‘‘మా డీఎస్, అదే భయ్, మన నిజామాబాద్ ధర్మపురి సీనన్న కొడుకు మంచిగ వ్యాపారంలో డెవలప్ అయ్యిండు, పాలిటిక్సులకు కూడా ఒచ్చిండు… మస్తు షైన్ అవుతున్నడు పిల్లగాడు అనుకుంటిమి… పోయిపోయి బీజేపీల దుంకిండు… పోనీలే, ఏ పార్టీ అయితే ఏంది అనుకుంటిమి..? మెల్లమెల్లగ డీఎస్ కూడా దూరం అయిపోతుండె… మన టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తే ఓ పంచాయితీ, ఉంచుకుంటే ఇంకో పంచాయితీ… పోతేపోనీలే అని ఇడిసిపెడితిమి… ఆమధ్య నన్ను మెచ్చుకుంట యాడనో మాట్లాడిండు, ఖుష్ అనిపించింది… కానీ..?
కవితమ్మను ఓడగొట్టిరి, చూస్తుండగానే ఈ పిల్లగాడు ఎంపీ అయిపాయె… సర్లె, ఇది వాపే కదా, నాలుగు రోజుల్లో తగ్గిపోతది అనుకుంటిమి… సరే, పేకాట పేకాటే… అసలే మన దందాలు మామూలువి కావు… మన కేసీయార్ ఒక్కడే సపోర్ట్ చేస్తే అయితదా..? రూల్స్ తోని పోతే అయితదా..? దందా అన్నాక బొచ్చెడు కథలుంటయ్… తెలంగాణలోనైతే మనం ఏది చెబితే అది సై… మనం చెప్పిందే చట్టం… కానీ అక్కడ అమిత్ షా అనే ఓ కరోడా ఉన్నడు… అందరినీ గమనిస్తుంటడు…
Ads
అసలే నిమ్మగడ్డ ప్రసాద్ కథలు… తరువాత మేఘా… వాళ్లతో కలిసి మేం… డబ్బులు, సర్దుబాట్లు… బీజేపీ కన్ను పడనేపడింది… ఐటీలు, ఈడీలు, నిఘాలు, మన్నూమశానం స్టార్టయిపాయె… అక్కడికి కిషన్‌రెడ్డిని వెంటేసుకుని మంత్రుల్ని కలిస్తిమి… ఏమాటకామాట కిషన్‌రెడ్డి మంచోడు, చెప్పింది వింటడు… అడిగింది చేస్తడు… కానీ మరీ ఈ బండి, అర్వింద్ బ్యాచ్ వచ్చినంక కథ వేరే ఉంటంది… మీద నుంచి అమిత్ షా ఒత్తుడు…
బెంగాల్‌ల ఎన్నికలొస్తున్నయ్, మీ టీవీ9 చానెల్ స్టార్ట్ చేయాలె అన్నరు… చేస్తము అంటిమి… ఆఫ్టరాల్ మీడియా అంటేనే రాజకీయాలకు ఉపయోగపడే టూల్ కదా… పార్టీలోకి రావల్సి ఉంటది అన్నరు… దానికీ రెడీ అంటిమి… అమిత్ షా ఒత్తుడుకు మన కేసీయారే వొంగిపోతుంటే, మేం నిలబడ్తమా ఏంది..? అయినా మనం ఏ పార్టీల ఉంటే ఏముంది అనుకుంటిమి..?
ఓ కాషాయపు అంగీ కుట్టించుకుంటి… ఐనా ఈ ధర్మపురి అర్వింద్ ఇడిసిపెట్టడు ఏంది..? ఇగో, గిట్ల లెటర్లు పెడ్తండు, పరేషన్ చేస్తుండు… అరె, దందాలో ఉన్నం కాబట్టే, నువ్వు చెప్పినట్టు వింటున్నం, వాటికే అడ్డం పడితే ఇక మీ పార్టీలకు ఎందుకు రావాలె..?
చూసిన్రా అర్వింద్ తనే తన ఫేస్ బుక్ పేజీల పెట్టిండు ఈ లెటర్… నేను అన్యాలంగా ఆరోపణ చేస్తలేను… సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి, టీజీ వెంకటేష్… ఢిల్లీల చెప్పంగనే కాషాయం కట్టేసుకున్నరు… బస్, వాళ్ల జోలికి ఎవలూ పోతలేరు… మరి నేను కూడా వస్తా అని చెబుతున్నా సరే, గీ ఫిర్యాదులు ఏంది..? గిట్ల కాళ్లల్ల కట్టెలు పెట్టుడు ఏంది..? ఇది నియ్యతి కాదు… పరదా మీద పాలిటిక్సు వేరు, పరదా వెనుక కథలు వేరు ఉంటయ్… గీ పిల్లగానికి ఇంక సమజ్ అయితలేదా..? తను కూడా దందాలో ఉన్నోడే కదా… గిదేందివయా అర్విందూ…?’’
Share this Article