మీరెన్నయినా చెప్పండి… ఆంధ్రజ్యోతి తన కీర్తనలు, భజనల్లోనూ కొన్ని తప్పుల స్వీయాంగీకారాన్ని ప్రకటిస్తూ ఉంటుంది… ఈరోజు బ్యానర్ హెడింగ్ ఏమిటి..? బాధ్యత మరిచి ‘భజన’..! ఆ శీర్షిక పెట్టేసి, ఇక ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగసంఘాల్ని తూర్పారపట్టింది… ఇది రాస్తున్నప్పుడు అశోక్ బాబు, చంద్రబాబు బంధాల్ని కాస్త గుర్తుతెచ్చుకుంటే బాగుండేది… బట్ వోకే, ఆ శీర్షిక ఆంధ్రజ్యోతి వైఖరికి సరిగ్గా అద్దం పట్టినట్టుగా ఉంది… ఇందులో రాధాకృష్ణ ఏమంటాడు అంటే..?
‘‘మా నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణకు వోకే అన్నాక, మీరు వ్యతిరేకిస్తారా..? అవసరమైతే బహిష్కరిస్తాం అని బెదిరిస్తారా..? హన్నా, ఎంత ధైర్యం..? సర్కారు పెద్దల ప్రాపకం కోసం ప్రయత్నిస్తారా..? పరమ పవిత్రమైన ఎన్నికల విధుల కోసం ఆఫ్టరాల్ ప్రాణాలను పణంగా పెట్టలేరా..? మీదేం సేవ..? మీవేం బతుకులు..? మీ సహచరుల హక్కుల కోసం పోరాడలేరు గానీ, జగన్ ముందు దాసోహం అంటారా..?’’ దాదాపు ఇదే అర్థమొచ్చేలా సాగిపోయింది కథనం… అయితే..?
Ads
మొదట్లో ఏ కరోనా బూచి చూపి నిమ్మగడ్డ ఎన్నికల్ని వాయిదా వేశాడు..? ఇప్పుడు ఏం పరిస్థితి బాగుపడిందని ఎన్నికల్ని ప్రకటించాడు..? అసలు అధికార యంత్రాంగం సన్నద్ధత గురించి ఆలోచించాడా..? అయినా హక్కుల కోసం పోరాడటం లేదు కాబట్టి సదరు ఉద్యోగ సంఘాల నేతలకు మాట్లాడే హక్కులేదు, నోరుమూసుకుని ఈ ఎన్నికల విధులకు సిద్ధం కావాల్సిందే అని పిలుపునిస్తున్నదా ఆంధ్రజ్యోతి..?
నిమ్మగడ్డ చెప్పాడు కాబట్టి, ఆంధ్రజ్యోతి మద్దతు చెబుతోంది కాబట్టి… అందరూ ఎన్నికల విధులకు రెడీ అయిపోవాలా..? అయినా సగటు ఉద్యోగిని, తమ సంఘాల్లో సభ్యులను ఎలా కన్విన్స్ చేసుకోవాలో ఆయా సంఘాలు చూసుకుంటాయి… ఉద్యోగుల మనోభావాలకు వ్యతిరేకంగా వెళ్తే, వాళ్లే ఆ సంఘాల నేతలను ఛీత్కరిస్తారు… మధ్యలో ఆంధ్రజ్యోతికి నొప్పి ఎందుకొచ్చిందో మరి..? ఇంతకీ తమకు సంబంధించిన నిర్ణయాల్ని కూడా తాము ఆలోచించి తీసుకునే స్వేచ్ఛ లేదా ఉద్యోగుల సంఘాలకు… పోనీ, అవేమైనా ప్రజలకు విరుద్ధంగా ఉన్నాయా, ఒక మీడియా సంస్థ బురద జల్లడానికి..? దుమ్మెత్తిపోయడానికి..?
జగన్ వ్యతిరేకత, చంద్రబాబు సానుకూలత…. ప్రతి కథనానికీ అదే ప్రామాణికమా..? వాటికి భిన్నంగా ఎవరు మాట్లాడినా ఇక వాళ్లు జాతిద్రోహులు, బాధ్యతలు విస్మరించినవాళ్లేనా..? పైగా ఈ బాధ్యతారహిత కథనానికి ఆస్థాన విద్వాంసుడు, ఘాజీ సబ్బం హరి సహవాయిద్యమా..? ఇంత అర్జెంటుగా ఎన్నికలు పెట్టకపోతే మునిగిపోయింది ఏమిటి..? కోర్టులు విచారిస్తాయి సరే, కానీ మీడియాకు ఓ లైన్ ఉండాలి కదా…! ఆ విజ్ఞత ఎక్కడ పోయింది..? జగన్- నిమ్మగడ్డ పంచాయితీ, వ్యక్తిగత ద్వేషాలు పక్కన పెట్టండి… ఆయా పార్టీల దిక్కుమాలిన వైఖరులనూ పక్కనపెట్టండి… ఒకవైపు వేక్సినేషన్ మీద శ్రద్ధ పెట్టాల్సిన సందర్భంలో… చేజేతులా అధికార వ్యవస్థలే పల్లెప్రజలను కరోనా రిస్కులోకి నడిపించడాన్ని ఎలా సమర్థిస్తారు..?
Share this Article