సో వాట్..? ఓ నర్సు ‘‘బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా’’ పాటకు డాన్స్ చేసింది… అయితే ఏమిటట..? నిజమైన కర్కోటక అధికారులను, అక్రమార్కులను ఏమీ చేయలేని మన ప్రభుత్వం ఆమెకు మెమో ఇచ్చిందట… సిగ్గుపడాలి వ్యవస్థ… ఆమె ఓ నర్సు, కరోనా కాలంలో సేవలు చేసింది, తను కరోనాకు గురైంది, ఏదో ఆటవిడుపుగా ఓ పాటపాడితే తప్పేమిటట..? వీడియో కనిపించింది కాబట్టి చర్య తీసుకుంటారు, మరి వీడియో లేకపోతే..? అసలు ఈ కలెక్టర్లు ఎందుకిలా సంకుచితులవుతున్నారు…? వందలు, వేల కోట్లు మింగేవాళ్లను ఏమీ చేయలేరు, ఇదుగో ఈ చిన్న పిట్టలపై బ్రహ్మాస్త్రాలు..! పోనీ, ఆమె డ్యూటీ వదిలేసి అసభ్యంగానో, అశ్లీలంగానో ఏమీ రికార్డింగ్ డాన్స్ చేయడం లేదు కదా… ఏదో సరదాగా… చివరకు జనం థూ, చీ అనేసరికి మెమో వాపస్ అట ఇప్పుడు… సరే, దాన్నలా వదిలేస్తే… మరో ముచ్చట… ఆమధ్య ఓ పెళ్లి అప్పగింతల వేళ పెళ్లికూతురు బహిరంగంగా ఈ పాటకు డాన్స్ చేయడం చూసి… ‘ముచ్చట’ ఓ స్టోరీ రాసింది… ఒక పెళ్లికూతురు పెళ్లికొడుకు ఎదుట బారాత్ లో పాట పాడుతూ డాన్స్ చేసిందంటే అది కోట్ల మందికి కనెక్టయినట్టే అని చెప్పింది… కొందరు నవ్వారు, కొక్కిరించారు… కానీ ఏం జరిగింది చివరకు..? ఆ పాట ఎక్కడికో వెళ్లిపోయింది… ఊహించని రేంజ్…
ఆ పాటలో తెలంగాణ జీవం ఉన్నది… యాస ఉన్నది… సగటు పెళ్ళికూతురు హృదయం ఉంది… తన ఆశల పల్లవి అది, ఆకాంక్షల పల్లకీ అది… అందుకే అది అలా కనెక్టయింది… ఓ పెళ్లికూతురు, ఓ నర్సు మాత్రమే కాదు… ఈరోజు హల్దీ ఫంక్షన్లు, మెహెందీలు, సంగీత్ ఫంక్షన్లు, రిసెప్షన్లు మాత్రమే కాదు… ఏ చిన్న ఫంక్షన్ చూసినా అదే పాట, అవే డాన్సులు… ఒక్కసారిగా తెలంగాణ ప్రజానీకం దాన్ని వర్తమాన రాష్ట్ర వినోదగీతంగా ప్రకటించేసింది… నవ్వొచ్చిందేమిటంటే… కాదు, కాదు, ఆశ్చర్యం వేసిందేమిటంటే… ఓ హల్దీ ప్రోగ్రాంలో ఓ అమ్మాయి ఈ పాటకు డాన్స్ చేసింది, ఎవరో యూట్యూబులో అప్ లోడ్ చేశారు… అయిదారు లక్షల వ్యూస్… అంతేకాదు, అసలు ఈ పాటను ఆ పెళ్లికూతురు పాడాక, అది వైరల్ అయ్యాక, ఆ ఒరిజినల్ సాంగ్, ఇతర అనుకరణ videos పరిస్థితేమిటా అని యూట్యూబ్ చెక్ చేస్తే, ఇలా బోలెడు videos, దిమ్మెరబోయే రేంజ్ వ్యూస్ కనిపిస్తున్నయ్… నిజం…
Ads
- ఆ ఒరిజినల్ సాంగ్ వ్యూస్ 3 కోట్ల నుంచి 4.3 కోట్ల దాకా వెళ్లిపోయింది… ఈమధ్య కాలంలో ఇంత సూపర్ హిట్ మరొకటి లేదు… తొక్కలో సినిమా గీతాల్ని వదిలేసి జనం ఈ పాటే పాడుతున్నారు… వేరే పాట ఉచ్చరిస్తే ఒట్టు…
- ఫోన్ల కాలర్ ట్యూన్లుగా మారిపోయింది… బారాత్ డాన్స్ అలాగే upload చేసుకున్న టీవీ ఛానెల్స్ 20, 30, 40 లక్షల వ్యూస్ పొందాయి…
- సోకాల్డ్ సినిమా సింగర్లు విస్తుపోయి చూస్తున్నారు ఈ పాట పాపులారిటీని… ఎందుకంటే..? ఓ వీడియో ఉంది, జస్ట్, ఇద్దరు చిన్న పిల్లల్ని ఈ పాటకు డాన్స్ చేయించి, అప్ లోడ్ చేశారు… 7 లక్షల వ్యూస్…
- ఒక్కో లక్ష వ్యూస్ సంపాదించడానికి యూట్యూబ్ చానెళ్లు నానా కష్టాలూ పడుతుంటయ్ కదా… ఈ పాటను ఎవరితోనైనా పాడించి, డాన్స్ చేయించి అప్ లోడ్ చేస్తే చాలు అయిదారు లక్షల వ్యూస్ వచ్చేస్తున్నయ్… ఒకటి 14, మరొకటి 16, ఇంకొకటైతే 18 లక్షల views కొట్టేసింది… అన్నీ రీసెంటే…
- అంతెందుకు..? ఆ పెళ్లికూతురు వీడియోనే యథాతథంగా అప్ లోడ్ చేసినా లక్షల వ్యూస్ వచ్చేస్తున్నయ్… నర్స్ పాట వీడియోలకు కూడా లక్షల వ్యూస్ కనిపిస్తున్నయ్… జస్ట్, ఓ థంబ్ నెయిల్ పెట్టి తోసేయడమే…
- పెళ్లి బాజాలు, బ్యాండుల్లోనూ ఇదే ట్రెండ్… ఒకరు musical బ్యాండ్ వాయించి upload చేస్తే 6 లక్షల వ్యూస్…
- ఒకరు కేవలం సింగర్ మోహన పిక్ పెట్టి, లిరిక్ రాసేశాడు… బ్యాక్ గ్రౌండ్ లో పాట… 3 లక్షల వ్యూస్…
- దీనికి ముందుగా అభినందనలు చెప్పాల్సింది ముందుగా రచయిత లక్ష్మణ్… తరువాత సింగర్ మోహన… ఆ తరువాత ఆ ట్యూన్ కట్టిన సంగీత దర్శకుడు… ఇప్పట్లో దీన్ని బీట్ చేసే పాట రాదేమో… సంగీత్, రిసెప్షన్లు, బరాతుల్లో పాడబడే పాటలే సూపర్ హిట్… మిగతావాటిని జనం లైట్ తీసుకుంటున్నారు అని అర్థం… అంతే…!!
Share this Article