోసారి తేల్చి చెప్పారు ఓపీ నయ్యర్. అదే సమయంలో తన చేత నయ్యర్ పాటలు పాడించడం లేదనే ఫిర్యాదునూ లత మ్యూజిక్ డైరెక్టర్స్ అసోసియేషన్ ముందు ఉంచలేదట. కానీ, అప్పటికే చాలా మంది సంగీత దర్శకులు ఉద్ధండులుగా బాలీవుడ్ లో రాణిస్తున్న సమయంలో.. వారంతా టాప్ పొజిషన్ లో ఉన్న లతకు అమితమైన మర్యాద ఇచ్చేవారు. లత విషయంలో ఓపీ నయ్యర్ వైఖరి మాత్రం.. వారందరికీ సహజంగానే కోపం తెప్పించింది. దాంతో బాలీవుడ్ లో అప్పటికే రాణిస్తున్న ఏ ఫీమేల్ సింగర్ నయ్యర్ రికార్డింగ్స్ కు హాజరుకాకుండా ఓ బ్యాన్ విధించారట.
అప్పుడే నయ్యర్ శంషాద్ బేగమ్ ను కలవడం.. ఆమె పాడటానికి ఒప్పుకోవడం జరిగింది. దానికి కారణం తనకొచ్చే ఆఫర్సన్నీ లతా మంగేష్కర్ కు వెళ్లిపోతున్నాయనే ఒకింత అక్కసుతో ఉన్న సమయంలో నయ్యర్ శంషాద్ బేగమ్ సంప్రదించడమే.. వెంటనే ఆమె ఒప్పుకోవడానికి గల ప్రధాన కారణం. అలా మెహబూబా సినిమా సమయంలో మళ్లీ మొదలైన నయ్యర్, లత వివాదంతో.. శంషాద్ బేగం ఆ సినిమాలోని మిగిలిన నాల్గు పాటలను పాడటమే కాకుండా.. నయ్యర్ తో జరిగిన మ్యూజికల్ జర్నీలో నంబర్ ఆఫ్ సూపర్ హిట్స్ అందించారు. అదే సమయంలో దశాబ్దాల కాలం పాటు నయ్యర్, లత మ్యూజికల్ కాంట్రాడిక్టరీ జర్నీ కూడా కొనసాగింది.
లత, నయ్యర్ వివాదం అక్కడితో ముగిసిపోలేదు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం లతా మంగేష్కర్ అవార్డును ఓపీ నయ్యర్ కు ప్రకటించిన సమయంలోనూ మళ్లీ తెరపైకొచ్చింది. అప్పుడు బాలీవుడ్ లోకి కొత్త కంపోజర్స్ అడుగు పెడుతున్న సమయంలో.. అవకాశాలు తగ్గి.. ఆర్థికంగా కూడా నయ్యర్ చిక్కిపోయిన పరిస్థితి. మరోవైపు రాయల్టీ రూపంలో ఓల్డ్ సంగీత దర్శకుల్లో నయ్యర్ కు, గాయకుల్లో లతకు మాత్రమే అంతో ఇంతో ఆర్థిక సహకారం అందుతున్న సయమమది. ఆ సమయంలో నాడే లక్ష రూపాయల భారీ పారితోషికంతో కూడిన అవార్డ్ ను ఓపీ నయ్యర్ తిరస్కరించేశారు. ఎవరైనా సంగీత దర్శకుల పేరిట అవార్డిస్తే తీసుకునేవాడిని కానీ.. గాయకుల పేరిట ఇచ్చే అవార్డును తానో సంగీత దర్శకుడిగా తీసుకోలేనని.. లతపై తనకున్న అభిప్రాయంతో.. నిర్ద్వందంగా రిజెక్ట్ చేసేశారు నయ్యర్.
కొసమెరుపేంటంటే అచ్చూ లత వాయిస్ ను పోలిన మరో నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్ పురితో ఆర్ పార్ లో మొహాబత్ కర్లోజీ బర్లో పాట మినహాయిస్తే.. ఆ తర్వాత ఎప్పుడూ పాడించలేదట ఓపీ నయ్యర్. అయితే, లతతో నయ్యర్ కు కొనసాగిన కోల్డ్ వార్ తో.. వారిద్దరి కలయికలో పాటలు వస్తే బాగుండనుకునే శ్రోతల చిరకాల కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది. అందుకే అంటారేమో బహుశా.. SOME VOIDS WILL NEVER BE FILLED AND SOME TALES REMAIN UNTOLD.. అని.
Share this Article