మిత్రుడు BT Govinda Reddy… ఏమంటున్నాడో ముందుగా చదవండి… ‘‘ఇందిరా గాంధీ భర్త ఫెరోజ్ గాంధీని ఫెరోజ్ ఖాన్ అని ముస్లింగా చిత్రీకరిస్తూ ఈ మధ్య సోషల్ మీడియాలో తరచూ పోస్టింగులు కనిపిస్తున్నాయి. ఆ వారసత్వం వల్లే ఆయన కోడలు సోనియా, మనవడు రాహుల్ లు ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తారని అవగాహన లేని కొందరు (బహుశా ఆరెస్సెస్ భావజాలం కలిగిన వారై ఉంటారు) విష ప్రచారానికి పూనుకోవడం బాధ కలిగిస్తోంది. రాజకీయాల సంగతి ఎట్లా ఉన్నా, సిసలైన దేశ భక్తుడు., చిన్న వయసులో స్వాతంత్రోద్యమంలో పాల్గొని మూడు సార్లు జైలుకు వెళ్లిన సమర యోధుడిని కించపర్చేలా, ఆయనను మరో మతంలో చేర్చడం అమానుషం. ఫెరోజ్ జెహంగీర్ గాంధీ (Feroze Jehaginr Ghandy) పార్శీ మతస్తుడు. టాటా, గోద్రెజ్, ప్రముఖ అణు శాస్త్రవేత్త డా. హోమీ జెహంగిర్ భాభా లు కూడా పార్శీలే. వీళ్ల ఆచారాలు హిందూ మతానికి దగ్గరగా ఉంటాయి. పేర్లలో జెహంగిర్, ఫెరోజ్ అని ఉన్నా ఇస్లాంకు ఏ సంబంధమూ లేదు.
ఫెరోజ్ విద్యావంతుల కుటుంబం. ఆయన తండ్రి ఆరోజుల్లోనే మెరైన్ ఇంజనీర్. మేనత్త Shirin Commissariat గొప్ప సర్జన్. ఇద్దరు అన్నలు, అక్కల తర్వాత ఆఖరి వాడు ఫెరోజ్. అలహాబాద్ లో డిగ్రీ చదువును మధ్యలో వదిలేసి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. ఆయన ఇంటి పేరు Ghandy. పలకడంలో గాంధీ అనే అంటారు. మహాత్ముడితో పరిచయం అయిన తర్వాత ఆయన తన ఇంటి పేరు ఇంగ్లిష్ స్పెల్లింగ్ ను Gandhi గా మార్చుకున్నారు. 1942 లో ఫెరోజ్ కు ఇందిరతో అలహాబాద్ లోని ఆనంద్ భవన్ లో హిందూ సంప్రదాయ పద్ధతితో వివాహం జరిగింది. నెహ్రూకు ఈ పెళ్లి ఇష్టం లేక ఇద్దరికీ నచ్చచెప్పాల్సిందిగా మహాత్మా గాంధీని కోరారు. వారిద్దరూ ఇష్టపడుతున్నందున వివాహం చేయడమే ఉత్తమమని మహాత్ముడు ఒప్పించడంతో నెహ్రూ స్వయంగా కన్యాదానం చేసి పెళ్లి జరిపించాడు.
1960లో గుండె పోటుతో మరణించేంత వరకూ ఆయన రెండు సార్లు రాయ్ బరేలీ ఎంపీగా ఉన్నారు. ఫెరోజ్ అంత్యక్రియలు కూడా హిందూ సంప్రదాయం ప్రకారం జరిగాయి. ఆయన అస్థికలు అలహాబాద్ లోని పార్శీ స్మశాన వాటికలో ఇప్పటికీ భద్రపర్చి ఉన్నాయి. పాకిస్తాన్ పితామహుడిగా పిలిచే మహ్మద్ అలీ జిన్నా కూతురు దినా జిన్నాను బాంబే డైయింగ్ కంపెనీ స్థాపించిన పార్శీ నెవెల్లే (నుస్లీ) వాడియా’ వివాహమాడారు. మత చాంధస దేశం పాకిస్తాన్ లో నెవెల్లేను ఎవరూ తప్పు పట్టలేదు. ఆయనకు వేరే మతం అంటగట్టి అవమానించ లేదు. కాంగ్రెస్ పార్టీపై అక్కసుతో కొందరు ఫెరోజ్ గాంధీ చుట్టూ వివాదాలు అల్లడం అమానుషం. (ఫెరోజ్ ఇందిరాల పెళ్లి ఫోటో, పక్కన జవహర్ లాల్ నెహ్రూ కూడా ఉన్నారు)’’ …………….
Ads
Share this Article